కమలనాథుల్లో కొత్త ఉత్సాహం! 

New excitement in BJP - Sakshi

గ్రామీణ ప్రాంతాల్లోనూ గెలిచి సత్తా చాటుతామంటున్న నేతలు 

పట్టణప్రాంత పార్టీ అన్న ముద్ర చెరిగిపోతుందనే విశ్వాసం 

సాక్షి, హైదరాబాద్‌: కమలనాథుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో గణనీయమైన స్థానాల్లో గెలుపొంది సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతానికి పరిమితమైన పార్టీగా ఉన్న ముద్రను దూరం చేసుకునే అవకాశం వచ్చిందని భావిస్తున్నారు. 2014లో బీజేపీ గెలిచిన 5 సీట్లు కూడా హైదరాబాద్‌ పరిధిలోనివే కావడంతో ఈసారి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గెలుపు ద్వారా పార్టీ మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగానే కనీసం 5 సీట్లయినా గెలుచుకున్నారనే అపప్రదను తొలగించుకునేందుకు ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. 

ఓట్ల శాతం పెరుగుదలపై విశ్వాసం.. 
రాష్ట్రంలో ఒక్కస్థానం మినహా అన్ని సీట్లకు పోటీ చేసిన నేపథ్యంలో పార్టీకి పడే ఓట్ల శాతం కూడా గణనీయంగా పెరగుతుందని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానంగా యువత, మహిళా వర్గాలను ఆకర్షించగలగడం కలిసొచ్చే ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నారు. దాదాపు 20 శాతం వరకు ఓటింగ్‌ శాతాన్ని పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో తెలంగాణలో ప్రధాన రాజకీయపార్టీగా ఎదుగుతామని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలమెంత అని ప్రశ్నించేవారికి కనువిప్పు కలిగేలా తమ ఓట్లు, సీట్లు వస్తాయని ఓ ముఖ్య నేత ఆశాభావం వ్యక్తం చేశారు. 

పెద్ద సంఖ్యలో డిపాజిట్లు.. 
రాష్ట్రవ్యాప్తంగా కనీసం 70–80 సీట్లలో తమ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 నుంచి 10 సీట్ల వరకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తోంది. కరీంనగర్, కల్వకుర్తి, సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, దుబ్బాక, నారాయణ్‌ఖేడ్, నిజామాబాద్‌ (అర్బన్‌), భూపాలపల్లి, జుక్కల్, మలక్‌పేట, మహేశ్వరంలలో కనీసం ఐదారు సీట్లలోనైనా పార్టీ విజయం సాధించొచ్చని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.  

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. 
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ కొత్త ప్రాంతాలకు విస్తరణ, గతంలో పట్టున్న ప్రాంతాల్లో సంబంధాల పునరుద్ధరణ వంటి అంశాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల సాధనకు ఉపయోగపడతాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ‘కార్పెట్‌ బాంబింగ్‌’మాదిరిగా ప్రధాని నరేంద్రమోదీ సహా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కరీ, సుష్మాస్వరాజ్, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, యోగీ ఆదిత్యనాథ్, రమణ్‌సింగ్, తదితర జాతీయస్థాయి నేతల ప్రచారం రాష్ట్రంలో పార్టీకి ఎంతో మేలు చేకూర్చిందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టిన వ్యూహరచన, కార్యాచరణను లోక్‌సభ ఎన్నికల నాటికి మరింత విస్తృతపరిస్తే పార్టీకి మంచి ఫలితాలొస్తాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ఎంపీ సీట్ల పరిధిలో పోలింగ్‌బూత్‌ స్థాయిలో పడే ఓట్ల ద్వారా పార్టీ బలాన్ని పరీక్షించుకునేందుకు వీలవుతుందని భావిస్తున్నారు. బూత్‌స్థాయి మేనేజ్‌మెంట్‌పై మరింత దృష్టిపెడితే లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చుననే అభిప్రాయంతో ఉన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top