ఒక్కరోజే..

One Day Deadline For Lok Sabha Election Nominations - Sakshi

నాలుగు లోక్‌సభ సెగ్మెంట్లకు 33 నామినేషన్లు  

హైదరాబాద్‌కు ఒక్కరు.. చేవెళ్లలో ఆరుగురు

సికింద్రాబాద్‌ నుంచి 12 మంది

మల్కాజిగిరిలో అత్యధికంగా 14 మంది నామినేషన్లు

శని, ఆదివారాలు సెలవు మిగిలింది సోమవారం మాత్రమే

సాక్షి,సిటీబ్యూరో/సాక్షి మేడ్చల్‌జిల్లా: గ్రేటర్‌ పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం 33 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా మల్కాజిగిరి సెగ్మెంట్‌ నుంచి 14 నామినేషన్లు పడగా, అత్యల్పంగా హైదరాబాద్‌ నుంచి కేవలం ఒక్కరే నామినేషన్‌ వేశారు. శని, ఆదివారాలు సెలవు కారణంగా నామినేషన్లు స్వీకరించరు. ఇక సోమవారం ఒక్కరోజే గడువు ఉండడంతో.. ఆ రోజు భారీగా నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధవువుతున్నారు. హైదరాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇంకా  ఎవరినీ అభ్యర్థులుగా ప్రకటించలేదు. దీంతో ఈ నియోజకవర్గాల నుంచి కూడా ఆ పార్టీ తరఫున నామినేషన్లు పడలేదు. 

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి న్యూ ఇండియా పార్టీ పక్షాన డి.జయప్రకాశ్‌ నామినేషన్‌ వేశారు.  
సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి బీజీపీ పక్షాన జి.కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పక్షాన తలసాని సాయి కిరణ్‌ యాదవ్, న్యూ ఇండియా పార్టీ పక్షాన డి.జయప్రకాశ్, సోషలిస్టు యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్టు) పక్షాన మల్లేష్, లేబర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పక్షాన బత్తుల రవి, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పక్షాన పి. అరుణ కుమారి, పిరమిడ్‌ పార్టీ పక్షాన శక్తి సత్యవతి, స్వతంత్ర అభ్యర్థులుగా షేక్‌ మునీర్‌ పాషా, మీసాల గోపాల్‌ బాబా, పి.వెంకటేశ్‌ గుప్తా, పి.చిన్న లింగయ్య, ఆర్‌.లక్ష్మణ్‌నామినేషన్లు వేశారు.  
మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి శుక్రవారం అత్యధికంగా 14 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మేడ్చల్‌ కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో సహా పలు పార్టీల నుంచి ఎనిమిది మంది, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు.  
కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ వర్కింగ్‌  ప్రెసిడెంట్‌ అనుముల రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు కేఎల్‌ఆర్, కూన శ్రీశైలంగౌడ్, నందికంటి శ్రీధర్, ఉద్దమర్రి నర్సింహారెడ్డి ఉన్నారు.  
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి తరఫున వారి బంధువులు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.  
జాతీయ మహిళా పార్టీ నుంచి తోపుల రాజేశ్వరి, ఇండియన్‌ ప్రజా బంధు పార్టీ తరçఫున బిరు బాలామణి, లేబర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున ఎం.దశరథ్, జనసేన నుంచి బొంగునూరి మహేందర్‌రెడ్డి, ఫిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి కొండపర్తి పార్వతిదేవి, తెలంగాణ రైతు రాజ్యం పార్టీ నుంచి గడ్డం రవీందర్‌రెడ్డి నామినేషన్లు వేశారు.  

ఇండిపెండెంట్లు వీరే..   
ఎండీ ముషీరుద్దీన్, కర్నాటకపు నాగదేవ, సీహెచ్‌ చంద్రశేఖర్, శివలెంక నాగ ఉదయలక్ష్మి, పొన్నాల రాజేందర్, గోన సాయికిరణ్‌ విడివిడిగా తమ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎంవీ రెడ్డికి అందజేశారు.  
చేవెళ్ల స్థానానికి శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు తమ నామనేషన్లు సమర్పించారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, నాయకుడు కార్తీక్‌రెడ్డితో కలిసి ఆయన రెండు సెట్ల నామినేషన్లను చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌కు అందజేశారు.  
కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా శుక్రవారం నామినేషన్‌ వేశారు. వీరితోపాటు గుర్రం పాపిరెడ్డి (అంబేద్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ), కుమ్మరి గిరి (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), చిలుక సంజీవయ్య (తెలంగాణ ప్రజా సమితి), స్వతంత్ర అభ్యర్థి జైదుపల్లి యాదయ్య తమ నామినేషన్లను దాఖలు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top