రాజీ‘డ్రామా’ నిజమైంది

MP JC Diwakar Reddy play main role in anantapur politics - Sakshi

 ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత నెలలో జేసీ ప్రకటన

 ఎంపీగా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యానని వివరణ  

పది రోజుల్లోనే రాజీనామా నిర్ణయంపై వెనుకడుగు  

రాజీనామా చేస్తే ఏమొస్తుందని మీడియాకు ఎదురుప్రశ్న

చర్చనీయాంశంగా మారిన రాజీ‘డ్రామా’

బెదిరింపులతో దిగొచ్చిన టీడీపీ

రాజీ‘డ్రామా’ నిజమైంది. అధికార పార్టీలో నోరున్నోళ్లదే రాజ్యమనే విషయం మరోసారి రుజువైంది. బెదిరింపులకు పాల్పడితే తప్ప అధిష్టానం దిగి రాదనే పచ్చ పాలి‘ట్రిక్స్‌’ జేసీ బ్రదర్స్‌కు బాగా వంటబట్టినట్లు ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. అంతేనా.. దమ్ముంటే మీరు రాజీనామా చేసి గెలవండని సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పరోక్షంగా సవాల్‌ విసరడం.. క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే టీడీపీకే చెల్లింది. స్వపక్షంలోనే విపక్షం కాలుదువ్వుతున్నా.. జనం నవ్విపోతున్నా.. అబ్బే ఇదంతా ఇంటి వరకేనని సర్ది చెప్పుకోవడం.. సర్దుకుపోవడమే వీరి నైజం!

‘ఎంపీ, ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఏ పనులు చేయలేకపోతున్నా. నా సిఫార్సులు పని చేయడం లేదు. అందుకే పదవికి రాజీనామా చేస్తున్నా.’
– గత నెల 21న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ప్రకటన

‘రేపే రాజీనామా చేస్తా. రాజీనామా చేస్తే ఏమొస్తుంది. ఆ రోజు బాధగా ఉండి మాట్లాడా. ఈరోజు సంతోషంగా ఉన్నా.’      – ఈనెల 3న మరో ప్రకటన

ఈ రెండు ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే ‘నోరు ఒకటి చెబుతుంది.. చెయ్యి మరొకటి చేస్తుంది.. దేని తోవ దానిదే.’అన్నట్లుంది జేసీ వైఖరి.
 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాను ఎంపీగా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యానని, అందుకే రాజీనామా చేస్తున్నాని పదిరోజుల కిందట ప్రకటించిన ఎంపీ.. ఇంతలోనే సంతోషంగా ఉన్నానని, తన నియోజకవర్గ ప్రజలకు ఏదో చేశాననే సంతృప్తి ఉందని చెప్పుకొచ్చారు. మూడున్నరేళ్ల పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసి రాజీనామాపై ప్రకటన చేసిన జేసీ పదిరోజుల్లోనే సంతోషంగా ఉందని ప్రకటన చేయడంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదిరోజుల్లో జేసీ దివాకర్‌రెడ్డికి సంబంధించిన పనులు చక్కబడటం మినహా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అసలు ఆయన పనులు అయ్యేందుకే రాజీనామా పేరుతో బ్లాక్‌మెయిల్‌ రాజకీయం చేశారనేది విపక్షాల వాదన.

మూడు డిమాండ్లలో రెండు పరిష్కారం.. మరొకటి త్వరలో!
దివాకర్‌రెడ్డి రాజీనామా వెనుక కారణాలపై రాజీడ్రామా పేరుతో ఈ నెల 22న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అందులో ప్రధానంగా మూడు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి, వాటిని పరిష్కంచుకునేందుకే రాజీనామాను తెరపైకి తెచ్చారని అప్పట్లో విపక్షాలు కూడా ధ్వజమెత్తాయి. ఈ మూడు డిమాండ్లలో రెండు పరిష్కారమయ్యాయి. ఎలాంటి కేటాయింపులు లేని చాగల్లు రిజర్వాయర్‌కు 4 టీఎంసీలు కేటాయిస్తూ జీఓ తెప్పించుకున్నారు.

ఈ నీటిలో దామాషా ప్రకారం 0.5టీఎంసీలు మాత్రమే చాగల్లుకు దక్కే అవకాశం ఉంది. నీటి విడుదలపై ఎమ్మెల్సీ శమంతకమణి, విప్‌ యామినీబాల తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రైతులతో కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. రాజీనామా బెదిరింపులకు లొంగితే తాము రాజీనామా చేస్తామన్నారు. ఇది కాకుండా అనంతపురంలో రోడ్ల విస్తరణ అంశాన్ని మరో డిమాండ్‌గా చేర్చారు. జేసీని సంతృప్తి పరిచేందుకు అధికారులు ప్రొక్లెయిన్లు తీసుకెళ్లి పాతూరులో కాస్త హడావుడి చేశారు.

చివరగా మిగిలిన అసలైన డిమాండ్‌ హెచ్చెల్సీ టెండర్ల అగ్రిమెంట్‌. ఎంపీఆర్‌ కింద సౌత్‌ కెనాల్‌ పరిధిలోని 43, 33 ప్యాకేజీలో కాలువ లైనింగ్‌ పనుల కోసం రూ.420.76కోట్లతో నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ టెండర్లు దక్కించుకుంది. ఈ పనుల కమీషన్‌లో ఇక్కడి ఓ ప్రజాప్రతినిధి వాటా తేలింది. అయితే అమరావతిలోని ఓ చినబాబు తనకూ కమిషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ పెట్టారు. ఇద్దరిలో ఒకరికే ఇవ్వగలమని, లేదంటే పనులు చేయలేమని చెప్పడంతో అగ్రిమెంట్‌ కాకుండా పనులు పక్కనపెట్టినట్లు తెలిసింది.

ఈ క్రమంలో అగ్రిమెంట్‌ చేయించుకునేందుకు రాజీనామా డ్రామా వ్యవహారాన్ని జేసీ తెరపైకి తెచ్చారనే చర్చ జరిగింది. అయితే అగ్రిమెంట్‌ వ్యవహారాన్ని కూడా త్వరలోనే తెంచేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సర్దిచెప్పినట్లు సమాచారం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జేసీ దివాకర్‌రెడ్డిని గట్టిగా వారించినట్లు తెలుస్తోంది. ఇది కాంగ్రెస్‌ పార్టీ కాదని, టీడీపీలో ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు సాగవని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. అయితే మూడు డిమాండ్లు పరిష్కారం అయ్యేలా కన్పించడంతో ప్రభుత్వం కూడా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తలొగ్గిందనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.

ఏం చేశారని సంతోషమో?:
తన డిమాండ్లు పరిష్కారమవుతున్నాయనే సంతోషం ఉందని జేసీ ఈ నెల 3న చెప్పారు. రోడ్లవిస్తరణ పూర్తయి తీరుతుందని, పరిహారం చెల్లింపు పెద్ద సమస్యే కాదు. అయితే కళ్యాణదుర్గంలో రోడ్ల వెడల్పు పూర్తయి రెండేళ్లు దాటింది. 230 మంది బాధితులకు రూ.3.50కోట్ల పరిహారం ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక్కరికీ చిల్లిగవ్వ ఇవ్వలేదు. కానీ అనంతపురంలో పరిహారం సమస్యే కాదని జేసీ చెప్పడం గమనార్హం. ఎంపీగా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యానని చెప్పిన జేసీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు.

రోడ్ల వెడల్పు అంశాన్ని తీసుకుని తాను ఏదో సాధించానని నూటికి నూరు పాళ్లు సక్సెస్‌ అయ్యానని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. రాజీనామా వ్యవహారంపై మీడియా ప్రశ్నిస్తే ‘రాజీనామా చేస్తే ఏమొస్తుందని! తిరిగి ఎదురు ప్రశ్నలు వేశారు. శింగనమల ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాపై మాట్లాడారని ప్రశ్నిస్తే ‘రాజీనామా చేసేందుకు ఖలేజా ఉండాలని’ మరో మాట అన్నారు. అంటే తానేదో రాజీనామా చేసినట్లు, అవతలి వ్యక్తులకు అది లేదన్నట్లుగా మాట్లాడారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే సొంత అవసరాలు చక్కబెట్టుకోవడం మినహా ఎంపీగా దివాకర్‌రెడ్డి సాధించిందేమీ లేదనే విషయం స్పష్టమవుతోంది. పైగా ఇటీవల వేదికలపై ఇష్టానుసారం మాట్లాడుతూ ‘అందరికీ నవ్వులు తెప్పించేలా’ దివాకర్‌రెడ్డి స్థాయిని తగ్గించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రాజీనామా వ్యవహారంతో జేసీ దివాకర్‌రెడ్డి మాటలకు.. చేతలకు ఏమాత్రం పొంతన ఉండదనేది స్పష్టమైంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top