2023లో అధికారమే లక్ష్యం

Our Target Is Power In 2023 Said By Central Minister Kishan Reddy - Sakshi

గోల్కొండపై కాషాయ జెండా ఎగరేద్దాం

బీజేపీ కార్యకర్తలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి హైదరాబాద్‌ రాక

ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు

ర్యాలీగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రాక

వేద పండితుల ఆశీర్వాదం.. ఘనంగా సన్మానం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేయాలని, గోల్కొండపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక శుక్రవారం తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీగా ఆయన్ను తీసుకొచ్చారు. అనంతరం వేద పండితులు కిషన్‌రెడ్డిని ఆశీర్వదించగా నాయకులు, అభిమానులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు.

‘‘నాకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారంటే కిషన్‌రెడ్డికి కాదు. ఇది ఒక సామాన్య కార్యకర్తకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. గతంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి వెంకయ్య నాయుడు, విద్యాసాగర్‌రావులకు ఈ గౌరవం దక్కింది. సాధారణ స్థాయి నుంచి వచ్చిన మోదీని పార్టీ ప్రధానిని చేసింది. 1980లో విద్యార్థి విభాగంలో కొనసాగిన సమయంలో దత్తాత్రేయ సహచర్యంలో రాజకీయ జీవితం ప్రారంభించాం. వి. రామారావు సూచన మేరకు 16 ఏళ్లు పార్టీ కార్యాలయంలో పనిచేశాను. యువమోర్చాలో 1980 నుంచి 2004 వరకు పనిచేశా. నాతో యువమోర్చాలో పనిచేసిన అనేక మంది మంత్రులు, సీఎంలు అయ్యారు. ఈరోజు వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం. రానున్న రోజుల్లో గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేయడమే లక్షంగా పనిచేయాలి.

కార్యకర్తలు అనేక త్యాగాలు చేసి పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ కార్యకర్త ప్రేమకుమార్‌ హత్యను ఖండిస్తున్నా. దీనిపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు అధికారులను కోరుతున్నా. రెండోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మనం ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలని విæ.రామారావు చెప్పారు. ఆయనకు, బంగారు లక్ష్మణ్, మజ్లిస్‌కు వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రంలో పార్టీని నిలబెట్టిన యోధుడు టైగర్‌ నరేంద్రకు, ఆయనలాగే పనిచేసిన బద్దం బాల్‌రెడ్డికి నివాళులర్పిస్తున్నా. పార్టీ ఈ స్థాయిలో ఉందంటే అనేక మంది త్యాగాల ఫలితమే. రానున్న రోజుల్లో త్యాగాలు చేసిన వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం’’అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

టీఆర్‌ఎస్‌ ఒక్కటే ఉండాలనే రాజకీయాలు
‘‘బీజేపీ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. లాలూచీ రాజకీయాలు చేయకుండా ప్రజల మన్నన లు పొంది అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కొన్ని సవాళ్లు ఉన్నా యి. అసెంబ్లీలో అధికార టీఆర్‌ఎస్‌ ఒక్కటే ఉండాలనే రాజకీయాలు చేస్తోంది. ఆ పరిస్థితిపై తిరగబడే రోజు వస్తుంది. కాంగ్రెస్‌కు ఢిల్లీలో, హైదరాబాద్‌లో స్థానం లేదు. కిషన్‌రెడ్డి అంకితభావంతో పనిచేసే కార్యకర్త. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందనడానికి కిషన్‌రెడ్డి ఎదుగుదల నిదర్శనం. రాష్ట్రంలో బీజేపీ రాజకీయ మార్పు పలుకుతుంది’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీరావు ఆశాభావం వ్యక్తం చేశారు.  

కేసీఆర్‌ బెంగాల్‌ రాజకీయాలు చేస్తే ఊరుకోం
అంతకుముందు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రసంగిస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన కిషన్‌రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. పార్టీ కోసం సైకిల్‌ మీద తిరిగిన వ్యక్తి ఎంపీ అయ్యారు. బెంగాల్‌ రాజేకీయాలను కేసీఆర్‌ తెలంగాణలో మొదలు పెడితే ఊరుకునేది లేదు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ కార్యకర్తల కళ్లలో వెలుగు కనిపిస్తోంది. నమ్మిన సిద్ధాంతం కోసం అనేక త్యాగాలు చేశాం. ఉగ్రవాదులు, నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయాం. ప్రస్తుతం ప్రజలు మనకు పట్టం కట్టారు. బీజేపీపై విశ్వాసం చూపి గెలిపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ లేదు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి కేవలం బీజేపీకే ఉంది’’అని పేర్కొన్నారు. ప్రజాసమస్యలు గుర్తించి ప్రజాపోరాటాలు చేయాలని, 2023లో గోల్కొండలో కాషాయ జెండా ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top