మంత్రివర్గంలోకి ముస్లింలు

Muslims into the AP Cabinet says Chandrababu - Sakshi

‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో సీఎం చంద్రబాబు

ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి సిద్ధం

4 శాతం రిజర్వేషన్లు కాపాడేందుకు పోరాడతా

‘నారా హమారా నహీ..నారా ముస్లిం ద్రోహి’ అంటూ సభలో విద్యార్థుల నినాదాలు

గొడవ చేస్తే భయపడను..వారి అంతు చూస్తా: చంద్రబాబు

విద్యార్థులను సభలో నుంచి ఈడ్చుకెళ్లిన పోలీసులు

‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి, గుంటూరు: ముస్లిం మైనార్టీ వర్గానికి త్వరలో మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన ‘నారా హమారా... టీడీపీ హమారా’ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైనార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడేందుకు సుప్రీం కోర్టులో పోరాడుతానని తెలిపారు. రాయలసీమతో పాటు నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా చేస్తామని చంద్రబాబు చెప్పారు. హజ్‌యాత్రకు అమరావతి నుంచి నేరుగా విమాన సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మైనార్టీ సబ్‌ ప్లాన్‌ తీసుకొచ్చి ఆదుకుంటామన్నారు. 

అవినీతి కుడితిలో మోదీ.. 
తాను వైఎస్సార్‌ సీపీ ట్రాప్‌లో పడ్డానని ప్రధాన మోదీ వ్యాఖ్యానిస్తున్నారని, కానీ ఆయనే అవినీతి కుడితిలో పడ్డారని చంద్రబాబు విమర్శించారు. పీడీ ఖాతాలు, అమరావతి బాండ్లపైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ముంబై వెళ్లి అడిగితే గంటన్నరలో రూ.2 వేల కోట్ల బాండ్ల ద్వారా వచ్చాయంటే తనపై ఉన్న విశ్వాసం అలాంటిదని చెప్పారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగడతానన్న  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆ తరువాత కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. గతంలో ఏపీకి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పూర్తిగా అన్యాయం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు తప్పు చేసిన కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతోందన్నారు. కశ్మీర్‌లో అసిఫా దారుణంగా అత్యాచారానికి గురైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీశానని చంద్రబాబు పేర్కొనడంతో మరి రాష్ట్రంలో మైనార్టీ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ సభకు హాజరైన వారు ప్రశ్నించారు. చంద్రబాబు వద్దకు మైనార్టీలు ఎవరు వెళ్లినా ‘నో’ అనే మనస్తత్వం ఆయనదంటూ జలీల్‌ఖాన్‌ నోరు జారడం గమనార్హం.

పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌గా ఉంటారనుకున్నా: లోకేష్‌
చంద్రబాబును చూస్తే కేంద్రానికి భయం వేస్తోందని, పవన్‌ కళ్యాణ్‌ మోదీ దత్తపుత్రుడని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌గా ఉంటాడనుకుంటే, అవిశ్వాస తీర్మానం పెడితే పోరాటం చేస్తామని పారిపోయారని ఎద్దేవా చేశారు. 

నగరంలో కర్ఫ్యూ వాతావరణం 
‘నారా హమారా .. టీడీపీ హమారా’ కార్యక్రమం సందర్భంగా పోలీసుల ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలను  ఆటోనగర్‌ వద్దే నిలిపివేసి నగరంలోకి రాకుండా అడ్డుకున్నారు. పాత గుంటూరులో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే దుకాణాలను మూసివేయించడంతో వ్యాపారాలు చేసుకుని జీవించే వారంతా ఇబ్బందులు పడ్డారు. 

డబ్బుల పంపిణీ..
గుంటూరులో టీడీపీ కార్యక్రమం సందర్భంగా హోటళ్లు, మద్యం షాపులు కిటకిటలాడాయి. విజయనగరం జిల్లా నుంచి 2 బస్సుల్లో వచ్చిన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఓ టీడీపీ నాయకుడు డబ్బుల పంపిణీ చేపట్టారు. ‘బస్సు, భోజనం, ఖర్చులు పెట్టుకుని మనిషికి రూ.300 ఇస్తామంటే సభకు వచ్చాం. ఆదోని నుంచి 85 మంది దాకా వచ్చాం. ఉదయం టిఫిన్‌ లేదు. మధ్యాహ్నం కూడా భోజనం లేకపోవడంతో సొంత డబ్బులుతో అన్నం తిన్నాం’ అని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన షేక్‌ మహబూబ్‌ వాపోయాడు. 

నారా హమారా నహీ..
సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కర్నూలు జిల్లా నంద్యాలకు  చెందిన కొందరు విద్యార్థులు నిలుచుని ‘నారా హమారా నహీ... నారా ముస్లిం ద్రోహి .. ముస్లింలకు టీడీపీలో న్యాయం జరగడం లేదు’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో అసహనానికి గురైన సీఎం.. ఒకరిద్దరు వచ్చి గొడవ చేస్తే భయపడతామని అనుకోవద్దని, వారి అంతు తేలుస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. అనంతరం వారిని పాతగుంటూరు పోలీసు స్టేషన్‌కు అక్కడి నుంచి క్యూ ఆర్టీ స్టేషన్‌కు  ఆ తరువాత నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top