సీఎంగారూ.. మీది రాజకీయ వ్యభిచారం కాదా?: ముద్రగడ 

Mudragada comments on cm chandrababu - Sakshi

కిర్లంపూడి(జగ్గంపేట): సీఎం చంద్రబాబుగారూ.. మీరు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మీరు కాదా? అంటూ మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు సీఎంకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘‘తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో కేసీఆర్‌ తన్ని తరిమేస్తే అమరావతికి పారిపోయి వచ్చి ఇక్కడ సభలు నిర్వహించి ఆ వేదికపై నుంచి కేసీఆర్‌పై ఊకదంపుడు ఉపన్యాసమిచ్చి, ఖబడ్దార్‌ అని హెచ్చరించి.. ఈరోజు తమరు చేస్తున్న ఇంగ్లిషు కిస్సుల మాటేమిటి? ఇది రాజకీయ వ్యభిచారం కాదా? ఈరోజు అమెరికాకు వెళ్లింది, కుల మీటింగులు పెట్టుకుని కుల ప్రచారం చేస్తున్నది మీరు కాదా? అదే కుల మీటింగులు ఇతరులు పెట్టుకుంటే మీకెందుకు కోపం వస్తోంది?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘కులాలవారీగా సమావేశాలు పెట్టి ఎన్నో ఆశలు కల్పించారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే.. మీరు స్వస్థత కోల్పోయి నేను ఎక్కడ హామీలు ఇచ్చానంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.

తమకెన్ని నాలుకలున్నాయో అర్థమవక.. తెలుసుకోవాలని ప్రజలు తహతహలాడుతున్నారు’’ అని పద్మనాభం ఎద్దేవా చేశారు. పేదల జీవితాలు మీ పాలనలో నీటిమీద రాతలుగా, అరటిపండు తొక్కలుగా మిగిలిపోవాలా? అని నిలదీశారు. పేద ప్రజల ఓట్లు కావాలనుకున్నప్పుడు.. అన్ని కులాల్లో ఉన్న పేదల జీవితాలతో ఆడుకోకుండా, వెలుతురు నింపడానికి ఆలోచన చేయాలని హితవు పలికారు. ఓటు హక్కుతోపాటు ప్రభుత్వ ఖజానాలో ప్రతి పేదవానికీ వాటా ఉందన్న సంగతి మర్చిపోవద్దన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top