నేటితో నామినేషన్లకు తెర 

MP Candidates Nomination Ends On 25th March - Sakshi

మధ్యాహ్నం 3 గంటల వరకే దాఖలుకు అవకాశం

26న నామినేషన్ల పరిశీలన

28 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు

నేడు అనుబంధ ఓటర్ల జాబితా ప్రకటన

నిజామాబాద్‌ ఆర్‌ఓపై ఫిర్యాదులు.. 

నివేదిక కోరిన సీఈఓ  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటివరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా సెలవులు పోగా 4 రోజులే స్వీకరణ జరిగింది. 21న హోలీ, 23న రెండో శనివారం, 24న ఆదివారం రావడంతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. దీంతో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. టీఆర్‌ఎస్‌ ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించ డంతో నల్లగొండ, ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థులు సైతం ఖమ్మం, హైదరాబాద్‌ స్థానాలకు నామినేషన్లు వేయాల్సి ఉంది. మంగళవారం నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 28తో నామినేషన్ల ఉపసంహరణ ముగియనుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఏప్రిల్‌ 11న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. 

అభ్యర్థులు 96కు మించితే పేపర్‌ బ్యాలెట్‌... 
నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి శుక్రవారం నామినేషన్లు వేసేందుకు వెళ్లగా తమ నామినేషన్‌ పత్రాలను స్వీకరించకుండా స్థానిక రిటర్నింగ్‌ అధికారి వెనక్కి పంపించారని కొంత మంది రైతులు చేసిన ఫిర్యాదుపై సీఈఓ రజత్‌ కుమార్‌ స్పందించారు. ఈ ఘటనపై సీఈఓ వివరణ కోరగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులందరి నామినేషన్లను స్వీకరించామని స్థానిక రిటర్నింగ్‌ అధికారి బదులిచ్చారు. ఈ ఫిర్యాదుపై రాతపూర్వకంగా వివరణ పంపించాలని, నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన వీడియో రికార్డులను సైతం సమర్పించాలని రిటర్నింగ్‌ అధికారిని సీఈఓ ఆదేశించారు. మరోవైపు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఇప్పటివరకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 96కు మించితే ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని రజత్‌ కుమార్‌ తెలిపారు.  

నేడు అనుబంధ ఓటర్ల జాబితా
సీఈఓ రజత్‌ కుమార్‌ సోమవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 22న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,95,18,954 మంది ఓటర్లున్నారు. నిరంతర ఓటర్ల నమోదులో భాగంగా ఈ నెల 15 వరకు స్వీకరించిన 3.38 లక్షల కొత్త దరఖాస్తులను పరిష్కరించి సోమవారం అనుబంధ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. గత ఫిబ్రవరిలో ప్రకటించిన తుది జాబితాకు తాజా అనుబంధ ఓటర్ల జాబితాను జత చేసి లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించనున్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top