ముస్లింలకు బాబు చేసిందేమీ లేదు

Minority leaders says to YS Jagan that TDP govt completely ignored the Muslims - Sakshi

     టీడీపీ ప్రభుత్వం ముస్లింలను పూర్తిగా విస్మరించింది 

     మంత్రివర్గంలో మైనారిటీలకు చోటే లేదు 

     పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో ముస్లిం నేతలు 

     పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు

ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇప్పటికీ తమను నిర్లక్ష్యం చేస్తోందని ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి పలువురు మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని రంప ఎర్రంపాలెంకు చెందిన మైనారిటీ నేత షేక్‌ మగ్దూం (రఫీ), అబ్దుల్‌ వహాబ్‌ ఆధ్వర్యంలోని ముస్లింల బృందం మంగళవారం అచ్యుతాపురత్రయం వద్ద వైఎస్‌ జగన్‌ను కలుసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమకు విద్య, ఉద్యోగావకాశాల్లో నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించారని, దీంతో ఆయన హయాంలో తమ పిల్లలు బాగా చదువుకుని బాగుపడ్డారని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తమకు ఏమీ చేయడం లేదని ఆవేదన చెందారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లింకు కూడా స్థానం కల్పించని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. మీ వల్ల ముస్లింలకు మంచి రోజులు వస్తాయని విశ్వసిస్తున్నామని, దీనికి మీరు ముఖ్యమంత్రి కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నామని వారు జగన్‌తో పేర్కొన్నారు.  

వెల్లువలా విన్నపాలు 
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం 214వ రోజు పెదపూడి మండలం (అనపర్తి నియోజకవర్గం) కరకుదురు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభం కాగానే వివిధ వర్గాల ప్రజలు వెల్లువలా తరలివచ్చి ఆయనకు వినతిపత్రాలు అందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సరిగ్గా అమలుకాకపోవడంతో పరీక్షల సమయంలో కళాశాలలు హాల్‌టికెట్లు ఇవ్వక ఇబ్బందిపెడుతున్నాయని కొందరు, ప్రమాదంలో చనిపోయినవారికి ప్రభుత్వ బీమా వర్తించడం లేదని మరికొందరు.. ఇలా అనేకమంది ఆయనను కలుసుకుని సమస్యలు విన్నవించారు. కాగా, మంగళవారం నాటి యాత్రలో మహిళలు పోటెత్తారు. ఒక గ్రామానికి, మరో గ్రామానికి పెద్దగా ఎడం లేకపోవడంతో దారిపొడవునా జనం కిటకిటలాడారు. దారిలో కొందరు తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొచ్చి వైఎస్‌ జగన్‌తో అక్షరాభ్యాసం చేయించుకున్నారు. అచ్యుతాపురత్రయం, రామేశ్వరం, మాధవపట్నం, కొవ్వాడ, కాకినాడ రూరల్‌లో యాత్ర సాగింది.

రామేశ్వరం వద్ద ప్రతిపక్ష నేతను ఆటో డ్రైవర్లు కలుసుకుని తమకు ఆర్థిక సాయం ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అదే గ్రామం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని జననేత వారికి హామీ ఇచ్చారు. కాగా, అనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న అద్దంకి ముక్తేశ్వరరావు తన అనుచరులతో వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. యాత్ర అనపర్తి నియోజకవర్గం నుంచి కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించేటప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. కాకినాడ రూరల్‌ పొలిమేరల్లో 65 అడుగుల ఎత్తయిన వైఎస్‌ జగన్‌ కటౌట్‌ హైలైట్‌గా నిలిచింది. సాయంకాలం చాలాసేపు వర్షం కురిసినా పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలందరినీ కలిసిన తర్వాతనే వైఎస్‌ జగన్‌ తన యాత్ర ముగించారు.  

ఒకేసారి 40 మంది రేషన్‌ కార్డులు తీసేశారన్నా..
అనపర్తి నియోజకవర్గంలో కొప్పవరానికి చెందిన నాతోపాటు మరికొందరం 2015 మార్చిలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాం. 2015 డిసెంబర్‌లో కార్డులు మంజూరయ్యాయని, ప్రింట్‌లు రావడానికి సమయం పడుతుందని అధికారులు చెప్పారు. తీరా కార్డులు మంజూరు కాలేదు. నాతోపాటు 40 మంది కార్డులు ఆన్‌లైన్‌లో కనిపించలేదు. అధికారులను అడిగితే ఆన్‌లైన్‌లో డిలీట్‌ అయ్యాయి.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీనికి బాధ్యులెవరని నిలదీస్తే ఎంక్వైరీ చేస్తే ఊరులో లేరని చెప్పారని, అందుకే తీసేశామంటున్నారు. దీనిపై ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే విచారించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. అయితే ఇంతవరకూ ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు.
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కలసి తన బాధ చెప్పుకున్న పోతంశెట్టి ఆదిరెడ్డి, కొప్పవరం

వడ్డీతో సహా చెల్లించాను
నేను, నా సహచర రైతులు 15 మంది కలసి దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో శ్రీనివాసా రైతుమిత్ర సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2007లో రూ.లక్షా ఐదు వేలు రుణాన్ని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో వడ్డీలేని రుణం బోగస్‌. అనపర్తిలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నేను గతేడాది రూ.30,000 రుణం తీసుకున్నాను. ఈ నెల 5న రుణాన్ని తిరిగి చెల్లిద్దామని బ్యాంకుకు వెళ్లి అడిగితే వడ్డీతో సహా చెల్లించాలన్నారు. వడ్డీ లేని రుణం కదా అని అడిగితే ప్రభుత్వం ఇచ్చాక మీ ఖాతాకు జమ అవుతుంది, ప్రస్తుతం వడ్డీతో సహా చెల్లించాలన్నారు. దీంతో విధిలేక చెల్లించాను. ఇలా అయితే చంద్రబాబు వల్ల రైతుకు ఉపయోగమేముంది. 
– వైఎస్‌ జగన్‌ను కలసి తన ఆవేదన వ్యక్తం చేసిన కర్రి బులిమోహన్‌రెడ్డి, కొప్పవరం 

ప్రస్తుత ప్రభుత్వం దివ్యాంగులకు చేయూతనివ్వడం లేదు
వైకల్యంతో బాధపడుతున్న నన్ను మీరు ఆదుకుంటారని శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. ప్రస్తుత ప్రభుత్వం దివ్యాంగులకు చేయూతనివ్వడంలేదు. నేను 2015లో బీసీ కార్పొరేషన్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాను. లోను వస్తుందని చెప్పడంతో విశాఖపట్నంలో ప్రైవేటు వ్యక్తుల వద్ద మూడు రూపాయల వడ్డీకి రూ.1,50,000 తెచ్చి ఇంటర్నెట్‌ సెంటర్‌ను ప్రారంభించా. అయితే అధికారులు రూ.20 వేలు మాత్రమే రుణంగా ఇస్తామన్నారు. ఆ రుణం ఏమాత్రం సరిపోదని వద్దన్నాను. వడ్డీలు కట్టలేక ఇటీవల ఇంటర్నెట్‌ సెంటర్‌ను మూసేశాను. మీరే నన్ను ఆదుకోవాలి.
–వైఎస్‌ జగన్‌కు తన సమస్య చెప్పుకున్న పుత్సా దివాకరరావు, సోంపేట, శ్రీకాకుళం జిల్లా 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top