సీఎం కొడుకా.. మజాకా!

Nara Lokesh Tour Special Story In Kurnool - Sakshi

సంబంధం లేని శాఖల పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు

కనీస సమాచారం లేని ఇతర శాఖల మంత్రులు

కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా ఎస్వీ, బుట్టాలను ప్రకటించిన లోకేష్‌

బంధ విముక్తులను చేశారని సన్నిహితులతో ఎంపీ టీజీ వ్యాఖ్యలు!    

 సాక్షి ప్రతినిధి, కర్నూలు:  జిల్లాలో మంత్రి లోకేష్‌ పర్యటన ముఖ్యమంత్రి కొడుకా మజాకా అనే స్థాయిలో సాగింది. సంబంధం లేని శాఖల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ జిల్లా మంత్రులను సైతం విస్మరిస్తూ ఆయన పర్యటన సాగించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం విచ్చేసిన లోకేష్‌ ప్రతి శాఖలోనూ తలదూర్చారు. వాస్తవానికి ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే, జిల్లా పర్యటనలో మాత్రం వివిధ శాఖలకు చెందిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సమాచారం కనీసం ఆయా శాఖల మంత్రులకు కూడా లేదని తెలుస్తోంది. వాస్తవానికి  వివిధ శాఖలకు చెందిన కార్యక్రమాల్లో ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్‌చార్జ్‌ మంత్రులు మాత్రమే పాల్గొనడం ఆనవాయితీ. ఈ మేరకు జిల్లాలోని సీనియర్‌ మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మరో మంత్రి అఖిలప్రియ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే వీలుంటుంది. ఇన్‌చార్జ్‌ మంత్రి కాలవ శ్రీనివాసులుకు కూడా ప్రారంభోత్సవాలు చేసే అధికారం ఉంటుంది.  మంత్రి లోకేష్‌ పర్యటన ఇందుకు భిన్నంగా సాగడం అధికారుల్లో కూడా చర్చనీయాంశమవుతోంది. ఏకంగాసీఎం వచ్చిన స్థాయిలో ఏర్పాట్లు, అధికారుల హడావుడి కన్పించడం గమనార్హం. 

అన్నింటిలోనూ ఆయనే!
మంత్రి లోకేష్‌ ఏకంగా సీఎం పర్యవేక్షిస్తున్న ఆరోగ్యశాఖలో కూడా వేలుపెట్టడం గమనార్హం. ఇక జోహరాపురం బ్రిడ్డి  శంకుస్థాపన గురించి ఆ పనులు చేయాల్సిన జలవనరుల శాఖ అధికారులకు గానీ, ఆ శాఖ మంత్రికి గానీ తెలియకపోవడం విశేషం. మునిసిపల్‌ అధికారుల ద్వారా హడావుడి చేయించి, శంకుస్థాపన చేశారు. ముస్లిం మహిళలకు దుల్హన్‌ పథకం కింద ఆర్థిక సహాయంతో పాటు మెప్మా ద్వారా అర్బన్‌ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ చేపట్టారు. వాస్తవానికి మొదటిది మైనార్టీ శాఖ మంత్రి చేపట్టాల్సిన కార్యక్రమం కాగా, మెప్మా రుణాల పంపిణీ మునిసిపల్‌ శాఖ మంత్రి పరిధిలోనిది. మరో అడుగు ముందుకు వేసి గెస్ట్‌హౌస్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష  నిర్వహించారు. లోకేష్‌ పర్యటనను సీఎం స్థాయిలో అధికారులు చేపట్టడం విమర్శలపాలవుతోంది. 

కర్నూలు సీటుపై..
ఉస్మానియా కాలేజీలో జరిగిన కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా లోకేష్‌ ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎంపీ స్థానం నుంచి బుట్టా రేణుక పోటీ చేస్తారని, ఓటు వేసి అండగా ఉండాలని ప్రజలను కోరారు. పార్టీ పరంగా కూడా ఆయన అభ్యర్థుల ప్రకటన చేయడం చర్చనీయాంశమయ్యింది. కర్నూలు అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌రెడ్డిని ప్రకటించడంతో తనను బంధ విముక్తుణ్ని చేశారని ఎంపీ టీజీ వెంకటేష్‌ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటో ఇప్పుడు  అంతుపట్టకుండా ఉన్నట్టు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top