30 మందికి టి‘కట్‌’?

No ticket if loss with 30 thousand votes even - Sakshi

30 వేల ఓట్లతో ఓడినా, మూడుసార్లు ఓడినా నో టికెట్‌

కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం.. కీలక మార్పులకు రంగం సిద్ధం

రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికలో అర్హతలు, పలు ప్రామాణికతలు

గెలిచేవారికే టికెట్లు ఇచ్చేలా కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో దాదాపు 30 మంది సీనియర్లు, మాజీ ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నట్లు టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ముఖ్యనేతలు కూడా ఉన్నారని పేర్కొంటున్నాయి. ఏఐసీసీ అధినేతగా రాహుల్‌గాంధీ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో.. తెలంగాణ పార్టీలో కీలక మార్పులు, అంతర్గత సంస్కరణలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

అభ్యర్థులపై ఆచితూచి నిర్ణయం.. 
పార్టీ అధినేతగా రాహుల్‌ గాంధీ పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించాక జరిగే సాధారణ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా, ఆయనకు వ్యక్తిగతంగా కూడా ప్రతిష్టాత్మకం అవుతాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ స్థానంలో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం కొన్ని అర్హతలు, ప్రామాణికతలను నిర్దేశించుకుంటున్నట్లు పేర్కొంటున్నాయి. గతంలో కొందరు నేతలు క్షేత్రస్థాయిలో పనిచేయకున్నా, లాబీయింగ్‌తోనే టికెట్లు సంపాదించుకునే అవకాశం ఉండేదని.. ఇది వచ్చే ఎన్నికల్లో ఉండదని కాంగ్రెస్‌ జాతీయ నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పార్టీలో అంతర్గత సంస్కరణలు, వ్యవస్థాగతమైన మార్పులు జరుగుతాయని రాహుల్‌తో సన్నిహితంగా మెలిగే మాజీ ఎంపీ ఒకరు వెల్లడించారు. టీపీసీ ముఖ్యులు కూడా ఈ విషయాన్ని బలపరుస్తుండడం గమనార్హం. ‘‘రానున్న ఎన్నికల్లో టికెట్ల పంపిణీ, అభ్యర్థుల స్క్రీనింగ్‌ ఆషామాషీగా ఉండే అవకాశం లేదు. పార్టీలో సీనియర్లు అనే కోణంలో మాత్రమే టికెట్లు వచ్చే అవకాశాల్లేవు. అభ్యర్థి గెలుపోటములపై, పనితీరుపై, గత చరిత్రపై ఆధారపడి టికెట్లు ఉంటాయి. కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు అనేది ఎప్పుడైనా అధిష్టానం పరిధిలోని అంశమే. టీపీసీసీ నుంచి ప్రతిపాదనలు, అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారు. కానీ ఇక ముందు టీపీసీసీ నుంచి వచ్చే ప్రతిపాదనలను కూడా జాగ్రత్తగా పంపించాల్సి వస్తుంది. రాహుల్‌ గాంధీ ప్రతి అంశంపై లోతైన అవగాహనతో ఉన్నారు..’’అని ఏఐసీసీ ముఖ్యనాయకుడొకరు అభిప్రాయపడ్డారు. 

గెలుపు ఒక్కటే అర్హత! 
అభ్యర్థుల ఎంపిక కోసం కొన్ని అర్హతలు, ప్రామాణికతలను నిర్ణయించుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో 30 మందిదాకా సీనియర్లు, మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ టికెట్లు దక్కే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘వరుసగా మూడు సార్లు ఓడిపోయినవారికి టికెట్లు రావు. గతంలో జరిగిన ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో ఓడినవారికి కూడా ఈ సారి టికెట్లు ఇవ్వకూడదని ఏఐసీసీ భావిస్తోంది. సామాజిక సమతూకం అంశంపైనా జాతీయస్థాయిలో ప్రత్యేకంగా ఒక విభాగం పనిచేస్తున్నది. ఓ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఎక్కువగా గెలుస్తున్నారు, దానికి కారణాలేమిటి వంటి విషయాలనూ అధ్యయనం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కేవలం ఏదైనా సామాజికవర్గానికి చెందడం మాత్రమే అర్హత కాదు. గెలుపు ఒక్కటే అర్హత. ఏఐసీసీ ఈ దిశగానే సమగ్ర నివేదికను తెప్పించుకుంటున్నది..’’అని పార్టీలో జాతీయ స్థాయిలో కీలక సంబంధాలున్న నాయకుడు వివరించారు. ఈ లెక్కన మూడు సార్లు ఓటమి, 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో దాదాపు 30 మందికిపైగా కాంగ్రెస్‌ టికెట్లు పొందే అర్హత కోల్పోతారని చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top