టీడీపీ, పవన్ ఏవిధంగా శత్రువులు?

Netizens Questions how TDP, Janasena are rivals - Sakshi

కొన్ని పార్టీలు అందరికీ తెలిసేలా పొత్తులు పెట్టుకుంటే, మరికొన్ని పార్టీలు మాత్రం గెలుపుకోసం కాకుండా చీకటి ఒప్పందాలతో ప్రత్యర్థుల ఓటమి కోసమే పని చేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పైకి పొత్తుల్లేవంటూనే, కొన్ని పార్టీలు చీకటి ఒప్పందాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ప్రశ్నించడానికే జనసేన’ అంటూ సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ ఏర్పాటుచేసిన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా అధికార పార్టీ నీడగా సాగుతూ వచ్చి ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ‘బీ’ టీమ్‌గా స్థిరపడిపోయింది. కాగా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో కూడా చంద్రబాబునాయుడు పొత్తులకు దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని, దానిని ప్రజలు ఛీత్కరించడంతో ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తుల్లేవని చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఇదంతా బయటకు మాత్రమే కనిపించే సీన్‌. లోపల మాత్రం ఇరు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే తీరులోనే నడుస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి జనసేన ‘బీ’ టీమ్‌గా.. కాంగ్రెస్‌ ‘సీ’ టీమ్‌గా పనిచేస్తున్నాయి. 

భూమి గుండ్రంగా తిరిగినట్టు కొన్ని రాజకీయ పార్టీలు అటుతిరిగి ఇటుతిరిగి ఒక్కచోటకే చేరాయని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీకి సిద్దమైనట్టు కనిపిస్తున్నా, వారిద్దరూ ఏవిధంగా శత్రువులవుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్-బీఎస్పీతో పొత్తు, బీఎస్పీ-సమాజ్ వాది పార్టీతో పొత్తు, సమాజ్ వాది పార్టీ -కాంగ్రెస్‌తో పొత్తు, కాంగ్రెస్- టీడీపీతో పొత్తు, మరి టీడీపీ- పవన్ కళ్యాణ్‌లు ఏవిధంగా శత్రువులు..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి జనసేన బ్రాంచ్‌ ఆఫీస్‌ అంటూ మండిపడుతున్నారు. 

చంద్రబాబు వినతి మేరకు మాయావతి పవన్‌తో భేటీకి, పొత్తుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమె అంగీకరించడమే ఆలస్యమన్నట్లు పవన్‌ ఆగమేఘాల మీద ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపలేని బీఎస్‌పీకి 21 అసెంబ్లీ సీట్లు, 3 లోక్‌సభ సీట్లు కేటాయించి సొంత పార్టీ వారినే విస్మయానికి గురిచేశారు. మరోవైపు.. సీపీఎం, సీపీఐ పార్టీలు పవన్‌ వెంట ఏడాదికిపైగా తిరుగుతున్నా వారికి చెరొక ఏడు అసెంబ్లీ స్థానాలు, చెరో రెండు లోక్‌సభ స్థానాలే కేటాయించారు. రాష్ట్రంలో అసలు పునాదులే లేని బీఎస్పీకి ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించి, వామపక్షాలకు తక్కువ స్థానాలు కేటాయించడం గమనార్హం. ఇదంతా కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన పునాదిగా ఉన్న వర్గాల ఓట్లను చీల్చేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడగా అందరికీ అర్థమవుతోంది.

కాగా, సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ ఆదివారం అకస్మాత్తుగా జనసేనలో చేరారు. చంద్రబాబు సూచనలతోనే ఈ వ్యవహారం సాగిందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీబీఐ జాయింట్‌ డైరక్టర్‌గా కొనసాగిన కాలంలో లక్ష్మీనారాయణ చంద్రబాబు, కాంగ్రెస్‌ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతూ వైఎస్‌ జగన్‌పై అక్రమంగా దాఖలు చేయించిన కేసుల్లో నిబంధనలకు విరుద్ధమైన దర్యాప్తు సాగించారన్న విమర్శలు కోకొల్లలు.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించినా.. కీలకమైన కొన్ని స్థానాలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. పవన్‌ కల్యాణ్, లక్ష్మీనారాయణల కోసమే ఇలా చేశారన్న అభిప్రాయం తెలుగుదేశం నుంచే వినిపిస్తోంది. పవన్‌కల్యాణ్, లక్ష్మీనారాయణలు పోటీచేయవచ్చని ప్రచారం జరుగుతున్న గాజువాక, భీమిలి, పెందుర్తి తదితర సీట్లకు చంద్రబాబు తన అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. వాళ్లిద్దరూ పోటీచేసే నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి పరోక్షంగా వాళ్లకు సహకరించేందుకే చంద్రబాబు ఆయా స్థానాలను ప్రకటించలేదని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top