ఉద్దండుల బరి

Medak Constituency Review on Telangana Lok Sabha Elections - Sakshi

గతంలో ఇందిర, కేసీఆర్‌ సహా అతిరథుల ప్రాతినిధ్యం

వరుసగా ఐదోసారి గెలుపునకు గులాబీ వ్యూహం

మరోమారు తెరాస అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి

అభ్యర్థుల కోసం కాంగ్రెస్, బీజేపీల అన్వేషణ

సాక్షి, హైదరాబాద్‌ :అతిరథ మహారథులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మెదక్‌. ఇక్కడ నుంచి మాజీ ప్రధాని ఇందిర, సీఎం కేసీఆర్, కాంగ్రెస్‌ నేత బాగారెడ్డి, నరేంద్ర, మల్లికార్జున్, విజయశాంతి గతంలో గెలిచారు. గెలుపు ఎవరివైపు ఉన్నా  ఉద్దండుల బరిగా మెదక్‌ ఎప్పుడూ తనదైన ప్రత్యేకత చాటుతోంది. ఎన్నికల షెడ్యూలుకు ముందే తెలంగాణ రాష్ట్ర సమితి సన్నాహక సభ పేరిట ఈ నెల ఎనిమిదో తేదీన మెదక్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ సీటును భారీ మెజారిటీతో కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సిట్టింగ్‌కే ఖాయం.. విపక్షాల అయోమయం
సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం గజ్వేల్‌ ఇదే లోక్‌సభ స్థానం పరిధిలో ఉండటంతో భారీ మెజారిటీని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సిట్టింగ్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వరుసగా రెండో పర్యాయం టీఆర్‌ఎస్‌ తరపున ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. పదిహేనేళ్లుగా టీఆర్‌ఎస్‌  వరుస విజయాలు సాధిస్తున్న ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని అనుకుంటున్నాయి విపక్షాలు. అయితే ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం అవుతున్నా కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులపై స్పష్టత లేదు. ఈ పార్టీల తరపున గతంలో పోటీ చేసిన నేతలెవరూ మరోమారు బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడం లేదు. 

ఆధిక్యం అడుగడుగునా..
 2014 సార్వత్రిక ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 3.97 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. అదే ఏడాది కేసీఆర్‌ రాజీనామా అనంతరం అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో సిట్టింగ్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి 3.61లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ప్రస్తుతం సంగారెడ్డి మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు.. సీఎం కేసీఆర్‌ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ స్థానంతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట కూడా ఇదే లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్నాయి. అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌), సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక), చిలుముల మదన్‌రెడ్డి (నర్సాపూర్‌), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు) ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా ఉన్నారు. 2018 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, సహా గెలుపొందిన ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మెజారిటీ 3.63 లక్షలు కాగా, మాజీ మంత్రి హరీశ్‌రావు ఏకంగా సిద్దిపేటలో 1.18 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇతర పార్టీల నేతలను ఎన్నికల నాటికి పార్టీలో చేర్చుకునేలా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల నాటి పొరపాట్లను సవరించుకుని ఆధిక్యత సాధించడంపై పార్టీ దృష్టి సారించింది. ఎలాగైనా మెదక్‌ ఎంపీ సీటును భారీ మెజారిటీతో సాధించాలనే వ్యూహంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యంత్రాంగం పనిచేస్తోంది. 

బలమైన అభ్యర్ధి వేటలో కాంగ్రెస్‌..
ప్రతీ ఎన్నికలోనూ అభ్యర్థులను మారుస్తూ వస్తున్న కాంగ్రెస్, త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ బలమైన అభ్యర్థి కోసం ఇంకా వేట సాగిస్తోంది. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్నా, మెదక్‌ నుంచి పోటీకి ఆసక్తి చూపడం లేదు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన నరేంద్రనాథ్‌ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2014లో కేసీఆర్‌పై పోటీ చేసిన డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక కాంగ్రెస్‌ టికెట్‌ దక్కక పోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2014 అక్టోబర్‌ ఉప ఎన్నికలో పోటీ చేసిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో లోక్‌సభ పోటీకి అనాసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన అభ్యర్థులెవరూ ఓటమి తర్వాత చురుకుగా కనిపించడం లేదు. తన భార్య నిర్మలకు కాంగ్రెస్‌ టికెట్‌ కోరుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2014 మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఔత్సాహికుల్లో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మెదక్‌ లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తూ 14 మంది ఔత్సాహికులు టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఫహీం తదితర నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పటాన్‌చెరుకు చెందిన గాలి అనిల్‌ కుమార్‌ కూడా కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.- కల్వల మల్లికార్జున్‌ రెడ్డి

బలమైనఓటు బ్యాంకు భాజాపా సొంతం..
గతంలో ఓ దఫా (1999–2004)లో మెదక్‌ సీటు కైవసం చేసుకున్న బీజేపీ, ఆపై జరిగిన ప్రతీ ఎన్నికలో నూ గణనీయ ఓట్లను సాధి స్తోంది. రెండు లక్షల ఓటు బ్యాంకును కలిగి ఉన్న బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో స్థానిక నేతను బరిలోకి దించాలనే యోచనలో ఉంది. బీజేపీ ఉమ్మడి మెదక్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు వంగ రాంచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రఘునందన్‌రావు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆకుల రాజయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేరు కూడా పార్టీ సమావేశాల్లో ప్రస్తావనకు వస్తోంది.   
 

అతిరథుల ప్రాతినిధ్యం
1952లో ఆవిర్భవించిన మెదక్‌ లోక్‌సభ స్థానానికి  17 సార్లు ఎన్నికలు జరగగా ఒక ఉప ఎన్నిక కూడా ఉంది. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధండులుగా పేరొందిన నేతలు ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఎమర్జన్సీ, జనతా పార్టీ ప్రభుత్వ పతనం నేపథ్యంలో దివంగత ప్రధాని ఇందిర తాను చిరకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి (ఉత్తరప్రదేశ్‌)తో పాటు 1980లో మెదక్‌ లోక్‌సభ నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. దీంతో మెదక్‌ ఎంపీగా కొనసాగుతూ, రాయ్‌బరేలీ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 1984 అక్టోబర్‌ 31న హత్యకు గురయ్యే నాటికి ఇందిర మెదక్‌ ఎంపీగానే ఉన్నారు. ఆవిర్భావం నుంచి కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న మెదక్‌ నుంచి పి.హనుమంతరావు, డాక్టర్‌ మల్లికార్జున్, ఎం.బాగారెడ్డి కూడా ప్రాతినిధ్యం వహించారు.  తొలుత బీజేపీ, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి ఆలె నరేంద్ర రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సినీనటి విజయశాంతి టీఆర్‌ఎస్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

ప్రచార అస్త్రాలు ఇవే!
ఐదేళ్ల పాలన, కేంద్రం నుంచి నిధుల సాధన,రైతు సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ వాదం, అభివృద్ధి తదితరాలను టీఆర్‌ఎస్‌ ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
టీఆర్‌ఎస్‌ పాలన వైఫల్యాలు, సింగూరు నీటి తరలింపు, సాగు,తాగునీటి సమస్య తదితర అంశాలను కాంగ్రెస్‌ ప్రధానఎజెండాగా తీసుకోవాలని యోచిస్తోంది.
మోదీ ఐదేళ్ల పాలన, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం, దేశ రక్షణ, రైతుబంధు తరహాలో కిసాన్‌ సమ్మాన్‌ యోజన, ఇతర పార్టీల కుటుంబ పాలన తదితర అంశాలను బీజేపీ ప్రధానంగా ప్రస్తావించనుంది.

మెదక్‌ మొనగాళ్లు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top