పట్టాలెక్కాలి.. పరుగులు తీయాలి

Palamur Project And Mahabub Nagar Railway Projects Delayed - Sakshi

సాగునీటి ప్రాజెక్టులపైనే రైతుల ఆశలు

ఇప్పటికే కొన్నిచోట్ల సాగులోకి వచ్చిన బీడు భూములు

కేంద్రం జాప్యంతో పూర్తికాని రైల్వే ప్రాజెక్టులు

గత పాలకుల నిర్లక్ష్యంతో వలసలకు పడని అడ్డుకట్ట

పీపుల్స్‌ ఎజెండా - మహబూబ్‌నగర్‌ :కరువు... వలసలకు కేరాఫ్‌గా పేరొందిన పాలమూరు జిల్లా పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధికి నోచుకోలేదనే చెప్పాలి.  జిల్లా పొడవునా కృష్ణానది పారుతున్నా సాగు నీటి కష్టాలు తీరటం లేదు. నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నా, కేవలం రెండు ప్రాజెక్టులే సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో బీడు భూములే దర్శనమిస్తుంటాయి. 2015లో ప్రారంభించిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష చొప్పున ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందే వీలుంది. ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోన్న ఆ ప్రాజెక్టు పనులపైనే ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.  మరోపక్క.. ఏళ్ల క్రితం మంజూరైన, ప్రారంభమైన రైల్వే ప్రాజెక్టు పనులు నత్తకే నవ్వొచ్చేలా కొనసాగుతున్నాయి. ప్రతిసారి ఎన్నికల్లో తెరపైకి వచ్చి.. ఎన్నికల ఫలితాల తర్వాత కనుమరుగయ్యే ఇలాంటి సమస్యలెన్నో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్నాయి.

సాగు.. కొంత బాగు..
మక్తల్‌ మండలంలో నిర్మిస్తున్న సంగంబండ రిజర్వాయర్‌ ప్రాజెక్టు పనులు పూర్తి అయినప్పటికి రైతులకు సాగునీరు అందించేందుకు పిల్ల కాల్వల పనులు ఇంకా పూర్తి కాలేదు. మహబూబ్‌నగర్‌ మండల పరిధిలో 23 వేల ఏకరాల సాగు భూమిలో 12వేలు మాత్రమే బోర్ల సహాయంతో సాగు చేస్తున్నారు. అవసరం అయిన రిజర్వాయర్‌లు, చెరువులు లేకపోవడంతో వ్యవసాయానికి సమస్యగా మారింది. అదేవిధంగా హన్వాడ మండల పరిధిలో 16 వేల సాగు భూమి ఉండగా, 9 వేల ఎకరాలు మాత్రమే బోరుబావుల నీటితో సాగు చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో భూత్పూర్, అడ్డాకుల, మూసపేట మండలాలకు సాగునీరు వసతి కల్పించి మరింత భూమిని సాగులోకి తీసుకురావాల్సి ఉంది. కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాకపోవడం వల్ల 50 వేల ఎకరాలకు నీరు అందిం చాల్సి ఉండగా 20 వేల ఎకరాలకే నీరు అందిస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో సాగునీటి వనరులు లేకపోవడంతో రైతులు వర్షాధార పంటలపై మొగ్గు చూపుతున్నారు. కంది, వరి, పత్తి, జొన్న, పెసర, మినుము ప్రధాన పంటలు వేస్తారు.

వలసల నివారణకు..
మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఎన్నో ఏళ్లుగా ఈ మూడు నియోజకవర్గాల నుండి వేలాది మంది ఇతర ప్రాంతాలకు  వలస వెళ్లటం జరుగుతోంది.  వ్యవసాయ భూములున్నా ఏళ్ల తరబడి సాగునీటి సదుపాయం లేకపోవడం.. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం.. పరిశ్రమల ఏర్పాటు లేకపోవడం ఈ వలసలు దీర్ఘకాలంగా కొనసాగడానికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట మండలాల నుండి ఏటా 5వేల మంది ముంబాయి, పూణేకు వలసలు వెళ్తుంటారు. వీటి పరిధిలో ఉన్న తండాల్లో 70 శాతం మంది గిరిజనులు ఎప్పుడూ స్ధానికంగా ఉండరు. కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాలో ఉన్న 120 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామం నుండి ఐదారు కుటుంబాల చొప్పున వందలాది మంది ముంబాయి, బెంగళూరు, పూణే నగరాలకు వలస వెళ్తారు. మక్తల్‌ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్‌ ప్రాంతాల నుండి 2వేల మంది ప్రతి ఏటా వేసవిలో ముంబాయి, ఢిల్లీ ప్రాంతాలకు వలస వెళ్తారు.

దశాబ్దాలుగా..
మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లు, బ్రిడ్జిల ప్రతిపాదనలు, అసంపూర్తిగా ఉన్న రైల్వే బ్రిడ్జిలు వెక్కిరిస్తున్నాయి.  దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో రైల్వే బ్రిడ్జి(ఆర్‌వోబీ) ప్రతిపాదన గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉంది. మండల కేంద్రంలో రైలు మార్గం ఉండటంతో రైలు వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్‌ సమస్య కన్పిస్తోంది. కర్ణాటక, రాయిచూర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈక్రమంలో ఆర్‌వోబీ బ్రిడ్జి సమస్య పరిష్కారం చూపాల్సి ఉంది. జడ్చర్లలో రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) లేదా రోడ్‌ అండర్‌బ్రిడ్జి (ఆర్‌యూబీ) మంజూరు పెండింగ్‌లో ఉంది. బాదేపల్లి పట్టణంలో జడ్చర్ల రైల్వే స్టేషన్‌కు అతి దగ్గరలో ఆర్‌ఓబీ లేదా ఆర్‌యూబీ నిర్మించాలని దశాబ్దాల కాలంగా డిమాండ్‌ ఉంది. 2008లో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ ఆర్‌ఓబీ నిర్మాణానికి దాదాపు రూ.30కోట్లు మంజూరు చేశారు. అక్కడ ఆర్‌ఓబీ నిర్మాణం చేస్తే చుట్టపక్కల గల వ్యాపార దుకాణాల సముదాయాలకు నష్టం వాటిల్లుతుందని కొందరు వ్యతిరేకించగా ఆర్‌ఓబీ ప్రతిపాదన వెనక్కి వెళ్లింది.అక్కడ ఆర్‌యూబీ నిర్మించాలని మరికొందరు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు అక్కడ ఏ బ్రిడ్జి నిర్మించక పోవటంతో రైల్వే గేటు వేసినప్పుడల్లా ఆ ప్రాంతంగుండా రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో టిడి గుట్ట దగ్గర రైల్వే బ్రిడ్జి(ఆర్‌వోబీ), బోయపల్లి గేట్‌ దగ్గర రైల్వే బ్రిడ్జి, ప్రధాన రహదారి విస్తరణ, రైల్వే స్టేషన్‌ హోదా పెంపు ప్రతి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారుతోంది. 

కలగానే వికారాబాద్‌– కృష్ణ రైల్వే లైన్‌
వికారాబాద్‌ – కృష్ణ రైల్వే లైన్‌ ఏర్పాటు కోసం సర్వే చేసి పదేళ్లు గడిచినా ఇంత వరకు నిధులు మంజూరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్‌లో ప్రతీసారి మొండి చెయ్యి చూపుతోంది. ప్రతి సారి ఎన్నికల్లో అభ్యర్థులు రైల్వేలైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పినప్పటికి, ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. హైదరాబాద్‌ నుంచి మక్తల్‌ మండల కేంద్రం మీదుగా కృష్ణ రైల్వే స్టేషన్‌కు 14 ఏళ్ల క్రితం మంజూరైన పనులు భూ నిర్వాసితులకు పరిహారం అందకపోవడంతో ఇప్పటికీ పూర్తి కాలేదు. కొడంగల్‌ మీదుగా కృష్ణా – వికారాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణం సర్వేకే పరిమితమైంది. 

రవాణా వ్య(అ)వస్థ  
వాహనాల రద్దీ దృష్ట్యా... జడ్చర్ల మీదుగా వెళ్తున్న నాగపూర్‌–బెంగుళూరు (నాలుగులైన్ల) 44వ  నంబర్‌ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలనే డిమాండ్‌ ఉంది. మక్తల్‌

మీదుగా రాయిచూర్‌ (కర్ణాటక) వరకు నాలుగులైన్ల రోడ్డును పనుల పూర్తిలో జాప్యం జరుగుతోంది.  మహబూబ్‌నగర్‌ నుంచి మక్తల్‌ మీదుగా రాయిచూర్‌కు 167 అంతర్‌రాష్ట్ర రహదారిని  జాతీయ రహదారిగా మార్చాలనే డిమాండ్‌ ఏళ్లుగా ఉంది.

సైనిక్‌ స్కూల్‌..
నారాయణపేటలో సైనిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. పట్టణ శివారులోని లోకాయపల్లి దేవాలయం సమీపంలో 50 ఎకరాల భూమిని సర్వే చేసిన రెవెన్యూ అధికారులు నివేదిక సమర్పించారు. జాప్యం లేకుండా నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.  

పార్లమెంటు పరిధిలో వ్యవసాయ యోగ్యమైన భూమి :6 లక్షల ఎకరాలు
గత ఖరీఫ్‌లో సాగైంది:4.50 లక్షల హెక్టార్లు సాగు ప్రస్తుత రబీలో సాగుఅవుతుంది:లక్షన్నర హెక్టార్లు

పచ్చని పాలమూరు తయారు కావాలె..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా రైతులకు ఎంతో మేలు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మహబూబ్‌నగర్‌ జిల్లా పచ్చని పంటలతో కళకళలాడుతుంది. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు త్వరగా పూర్తిచేస్తే ఎంతో మంది రైతులకు మేలు జరుగుతుంది. దీనిని అడ్డుకోవడానికి కొందరు కోర్టులలో కేసులు వేస్తున్నా అన్నింటినీ అధిగమించి ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది.  – అనంతరెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

రైల్వే గేటు నిర్మించాలి
జడ్చర్ల రైల్వే స్టేషన్‌ సమీపంలో బాదేపల్లి పట్టణంలో రైల్వేగేటు వల్ల ఏళ్లు్లగా ఇబ్బంది పడుతున్నాం. పాతబజార్, బూరెడ్డిపల్లి, ఆలూరు తదితర గ్రామాలకు చెందిన ప్రజలు రైల్వేగేటు గుండా అవతలకు పోవలసి వస్తుంది. ఈ సమయంలో రైల్వేగేటు వేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక్కడ రైల్వే ఓవర్‌ లేదా అండర్‌ బ్రిడ్జి ఏదో ఒకటి నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.    
–పెద్ది రంగనాథ్,పాతబజార్, బాదేపల్లి

 వలసలు ఆపాలి
మక్తల్‌ నియోజకవర్గం చెంతనే కష్ణమ్మ ఉన్నా బీడు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు చేరక పంటలు లేక వలసలు ఆగడం లేదు. అన్ని మండలాల వలసలు నివారించాలంటే  నియోజకవర్గంలోని ప్రతి ఎకరాన్నీ కృష్ణ జలాలతో తడిపితేనే వలసలకు బ్రేక్‌ పడుతుంది. ఎత్తిపోతల పథకాలతో పాటు కాలువలను తవ్వి పొలాలకు సాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది.   సుధీర్, మక్తల్‌ నియోజకవర్గం - ముహమ్మద్‌ ముజాహిద్‌ బాబా, మహబూబ్‌నగర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top