తల్లిలాంటి పార్టీ బీజేపీ

Party workers are like mother, donot forget their contribution - Sakshi

పార్టీ ఎంపీల శిక్షణా కార్యక్రమంలో మోదీ

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ తల్లివంటిదని, ఎంపీలు, మంత్రులుగా ఎదిగిన వారు పార్టీని మరిచిపోరాదని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ ఎంపీల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పార్టీని, పార్టీ కార్యకర్తలను తల్లితో పోల్చిన మోదీ.. ‘కుమారుడిని పెంచి పెద్దచేసిన తల్లి.. పెళ్లయిన తర్వాత ఆ కొడుకు తన కంటే భార్యపైనే ఎక్కువ మమకారం చూబితే చిన్నబుచ్చుకుంటుంది. అలాంటి కొడుకు మాదిరిగా కాకుండా ఎంపీలు, మంత్రులు అయిన మీరు పార్టీని, కార్యకర్తలను మరవకండి. మీకోసం ఎంతో శ్రమకోర్చిన కార్యకర్తలతో సంబంధాలు కొనసాగించండి’ అని వారికి ఉద్బోధించారు. పార్టీ ఈ స్థాయికి చేరుకోవడం కార్యకర్తల కృషి ఫలితమేనన్నారు. చట్ట సభల సభ్యులైనా, మంత్రులయినా పార్టీ కార్యకర్తగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు.

‘వయస్సుతో పనిలేకుండా, విద్యార్థిగా భావించినప్పుడే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు’ అని ప్రధాని తెలిపారు. ‘బీజేపీ కృత్రిమంగా ఏర్పడిన పార్టీ కాదు. క్షేత్రస్థాయి నుంచి బలంగా ఏర్పడిన పార్టీ. సైద్ధాంతిక బలం, ఆలోచనా విధానం కారణంగానే ఈ స్థాయికి చేరుకుంది. అంతేగానీ, ఏదో ఒక్క కుటుంబ వారసత్వంపై నడుస్తున్న పార్టీ కాదు’ అని ఈ సందర్భంగా ప్రధాని అన్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అనంతరం మీడియాకు తెలిపారు. రెండు రోజుల ఈ శిక్షణ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా కూడా ప్రసంగించారు. జేపీ నడ్డా ప్రసంగిస్తున్న సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ తదితరులు వేదికపై నుంచి కిందికి దిగి మిగతా ఎంపీల మధ్యన కూర్చున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top