ఇలాగైతే ఎలా..బాబు గారూ..

mutham shetty srinivasa rao question to cm chandrababu - Sakshi

నాలుగేళ్లలో 42 సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు

ఒక్కటైనా సాధించారా?

హోదా లేదు.. ప్యాకేజీ రాలేదు

రైల్వే జోన్‌ సాధించలేకపోయాం

ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలో చెప్పండి

ఇక మనకు సమయం లేదు.. ఏదో ఒకటి చేయండి

విభజన వైఫల్యాలను ఎండగట్టిన ‘అవంతి’

‘బాబు’ సమక్షంలోనే కడిగిపారేసిన వైనం

పార్టీలో దుమారాన్ని రేపుతున్న ఎంపీ వ్యాఖ్యలు

‘బాబు గారూ.. మీకింత అనుభవం ఉంది.. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఐదు కోట్లమందికి ప్రతినిధి.. నాలుగేళ్లలో 42సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు. అయినా సరే విభజన హామీల్లో ఏ ఒక్కటి సాధించలేకపోయారు’
ఈ వ్యాఖ్యలు చేసింది ఏ ప్రతిపక్ష నాయకుడో.. వామపక్ష నాయకుడో కాదు. ఏకంగా ఆ పార్టీకే చెందిన ఓ లోక్‌సభ సభ్యుడు. ఇవే కాదు.. ఇంకా చాలా మాటలు అన్నారు. అధినేత సమక్షంలోనే ఆయన్ని ఎండగట్టారు. విభజన హామీల వైఫల్యాలపై చెడామడా కడిగి పారేశారు. అధినేతను చెడుగుడు ఆడుకున్నారు.

సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా టీడీపీలో పార్టీకి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడరు. ఇక పార్టీ అధినేతపై పల్లెత్తు విమర్శ చేసే సాహసం కూడా చేయరు.అలాంటిది ఓ ఎంపీ బహిరంగ వేదికపై అధినేత ఎదుటే అసమ్మతి గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు విభజన హామీల్లో ఏ ఒక్కటి సాధించకపోయినా ఏదో ఉత్సవాలు.. సంబరాలు చేసుకుంటూ ప్రజల మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచే విభజన వైఫల్యాలపై అసమ్మతి సెగ తగలడంతో ఎం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.  విభజన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యాన్ని బహిరంగ వేదికపై అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) ఎండగట్టిన తీరు పార్టీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.పైగా ఆయన సమక్షంలోనే తూటాల్లాంటి మాటలతో గుక్క తిప్పుకోకుండా చేసిన ప్రసంగం పార్టీలోనే కాదు.. ప్రజల్లో సైతం చర్చకు దారితీస్తోంది.

అమరావతిలో జరిగిన టీడీపీ వర్కు షాపులో విభజన హామీలను సాధించడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యం చేసుకుని చేసిన ఎంపీ అవంతి చేసిన విమర్శలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ‘చంద్రబాబు గారూ.. మీరు ఏపీకి ముఖ్యమంత్రి.. 5 కోట్ల మందికి ప్రతినిధి అన్నవిషయాన్ని గుర్తుంచుకోవాలంటూ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ‘మీరు ఢిల్లీకి 42 సార్లు వెళ్లొచ్చారు. విభజన చ్టంలోని హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామన్న బీజేపీ పెద్దలు మాట మార్చారు. హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అన్నారు.
ఇంతవరకు ప్రత్యేక ప్యాకేజీ ఊసే లేదు. మా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో గానే విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటిస్తామన్నారు. నాలుగేళ్లవుతున్నా నేటికీ ప్రకటించలేదు. ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలో అర్ధం కావడం లేదు. మీకు సముద్రమంత సహనం ఉంది. కానీ ప్రజలకు ఆ సహనం లేదు.

అవసరమైనప్పుడు తీర్పు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణా ప్రజల మాదిరిగా ఏపీ ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయరు. సమయం చూపి నిర్ణయం తీసుకుంటారు. వచ్చే నెలలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌ ప్రస్తుత ఎన్డీఏ పాలనలో చివరి బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనైనా విభజన హామీల అమలుకు నోచుకోవాలంటూ శ్రీనివాస్‌ ఆవేశపూరితంగా చేసిన ప్రసంగించడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును ఆయన సమక్షంలోనే ఇలా బహిరంగంగా ఎదురించి మాట్లాడిన సాహసం ముందెవరూ చేయ లేదు. అలాంటిది ఎంపీ అవంతి ఇంతలా పార్టీ అధినేతనే లక్ష్యం చేసుకుని విమర్శలు సంధించడం, వాటికి ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు చప్పట్లతో హర్షధ్వానాలు చేయడం పార్టీలో కలకలం రేపుతున్నాయి. మున్మందు ఇదే తరహాలో సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి పెల్లుబికే వాతావరణం కన్పిస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top