బీజేపీ రహస్య సమ్మతి లేనిదే.. వాళ్లు దేశం విడిచారా?

Nirav Modi, Vijay Mallya leave India, Arvind Kejriwal fires on bjp - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)లో భారీ కుంభకోణానికి పాల్పడిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోవడంపై ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా మండిపడ్డారు. బీజేజీ రహస్య సమ్మతి లేనిదే నీరవ్‌మోదీగానీ, విజయ్‌ మాల్యాగానీ దేశాన్ని విడిచారా? ఇది నమ్మశక్యమా? అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పీఎన్‌బీకి కుచ్చుటోపి పెట్టిన కేసులో నీరవ్‌ మోదీ ఇంట్లో, కార్యాలయాల్లో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఈడీ) సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిం‍దే. అంతకుముందు ఈ భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్‌ మోదీ దేశం విడిచి పారిపోయారు. పీఎన్‌బీ ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయక ముందే భారత్‌ను విడిచి స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు సమాచారం. పీఎన్‌బీలోని ముంబై బ్రాంచులో రూ.11వేల కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయని బ్యాంకు బుధవారం రెగ్యులేటరీకి రిపోర్టు చేసింది. ఇన్నివేల కోట్ల నగదును విదేశాలకు తరలించినట్టు తేల్చింది. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాగానే, బ్యాంకింగ్‌ రంగం తీవ్ర షాకింగ్‌కు గురైంది.

ఈ అక్రమాల్లో బడా వజ్రాల వ్యాపారి, బిలీనియర్‌ నీరవ్‌ మోదీ పాత్ర ఉన్నట్టు పీఎన్‌బీ ఆరోపించింది. ఈయనపై సీబీఐ వద్ద రెండు ఫిర్యాదులు కూడా దాఖలు చేసింది. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందు నీరవ్‌పై రూ.280 కోట్ల చీటింగ్‌ కేసు నమోదైంది. ప్రస్తుతం పీఎన్‌బీ కుంభకోణంలో నీరవ్‌ పాత్ర ఉన్నట్టు ఆరోపిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా సీబీఐతో పాటు ఈడీ కూడా మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసింది. అయితే రూ.5000 కోట్లను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు నీరవ్‌ మోదీ చెబుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top