ఫొటోలకు పోజులిస్తే నేతలు కారు

Minister Harish Rao comments about leadership - Sakshi

ప్రజల కష్టాలు తీర్చేవారే నిజమైన నాయకులు: మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, సిద్దిపేట: ఫొటోలకు పోజులిస్తే నాయకులు కాలేరని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీల సముదాయాలు, సామూహిక గొర్రెల షెడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేటలో రాష్ట్రస్థాయి గోల్డ్‌ కప్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘నాయకుడనేవాడు ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూడగలగాలి. వారి కష్టాలు తీర్చేందుకు ప్రయత్నించాలి. ఫొటోలకు పోజులిస్తూ.. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి కుట్ర పూరిత రాజకీయాలు చేయడం సరికాదు’అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమం చేసిందే సాగునీటి ఇబ్బందులు తీర్చడం కోసమని గుర్తుచేశారు. గోదావరి నీళ్లతో కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని నిర్మించనున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీతతో భూగర్భ జలా లు ఆశాజనకంగా ఉన్నాయని, గత రబీలో ఎన్నడూ లేని విధంగా పంటలు పండాయని మంత్రి తెలిపారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నీటి విలువను గుర్తించి ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణకు రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

క్రీడాకారులపై ప్రత్యేక దృష్టి..
తమ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఇండోర్, ఔట్‌డోర్‌ స్డేడియంలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top