నామినేషన్ల పర్వం

Nominations Starts From Today - Sakshi

నేటి నుంచి 25వ తేదీ వరకు స్వీకరణ

ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ

ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు

సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. మహానగరం పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి సంబంధిత లోక్‌సభ స్థానాల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు తమ వెంట ఐదుగురికి మించి కార్యాలయం లోనికి తీసుకెళ్లరాదని ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు విధించింది. సంబంధిత కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకే వాహనాలను అనుమతించనున్నారు. కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్‌ స్థానాలకు హైదరాబాద్‌ కలెక్టరేట్‌లోను, మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి కీసరలోని కలెక్టర్‌ కార్యాలయం, చేవెళ్ల స్థానానికి రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్‌ పత్రాలు సంబంధిత ఆర్డీఓ కలెక్టర్‌ వారివారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 

అభ్యర్థులపై వీడని సస్పెన్స్‌
నామినేషన్ల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ గ్రేటర్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల నుంచి బరిలోకి దిగే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్నదానిపై సస్పెన్స్‌ వీడలేదు. తమకే పార్టీ టికెట్‌ అని ఎవరికివారే ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అధికారికంగా వారికి బి–ఫారాలు అందకపోవడం గమనార్హం. ఇక అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి విపక్ష కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెల్లువలా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేరుతుండడంతో సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి మజ్లిస్‌ అభ్యర్థిగా అసదుద్దీన్‌ ఓవైసీ పోటీ చేయడం ఖాయమైంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు అధికారికంగా ఖరారు కాలేదు. మల్కాజ్‌గిరి బరిలో కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. చేవేళ్ల నుంచి కాంగ్రెస్‌ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీల నుంచి పోటీచేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత రాలేదు. సికింద్రాబాద్‌ నుంచి ప్రధాన పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులపైనా సస్పెన్స్‌ కొనసాగుతోంది. మొత్తంగా మరికొన్ని గంటల్లో అభ్యర్థుల ఎవరనేది తేలిపోతే.. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ఊపందుకోనుంది. అభ్యర్థులు తమ సెంటిమెంట్ల ప్రకారం మంచి రోజు, వారం, తిథి, నక్షత్రం, సమయం ఇలా ఎవరి కోణాల్లో వారు పరిశీలించుకొని తమ గురువులు, జ్యోతిష పండితుల సూచనల మేరకు నామినేషన్లు వేయనున్నారు.

కోడ్‌ అమలుకు92 నిఘా బృందాలు
సాక్షి,మేడ్చల్‌ జిల్లా: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కోడ్‌ అమలు కోసం 92 నిఘా బృందాలు పనిచేస్తున్నాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎంవీరెడ్డి ఆదివారం తెలిపారు. ఒక్కో టీమ్‌లో ముగ్గురు అధికారులు ఉంటారన్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 21 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. బైండోవర్లు, ఆయుధాల డిపాజిట్‌ చేయించటం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఎన్నికలు  ప్రశాంతంగా సాగేందుకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించనున్నట్లు పేర్కొన్నారు.

ఉదయం 11 నుంచిమధ్యాహ్నం 3 గంటల వరకు  

లోక్‌సభ స్థానం    నామినేషన్ల స్వీకరణ  
హైదరాబాద్‌       హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌
సికింద్రాబాద్‌       హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌
మల్కాజిగిరి     కలెక్టరేట్, కీసర
చేవెళ్ల             తహసీల్దార్‌ కార్యాలయం,    రాజేంద్రనగర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top