చిన్న పార్టీలతో జట్టు.. మోదీ ఎఫెక్టు

Narendra Modi Effect on Bihar Elections - Sakshi

కదనరంగం:  బిహార్‌

బిహార్‌లో బీజేపీ కూటమిపైనే అందరి అంచనాలు

పార్టీల గెలుపోటముల్లో దళితులే నిర్ణయాత్మక శక్తి

అన్ని పార్టీల్లోనూ దాదాపుగా సీట్ల పంపిణీ పూర్తి

హిందీ ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత రాజకీయ ప్రాధాన్యమున్న ఎన్నికల క్షేత్రం బిహార్‌. 40 లోక్‌సభ సీట్లతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తోంది. కిందటి ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 22 సీట్లు గెలుచుకుంది. లోక్‌జనశక్తి (ఎల్జేపీ), రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) అనే చిన్న పార్టీలతో బీజేపీ పొత్తుకు మోదీ గాలి తోడైంది. ఎల్జేపీకి ఆరు, ఆర్‌ఎల్‌ఎస్పీకి మూడు సీట్లు దక్కాయి. ఇప్పటి ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) కిందటిసారి కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి పోటీచేసింది. పాలక సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న జనతాదళ్‌–యూ (జేడీయూ) సీపీఐతో పొత్తుపెట్టుకుని రెండే సీట్లు సాధించింది. 2014లో ఆర్జేడీకి 4, కాంగ్రెస్‌కు 2, ఎన్సీపీకి ఒక సీటు లభించాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ రాజీనామా, జేడీయూతో ఆర్జేడీ స్నేహం, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ తదితర పార్టీలతో కూడిన మహాగఠబంధన్‌ గెలుపు, 2017 జూలైలో మళ్లీ జేడీయూ, బీజేపీ చేతుల కలపడం వంటి పరిణామాల ఫలితంగా రాజకీయాలు అప్పటికీ ఇప్పటికీ పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం బీజేపీ నుంచి సుశీల్‌కుమార్‌ మోదీ నితిష్‌ కాబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

బీజేపీ కూటమి వైపే మొగ్గు?
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్‌ఎల్‌ఎస్పీ, మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ నాయకత్వంలోని హెచ్‌ఏఎంతో కలిసి ఆర్జేడీ పోటీ చేస్తోంది. జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏకు బీజేపీ నాయకత్వం వహిస్తోంది. ఆర్డేడీకి వ్యతిరేకంగా గతంలో అనేక ఎన్నికల్లో పోటీచేసిన బీజేపీ, జేడీయూ బలమైన జోడీ. 2009 ఎన్నికల్లో ఈ కూటమి మొత్తం 40 సీట్లలో 32 కైవసం చేసుకుంది. అగ్రవర్ణాల మద్దతు ఉన్న బీజేపీ, బీసీలు, బాగా వెనుకబడిన బీసీలు, దళితుల మద్దతు ఉన్న జేడీయూ ఈసారి చేతులు కలపడంతో గతంలో మాదిరిగానే మంచి ఫలితాలు సాధిస్తాయని అంచనా. దీనికితోడు సీఎం నితీశ్‌కు నిజాయతీపరుడనే పేరు, సుపరిపాలన కూడా బిహార్‌లో ఎన్డీఏ మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఒక్క 2004లో మినహా బీజేపీ–జేడీయూ కూటమి ప్రతి ఎన్నికల్లోనూ ఘన విజయమే సాధించింది.

లాలూ లేని ఎన్నికలు
రాష్ట్ర సీఎంగా, రైల్వే మంత్రిగా పనిచేసి విశేష జనాదరణ సాధించిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కొన్ని కేసుల్లో శిక్షలు పడి జైల్లో ఉన్నారు. లాలూ ప్రచారంలో లేకుండా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. బెయిలు రాకపోవడంతో ఆయనపై జనంలో సానుభూతి పెరిగితే ఆర్జేడీకి అనుకూల వాతారణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాంచీలోని రిమ్స్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. హిందీ రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించే కులం ప్రభావం 2019 పార్లమెంటు ఎన్నికలపై ఎంత ఉంటుందో చెప్పడం కష్టం. కుర్మీ, కోయిరీ వంటి బీసీ కులాలు జేడీయూకు పునాదిగా ఉన్నాయి. యాదవులు, ముస్లింలు, దళితుల్లో కొన్ని వర్గాలు ఆర్జేడీ కూటమికి మద్దతు పలుకుతాయని అంచనా. 24 శాతం జనాభా ఉన్న మహా దళితులు రెండు కూటముల్లో ఏది గెలిచేదీ నిర్ణయించే స్థితిలో ఉన్నారు.

సీట్ల పంపిణీ పూర్తి
పాలక సంకీర్ణ కూటమిలోని ప్రధాన పార్టీలు బీజేపీ, జేడీయూలు చెరో 17 సీట్లకు పోటీచేస్తాయి. ఇదే కూటమిలోని ఎల్జేపీకి ఆరు సీట్లు కేటాయించారు. ఆర్జేడీ కూటమిలోని పార్టీలు కలిసి పోటీచేసే సీట్ల సంఖ్య కూడా ఖరారైంది. ఆర్జేడీ 20, కాంగ్రెస్‌ 11, ఆర్‌ఎల్‌ఎస్పీ 3, హెచ్‌ఏఎం 2 సీట్లకు పోటీ చేస్తాయి. మొదట 14 సీట్లు కావాలన్న కాంగ్రెస్‌కు పదే కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. ఫిబ్రవరి 3న రాహుల్‌గాంధీ పట్నా ర్యాలీ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌లో ధీమా పెరిగింది. దీనికితోడు మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడంతో బిహార్‌లో తాము ఒంటరి పోరుకు కూడా సిద్ధమని రాష్ట్ర కాంగ్రెస్‌ నేత ఒకరు ప్రకటించారు. బేగుసరాయ్‌ సీటు సీపీఐ విద్యార్థి నేత కన్హయ్యాకుమార్‌కు ఇవ్వడానికి ఆర్జేడీ నిరాకరిస్తోంది. తమకు తగినన్ని సీట్లు ఇవ్వకపోతే వామపక్షాలు విడిగా పోటీచేస్తాయని సీపీఐ–ఎంఎల్‌ నేత దీపంకర్‌ భట్టాచార్య అంటున్నారు.

1998 నుంచీ ఎన్డీఏ వైపే మొగ్గు
1998, 1999, 2009 ఎన్నికల్లో బీజేపీ–జేడీయూ కూటమికే అత్యధిక సీట్లు దక్కాయి. 2004లో మాత్రమే ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి పాతికకు పైగా సీట్లు గెల్చుకోగా ఎన్డీఏకు 11 సీట్లు లభించాయి. 2014లో జేడీయూ లేని ఎన్డీఏ కూటమి 31 సీట్లు కైవసం చేసుకుంది.

అటుఇటు..ఇటుఅటు
పూర్వపు సోషలిస్ట్‌ పార్టీ మూలాలున్న నితీశ్‌కుమార్‌ గతంలో జనతాపార్టీ, లోక్‌దళ్, జనతాదళ్, సమతాపార్టీ, జేడీయూ తరఫున లోక్‌సభకు అనేకసార్లు ఎన్నికై వీపీసింగ్, వాజ్‌పేయి ప్రభుత్వాల్లో మం త్రిగా చేశారు. 2000 మార్చి ఎన్నికల తర్వాత బీజేపీ మద్దతుతో తొలిసారి  సీఎం అయ్యారు. మెజారిటీ ్టలేక వారానికే రాజీనామా చేశారు. 2005, 2010 ఎన్నికల్లో గెలిచి సీఎంగా ప్రమాణం చేశారు. 2013లో బీజేపీతో తెగదెంపు లు చేసుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. 2015లో మహాగఠబంధన్‌ గెలుపుతో మళ్లీ సీఎం అయ్యారు. 2017 లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిశారు.

 ఎప్పుడూ మంత్రే!
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాస్వాన్‌ బిహార్‌కే పరిమితమైన ఎల్జేపీ నేత. లోహియా సోషలిస్ట్‌గా ఆయన రాజకీయ జీవితం మొదలైంది. జనతా, లోక్‌దళ్, జనతాదళ్‌ తరఫున పలుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దళితవర్గమైన దుసద్‌ కుటుంబంలో జన్మించిన పాస్వాన్‌ వీపీసింగ్, దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయి ప్రభుత్వాల్లో మంత్రిగా చేశారు. లాలూకు వ్యతి రేకంగా జనతాదళ్‌ నుంచి బయటికొచ్చి ఎల్జేపీని ప్రారంభించారు. 2004 ఎన్నికల ముందు యూపీఏ లో చేరి మన్మోహన్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నిక ల్లో బీజేపీతో కలిసి ఎన్డీఏ భాగస్వా మి అయ్యారు. మోదీ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు.

 సెన్సేషన్‌ కింగ్‌
కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ బిహార్‌కు చెంది న బీజేపీ నేత. గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పనిచేశారు. 1991లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత నాలుగుసార్లు పార్లమెంటు దిగువ సభకు పోటీచేసి గెలిచారు, కిందటి పార్లమెంటు ఎన్నికల్లో పూర్వీ చంపారణ్‌ నుంచి గెలిచిన రాధామోహన్‌సింగ్‌ వివాదాస్పద ప్రకటనలతో సంచలనం సృష్టిస్తుంటారు. చిన్న వయసులోనే ఆరెస్సెస్‌ కార్యకర్తగా పనిచేశారు. గో రక్షణ, మేలి రకం ఆవుల పెంపకం తనకిష్టమైన వ్యాపకాలని ఆయన ప్రకటించారు. 69 ఏళ్ల సింగ్‌ జనసంఘ్‌లో రాజకీయ ప్రయాణం ప్రారంభించి వరుస విజయాలతో కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు.

‘పాలిటిక్స్‌’ చదివారు!
బిహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ లాలూ చిన్న కొడుకు. 2015 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికవడమేగాక నితీశ్‌ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. అవినీతి కుంభకోణంలో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేయడంతో తేజస్వీ రాజీనామాకు నితీశ్‌ పట్టుబట్టారు. చివరికి 2017 జులైలో నితీశ్‌ రాజీనామాతో తేజస్వీ పదవి పోయింది. అదే నెలలో ఆయన ప్రతిపక్ష నాయకుడయ్యారు. తర్వాత రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన సమయంలో తండ్రి లాలూ జైల్లో ఉండడంతో ప్రచార బాధ్యత తేజస్వీపై పడింది. ఆర్జేడీని సమర్థంగా నడుపుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించారు. 29 ఏళ్ల తేజస్వీ చదివింది తొమ్మిదో తరగతే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top