చట్టసభల్లో బీసీలందరికీ ప్రాతినిధ్యం

Opposition Leader YS Jagan assured to the BC candidates - Sakshi

ప్రతి కులానికీ అవకాశం కల్పిస్తాం 

బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ 

అవకాశం రాని కులాల వారికి ఇతరత్రా ప్రాధాన్యం   

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : బడుగు బలహీన వర్గాల వారు చట్టసభల్లో తమ వాణి వినిపించేలా చూస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులాల వారికి అటు కౌన్సిల్‌లోనో లేక అసెంబ్లీలోనో అవకాశం కల్పిస్తానని చెప్పారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించలేని వారికి టీటీడీ, శ్రీకాళహస్తి తదితర ఆలయాల బోర్డుల్లోనో, మరో విధంగానో అవకాశం కల్పిస్తానని చెప్పారు. తనకు తోడుగా కౌన్సిల్‌లో కూర్చోబెట్టుకుంటానని, అందుకు తనకు సహకరించాలని కోరారు. ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశం కల్పించినప్పుడు ఆయా కులాల అస్థిత్వం అందరికీ తెలుస్తుందన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 64వ రోజు బుధవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపానాయుడుపేట గ్రామంలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. చేనేత, పూసల కార్మికులను ఆదుకుంటానన్నారు. రికార్డులు తారుమారు చేసి పేదల భూములు కాజేసిన వారి భరతం పడతానని హెచ్చరించారు. అక్కచెల్లెమ్మల కన్నీటి గాథలతోనైనా ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుందేమో చూద్దామన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు జనానికి తాయిలాలు వేయడం బాబుకు అలవాటేనన్నారు. ఈ సమ్మేళనంలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

ప్రతి కులాన్నీ బాబు ఎలా మోసం చేశారో చూడండి.. 
‘‘బీసీలను మోసం చేసేందుకు (టీడీపీ ఎన్నికల ప్రణాళికలో వివిధ కులాలకు ఇచ్చిన హామీలు, చంద్రబాబు ఫొటో పోజులను చూపిస్తూ..) టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టారు. రకరకాలుగా ఫోజులు ఇస్తాడు. గౌడ సోదరులు కనిపిస్తే వారి భుజాన ఉన్న ట్యూబ్‌ తన భుజంపై వేసుకొని పోజులు కొడతారు. రోడ్డు పక్కన బుట్టలల్లే వాళ్లు కనబడితే వాటిని అల్లుతున్నట్లు పోజు పెడతాడు. పక్కనే చేనేత కార్మికులు కనబడితే వారి ఇళ్లల్లోకి వెళ్లి పక్కనే కూర్చొని ఫొటోలు దిగుతాడు. ఆ ఫొటోలతో ఎన్నికల ప్రణాళిక తయారు చేశాడు. ఇలా ప్రతి కులాన్నీ మోసం చేయడమే లక్ష్యంగా ఇచ్చిన ఎన్నికల హామీలకు లెక్కేలేదు. రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటారట. కురువ, కురుబలను ఎస్టీలుగా గుర్తిస్తారట. బోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటారట. ఇలా అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చి ప్రతి కులాన్నీ మోసం చేశాడు. చిత్రమేమిటంటే చేయలేనని తెలిసి కూడా చేస్తానని హామీ ఇవ్వడం. వాటిని ఎవరైనా అడిగితే వారిపై విరుచుకు పడటం, తాట తీస్తానని బెదిరించడం. ఇటీవల మత్స్యకారులు చంద్రబాబును నిలదీస్తే.. ముఖ్యమంత్రినే అడుగుతావా? తాట తీస్తా.. ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించాడు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రతి కులాన్నీ మోసం చేశాడు. 

బోయలపై ఇది మూడో తీర్మానం... 
మొన్న అసెంబ్లీలో బోయలను ఎస్టీలుగా చేర్చాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారట. ఆశ్చర్యం ఏమిటంటే అసెంబ్లీలో బోయలపై ఇది మూడో తీర్మానం. ఇక నా చేతిలో ఏమీ లేదు, నా పని అయిపోయింది, ఇక చేయాల్సింది కేంద్రమే అని చేతులు కడుక్కుంటాడు చంద్రబాబు. ఎన్నికలప్పుడేమో ప్రయత్నం చేస్తానని కాదు.. చేసేస్తా అంటాడు. ఇప్పుడేమో నా చేతుల్లో లేదని తప్పించుకుంటున్నారు. అది జరగదని ఆయనకు (బాబు) తెలుసు. కానీ ఏమి చేస్తాడో తెలుసా? అంతా అయిపోయినట్టేనని ఆయా కులస్తులను నమ్మించేందుకు సీఎంవో కార్యాలయం నుంచే ఫోన్లు చేసి కేక్‌లు కట్‌ చేసి సంబరాలు చేయమంటాడు. మరోపక్క అదే కార్యాలయం నుంచే వ్యతిరేకులకు ఫోన్‌ చేసి ధర్నాలు చేయండి.. ఆందోళనలు చేయండని చెప్పిస్తాడు. ఇంతటి దారుణమైన రా>జకీయం చేస్తున్న వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. అంతెందుకు ఇక్కడే చూడండి. పెరిక బలిజలు 40 ఏళ్లుగా బీసీలు. వాళ్లు తమ బీసీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించమని అడిగితే వాటిని ఇవ్వడం లేదు. అగ్నికుల క్షత్రియులున్నారు. వాళ్లు మత్స్యకారులు. బీసీ సర్టిఫికెట్ల కోసం వాళ్లు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అయినా దిక్కులేదు. అందుకే చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై ఆలోచన చేయమని కోరుతున్నా.  

బీసీ గర్జనలో డిక్లరేషన్‌ ప్రకటిస్తాం: బీసీలకు ఏమి చేస్తే మేలు జరుగుతుందనే దానిపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమించాం. ఆ కమిటీ రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గంలో పర్యటిస్తుంది. ప్రజలతో మమేకం అవుతుంది. పరిస్థితులను గమనిస్తుంది. పాదయాత్ర ముగిసిన తర్వాత బీసీ గర్జన ఏర్పాటు చేసి అందులో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తాం. అందులో బీసీలకు ఏం చేస్తామన్నది పొందుపరుస్తాం. మన ప్రభు త్వం వచ్చాక వాటిని తప్పకుండా అమలు చేస్తాం. చేనేత కార్మికుల కష్టాలేమిటో నాకు స్వయంగా తెలుసు. చేనేత సదస్సు జరిగినప్పుడు అనేక సంగతులు తెలుసుకున్నా. అందుకే చెబుతున్నా.. నేను చనిపోయిన తర్వాత నాన్న గారి ఫొటోతో పాటు నా ఫొటో కూడా ప్రతి ఇంట్లో పక్క పక్కనే పెట్టుకునేంతగా సాయం చేస్తా’’అని జగన్‌ భరోసా ఇచ్చారు. ఈ సమ్మేళనంలో బీసీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ జంగా కృష్ణమూర్తి తదితరులు ప్రసంగించారు. 

చంద్రబాబుకీ నాన్న గారికీ ఉన్న తేడా ఇదీ.. 
చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. 1978లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున అక్కడ పోటీ చేసి 2,500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నాన్నగారి పుణ్యాన మంత్రి అయ్యారు. ఐదేళ్లు పరిపాలించారు. తిరిగి 1983లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,500 మెజారిటీతో ఎన్టీఆర్‌ పార్టీ చేతిలో ఓడిపోయారు. అయినా ఎన్టీఆర్‌.. ఓడిపోయి చచ్చిన పాములా పడి ఉన్న చంద్రబాబును పార్టీలోకి తీసుకుని ఆదరించారు. మంత్రిని చేశారు. ఇంతా చేస్తే సొంత మామను అదీ కుమార్తెను ఇచ్చిన మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. అది బాబు నైజం. 

నాన్నగారు ఎలాంటి వారంటే.. 
నాన్నగారు చిన్నప్పుడు వెంకటప్ప అనే వడ్డెర కులానికి చెందిన మాస్టారి గారింట రెండు మూడేళ్లు ఉండి చదువుకున్నారు. ఆ విషయాన్ని నాన్న గారు మరచిపోకుండా వెంకటప్ప మాస్టారు పేరిట పులివెందులలో వెంకటప్ప మెమోరియల్‌ స్కూలు పెట్టారు. ఇప్పటికి 11..12 ఏళ్లయింది. వైఎస్సార్‌ ట్రస్ట్‌ తరఫున నా భార్య భారతి ఆ స్కూలును గొప్పగా నిర్వహిస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నా. 2500 మంది పిల్లలున్నారు. ఇంగ్లిషు మీడియం స్కూలు. యూనిఫారం మొదలు విద్య అంతా ఉచితమే. జిల్లాలో పదో తరగతిలో అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన స్కూలు కూడా అదే. తనను చదివించిన ఓ బీసీ కులానికి చెందిన మాస్టారు పట్ల వైఎస్సార్‌ చూపిన ప్రేమాభిమానం అది. కానీ చంద్రబాబు మాత్రం తనను ఆదరించిన మామనే వెన్నుపోటు పొడిచాడు. ఇద్దరి మధ్య తేడా ఏమిటో మీరే చూడండి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top