మీకు సిగ్గుగా అనిపించడం లేదా?

MLA RK Roja Slams Chandrababu - Sakshi

చంద్రబాబుపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా

స్పీకర్‌ కోడెల తీరుపై ఆక్షేపణ

సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లా మారిందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసునని అందుకే ప్రతిపక్షం పాత్ర కూడా వాళ్లే పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రుణమాఫీ జరగలేదని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని.. ఇలా అన్ని వైఫల్యాలేనని అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, విదేశాల్లో ఎలా దాచుకోవాలని ఆయన ఆలోచిస్తుంటారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు  చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు.

‘అసెంబ్లీకి రామని మేము చెప్పలేదు. సంతలో పశువుల్లా 22 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అందులో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. మేము సభకు వెళితే పార్టీ ఫిరాయింపులను ఆమోదించినట్టు అవుతుందన్న ఉద్దేశంతోనే సమావేశాలను బహిష్కరించాం. అంతేకాని చంద్రబాబుకో, ఆయన తొట్టిగ్యాంగ్‌కో భయపడి కాదు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విపక్షాన్ని తన 40 ఏళ్ల సర్వీసులో చూడలేదని చంద్రబాబు అంటున్నారు. మీకు సిగ్గుగా అనిపించడం లేదా? 45 ఏళ్ల వయసున్న జగన్‌ మిమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొంటుంటే, 40 ఏళ్ల అనుభవం ఉందంటున్న నువ్వు చేస్తుందేమిటి? జగన్ పాదయాత్ర చేయకుండా కుట్రలు చేస్తున్నారు. వెన్నుపోటు పొడవటం వెన్నతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఓటుకు కోట్లు కేసుకు భయపడి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చార’ని రోజా దుయ్యబట్టారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘పార్టీ ఫిరాయించిన వారిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని చట్టంలో ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. విపక్షం లేకుండా సభ జరపడం మాయని మచ్చ అని స్పీకర్‌ తెలుసుకోవాలి. అధికార, విపక్షాలను అన్నదమ్ముల్లా భావించి సభను నడపాల్సిన స్పీకర్‌.. అసెంబ్లీ పవిత్రతను ఏవిధంగా కాపాడబోతున్నారో చెప్పాలి. అనర్హత వేటు వేయకుండా ఎందుకు ఆలోచిస్తున్నారు. కళ్లెదుట నలుగురు విపక్ష ఎమ్మెల్యేలను మంత్రులు చేస్తే నాకు సంబంధం లేదన్నట్టుగా నటిస్తున్నారు. దీని గురించి అడిగితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది, నా పరిధిలో లేదంటున్నారు. నాపై విధించిన నిషేధాన్ని తొలగించి అసెంబ్లీలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు చెబితే స్పీకర్‌ బేఖాతరు చేశారు. అసెంబ్లీకి తానే సుప్రీం అని ఆ రోజు చెప్పిన స్పీకర్‌కు ఈ విషయం గుర్తు లేదా? కోడెల యాక్టింగ్‌ మానేసి, యాక్షన్‌ తీసుకోవాలి. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాల్సిన స్పీకర్‌ తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నార’ని రోజా వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top