రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ‘కొలువు’ కోసమే

minister KTR slams Kodandaram over koluvula kotlata - Sakshi

‘కొలువుల కొట్లాట’పై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : ఓ రిటైర్డు ప్రొఫెసర్‌ కొత్త కొలువు సృష్టించుకోవడం కోసమే ‘కొలువుల కోసం కొట్లాట’అంటూ పంచాయితీ చేస్తున్నారని మంత్రి కె.తారకరామారావు దుయ్యబట్టారు. పదేళ్లు అధికారం అనుభవించిన జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ తిరిగి మంత్రి పదవులు పొందాలన్న ఆశతో రభస చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మహబూబ్‌ నగర్‌లో కేటీఆర్‌ విస్తృతంగా పర్యటించారు. 310 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవం, మెడికల్‌ కాలేజీ భవనాలు, బైపాస్‌ రోడ్డు, సమీకృత కలెక్టరేట్, కళాభారతి, మినీ స్టేడి యం నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు మయూరి పార్క్‌లో పలు ఈవెంట్లను ప్రారంభించారు. అనంతరం స్థానిక మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభ లో మాట్లాడారు.

‘‘కొలువుల కోసం కొట్లాట వాస్తవమే! ఎవరికి కొలువులు? పదేండ్లు పదవులు అనుభవించిన జైపాల్‌రెడ్డి ఉద్యోగం కోసం, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ మంత్రి పదవుల కోసమే ఈ కొట్లాట. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు? ఆనాడు ఏపీపీఎస్సీ ద్వారా తెలంగాణ ప్రాంతంలో మీరిచ్చిన ఉద్యోగాలు 9 నుంచి 10 వేలకు మించి ఉండవు. మరి ఈ మూడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం 30 వేల పైచిలుకు నింపింది. మాకు ప్రజలు అధికారం ఇచ్చింది 60 నెలల కోసం. అప్పట్లోగా మేం చెప్పినట్లు లక్ష ఉద్యోగాలు కాదు.. లక్షా 12 వేల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఇవ్వకపోతే మమ్మల్ని ఏం చేయాల్నో ప్రజలే నిర్ణయిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. రిటైర్డ్‌ అయిన ఓ ప్రొఫెసర్‌ కొత్త కొలువు కోసం పంచాయితీ పెడితే.. కాంగ్రెస్‌ నాయకుల చుట్టూ నలుగురు మోపై, పిల్లల్ని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.

గాంధీభవన్‌లో ప్రత్యేక ముఠా
రాష్ట్రంలో అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు గాంధీభవన్‌లో ఒక ప్రత్యేక ముఠా ఏర్పడిందని కేటీఆర్‌ ఆరోపించారు. అక్కడ వకీళ్లను పెట్టుకుని ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించడంతో పాటు ప్రతీ పనికి మోకాలడ్డుతున్నారన్నారు. గతంలో ప్రజల నుంచి దోచుకున్న లక్షల రూపాయలను వకీళ్ల ఫీజు కోసం ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘వాళ్ల అధికార దాహం కోసం ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇస్తుంటే అడ్డం పడుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామంటే కోర్టులకు పోతున్నారు. అలాంటి కాంగ్రెస్‌ నేతలే మొసలి కన్నీరు కారుస్తున్నారు’’అని కేటీఆర్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top