టీడీపీని ఇంకా చీదరిస్తారు: మంత్రి బొత‍్స

Minister Botsa Satyanarayana Fires On TDP - Sakshi

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నవేళ తెలుగుదేశం పార్టీ అల్లకల్లోలం సృష్టించాలని చూస్తోందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు నాయుడు కుట్ర అని ఆయన మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవలేమనే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో నామినేషన్లు ముగిశాయని, పట్టణ ప్రాంతంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైందన్నారు. ఒక‍్క టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తంగా ఉన్నాయన్నారు. ( 'జేసీ డబ్బు, మద్యంతోనే రాజకీయం చేశారు' )

ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే వైఎస్సార్‌ సీపీ గెలుస్తుందని తెలిసే కుట్రలు పన్నుతున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వస్తుందని తెలిసే ఇలా చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస‍్సార్‌ సీపీని  ప్రజలు ఆశీర్వదించి టీడీపీని ఇంకా చీదరిస్తారని చెప్పారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బాబు ఎన‍్ని కుట్రలు పన్నినా, పచ్చ మీడియా ఎంత మద్దతు ఇచ్చినా.. ప్రజలకు వాస్తవాలు తెలుసని పేర్కొన్నారు. డబ్బు, మద్యం లేని రాజకీయాలు చేయాలని సీఎం జగన్‌ చూస్తున్నారని, ఇందుకోసం రాష్ట్రంలో నూతన చట్టాలు సైతం చేశారన్నారు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని వైఎస్‌ జగన్‌ ఇప్పటికే స్పష్టం చేశారన్న విషయాన్ని మంత్రి బొత్స గుర్తు చేశారు. 

పోలీసులను సైతం చంద్రబాబు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారు. గత అయిదేళ్లలో చంద్రబాబు సర్కార్‌.. వైఎస్సార్‌ సీపీ నేతలను ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు. పది కార్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న మాచర్ల ఎందుకు వెళ్లారని సూటిగా ప్రశ్నించారు. మీ పార్టీ గూండాలతో దౌర్జన్యం చేయడానికా? అని ప్రశ్నలు సంధించారు. టీడీపీ నాయకులు రౌడీయిజం చేయడానికే మాచర్ల వెళ్లారని వ్యాఖ్యానించారు. ఎన్నికల పర్యవేక్షణకు వెళ్లినవారు వీధుల్లో రయ్‌ రయ్‌ అంటూ వెళ్లారన్నారు. రోడ్డుపై ఉన్న వృద్ధులు, పిల్లలను పట్టించుకోకుండా వేగంగా వెళ్లారన్నారు. ఈ సందర్భంగా ఒక చిన్న పిల్లాడికి వాహనం తగిలిందని, దాంతో స్థానికులు ఆగ్రహం వ్యక‍్తం చేశారన్నారు. అల్లర్లు సృష్టించి రాక్షస ఆనందాన్ని పొందాలని చంద్రబాబు చూస్తున్నారని, ఆయన రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 

చంద్రబాబు తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని, 20 ఏళ్లు పార్టీ అధ్యక్షుడినని చెప్పుకుంటున్నారని, అయితే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణం అయ్యారన్నారు.  చంద్రబాబు అనుభవంతో పాటు ఆయన పాలనలో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. అలా ఉంటే  టీడీపీ నాయకులు ఎందుకు పార్టీ వీడతారని ప్రశ్నించారు. చంద్రబాబు వందలకోట్లు ఖర్చుపెట్టినా కొడుకును గెలిపించుకోలేకపోయారన్నారు. ఐదేళ్లలో ఏం చేశావని ప్రజలు నీకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తమ పాలనలో నవరత్నాలను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి ప్రజలు జేజేలు కొడుతున్నారనే ఆక్రోశంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను చంద్రబాబు వ్యతిరేకించడాన్ని.. ఆ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడే సమర్ధించలేదన్నారు. ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామా చేసి.. ఆ తర్వాతే వైఎస్సార్‌ సీపీలో చేరారన్నారు.  సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top