గల్లీ నుంచి ఢిల్లీకి...

Narendra Modi Influential Political Leader  - Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : ‘భాయియోం.. ఔర్‌ బెహనోం’ అంటూ 2016 నవంబర్‌ 8 రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఆ మాటే జనం మధ్యన అప్పట్లో మార్మోగింది. భాయియోన్... ఔర్ బెహనోం... తో ఆయనపై అనేక సెటైర్లు మొదలయ్యాయి. ఏ సభలోనైనా ఆయన తన ప్రసంగం మొదలుపెట్టడంతో పాటు ప్రతి పేరా ప్రారంభంలో అన్నట్టు ఈ పదం మధ్యమధ్యలో ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా అనూహ్య నిర్ణయాలు ప్రకటించే ముందే కాదు... తన ఆహార్యంలోనూ మోదీ తనకంటూ ఒక  ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయ రంగంలో కుర్తా పైజమాతో పాటు వాటిపై భిన్న రంగుల జాకెట్లతో ఆయన వేషధారణ మిగిలిన నేతల కంటే భిన్నంగా కనిపిస్తుంది. 

సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి
సంకీర్ణ రాజకీయాలను తోసిరాజని 2014 లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో సత్తా చాటి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ 1950 సెప్టెంబర్‌ 17న ప్రస్తుత గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో దామోదర్‌దాస్‌ మూల్‌చంద్‌ మోది, హీరాబెన్‌ మోదీకి జన్మించారు. బాల్యంలో వాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో తండ్రి నిర్వహించే టీ దుకాణంలో పనిచేసిన మోదీ ఆ తర్వాత బస్‌ టెర్మినల్‌లో తన సోదరుడి టీ స్టాల్‌లోనూ పనిచేశారు. 1967లో పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న మోదీ ఎనిమిదేళ్ల వయసు నుంచే స్ధానిక ఆరెస్సెస్‌ శాఖా సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో అత్యంత చిన్నవయసులో యశోదాబెన్‌ను వివాహమాడారు. ఇక 1978లో మోదీ యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ నుంచి సార్వత్రిక విద్య ద్వారా పొలిటికల్‌ సైన్స్‌లో బీఏ పట్టా పొందారు. 1983లో గుజరాత్‌ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఏ పట్టా పొందారు. 

ఛాయ్‌వాలా... 
ఆరెస్సెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన మోదీ 1985లో బీజేపీలో అడుగుపెట్టారు. 1986లో ఎల్‌కే అద్వానీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ గుజరాత్‌ బీజేపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన మోదీ 1990లో బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సభ్యుడి స్ధాయికి ఎదిగారు. 1994లో అద్వానీ ప్రోద్బలంతో ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మోదీ పార్టీ కార్యదర్శిగా 1995 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తనదైన వ్యూహాలతో ముందుకెళ్లారు. ఇక గుజరాత్‌ బీజేపీ నేత శంకర్‌సింగ్‌ వాఘేలా కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో పార్టీని కాపాడేందుకు మోదీ చొరవ చూపుతూ 1998లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి బాటలు పరిచారు.

గుజరాత్‌ సీఎంగా..
2001లో గుజరాత్‌ సీఎం కేశూభాయ్‌ పటేల్‌ అనారోగ్యానికి గురికావడం, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో పటేల్‌ స్దానంలో మోదీని గుజరాత్‌ సీఎంగా బీజేపీ అగ్రనేతలు ఎంపిక చేశారు. రాజ్‌కోట్‌ 2 నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిని ఓడించడం ద్వారా 2002 ఫిబ్రవరి 24న మోదీ గుజరాత్‌ అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఇక 27 ఫిబ్రవరి 2002 గోద్రా అల్లర్లు అనంతరం చెలరేగిన హింసాకాండతో మోదీ అపప్రద మూటగట్టుకున్నారు. గోద్రా అనంతర హింసలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారని స్వయంగా గుజరాత్‌ ప్రభుత్వమే వెల్లడించగా, మృతుల సంఖ్య 2000  పైనేని ఇతర సంస్థలు పేర్కొన్నాయి. 2002 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో బీజేపీ గుజరాత్‌లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుజరాత్‌లో బీజేపీని మోదీ గెలిపించుకుని పార్టీలో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోదీ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో సఫలీకృతమయ్యారు. మోదీ వారణాసి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

హాబీలు : యోగాసనాలు, బ్రాండెడ్‌ వాచీల సేకరణ, ఫోటోగ్రఫీ, సోషల్‌ మీడియా 
ఇష్టమైన ఆహారం : వైట్‌ కట్టా దోక్లా, కిచిడీ, బేసన్‌ ఖాండ్వి, ఉంధియో
-మురళి పులిజాల

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top