నాన్గారికి ఇంత నాలెడ్జి ఉందా..?

Mangalgiri Babu Along With Lokesh Babu Was Also Surprise. - Sakshi

సాక్షి, అమరావతి:  ‘‘నాన్గారికి ఇంత నాలెడ్జి ఉందని ఈరోజు పేపర్‌ చూసేవరకు నాకూ తెలీదు’’ అన్నాడు లోకేశ్‌బాబు సర్‌ప్రైజ్‌ అవుతూ!  
లోకేశ్‌బాబు వెంట ఉన్న మంగళగిరిబాబు కూడా సర్‌ప్రైజ్‌ అయ్యాడు.  
లోకేశ్‌బాబు మళ్లీ సర్‌ప్రైజ్‌ అయ్యాడు.  
‘‘మళ్లీ సర్‌ప్రైజ్‌ అయ్యారేంటి లోకేశ్‌బాబూ..’’ అని అడిగాడు మంగళగిరిబాబు. 
‘‘నేనంటే నాన్గారి నాలెడ్జ్‌ చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను. నువ్వెందుకు సర్‌ప్రైజ్‌ అయ్యావో తెలియక మళ్లీ సర్‌ప్రైజ్‌ అవ్వాల్సి వచ్చింది’’ అన్నాడు.  
‘‘మీరు సర్‌ప్రైజ్‌ అయ్యారని నేనూ సర్‌ప్రైజ్‌ అయ్యాను లోకేశ్‌బాబూ.. నాన్నగారి గురించి అన్నీ తెలిసిన మీరే సర్‌ప్రైజ్‌ అయ్యారంటే.. నాన్నగారి గురించి అంతా తెలుసనుకుంటున్న నేనెంత సర్‌ప్రైజ్‌ అవ్వాలి!’’ అన్నాడు మంగళగిరిబాబు.  
‘‘సర్‌ప్రైజింగ్‌’’ అన్నాడు లోకేశ్‌బాబు.  
‘‘నాన్నగారి నాలెడ్జ్‌ గురించేనా లోకేశ్‌బాబూ..’’ 
‘‘కాదు.. కాదు.. నేను సర్‌ప్రైజ్‌ అయ్యానని నువ్వు సర్‌ప్రైజ్‌ అయ్యావు కదా, దాన్ని సర్‌ప్రైజింగ్‌ అంటున్నా’’.  
‘‘ఇంతకీ నాన్నగారి నాలెడ్జ్‌ గురించి పేపర్‌లో ఏం రాశారు లోకేశ్‌బాబూ’’.. అని ఆసక్తిగా అడిగాడు మంగళగిరిబాబు.  
‘‘నాన్గారికి చార్లెస్‌ డిగాల్‌ గురించి తెలుసు. రెండో ప్రపంచ యుద్ధం గురించి తెలుసు. సామాజిక అస్థిరత అంటే ఏంటో తెలుసు. స్థిరమైన లక్ష్యం అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ రాశారు పేపర్‌లో ఫస్ట్‌ పేజీలో..’’ అన్నాడు లోకేశ్‌బాబు. 
‘‘అవునా లోకేశ్‌బాబూ’’ అన్నాడు మంగళగిరిబాబు వాచీ చూసుకుంటూ. ప్రచారానికి లేటైతే ఎండ నెత్తికెక్కి పోతుందని భయంగా ఉన్నాడు మంగళగిరిబాబు. లోకేశ్‌బాబు భయపడడం లేదు. మనది కాదు ఎండ అన్నట్లున్నాడు.  
‘‘నాన్గారికి ఇంత నాలెడ్జి ఉంది కదా. నాకొకటి అర్థం కావడం లేదు’’ అన్నాడు లోకేశ్‌బాబు.. పేపర్‌ పట్టుకుని కూర్చున్నవాడు పైకి లేవకుండా. 
‘‘నాన్నగారి నాలెడ్జిని అర్థం చేసుకోవడం ఎవరి తరమూ కాదు లోకేశ్‌బాబూ. మీరు నయం. నాన్నగారి నాలెడ్జ్‌లో మీకు ఒకటి మాత్రమే అర్థం కాలేదు. మిగతా
వారికి ఏ ఒక్కటీ అర్థం కాదు’’ అన్నాడు మంగళగిరి బాబు.  
‘‘నాకర్థం కానిది అది కాదు. ‘ఈ’ పేపర్‌ మాత్రమే నాన్గారి నాలెడ్జ్‌ గురించి రాసింది. ‘ఆ’పేపర్‌ రాయలేదెందుకనీ! ఒక మాట అనుకునే కదా రాస్తాయి.. ఆ రెండూ’’ అన్నాడు లోకేశ్‌బాబు.  
‘‘నాన్నగారి నాలెడ్జ్‌కి అంతేముంది లోకేశ్‌బాబూ. సముద్రం. రేపు రాస్తుందేమో ‘ఆ’పేపర్‌. జగన్‌ని తిట్టడానికే పేజీలు సరిపోయి ఉండవు ఈరోజు’’ అన్నాడు మంగళగిరిబాబు.  
తృప్తిగా చూశాడు లోకేశ్‌బాబు. మళ్లీ అంతలోనే సర్‌ప్రైజ్‌ అయ్యాడు.  
‘‘ఏంటి లోకేశ్‌బాబూ..’’ అన్నాడు మంగళగిరిబాబు.  
‘‘నాన్గారికి అంత నాలెడ్జి ఉంది కదా. అంత నాలెడ్జ్‌ ఉన్న నాన్గారిని జగన్‌ ఎందుకు అలా 
తిట్టిపడేస్తున్నాడు?’’ అన్నాడు లోకేశ్‌బాబు.  
‘‘నాన్నగారిని జగన్‌ మళ్లీ తిట్టాడా?! ఏమని తిట్టాడు లోకేశ్‌బాబూ’’ అన్నాడు మంగళగిరిబాబు. 
‘‘నాన్గారిని రౌడీ అన్నాడు. నాన్గారిని రాక్షసుడు అన్నాడు. నాన్గారిని గద్ద అన్నాడు. నాన్గారిని  క్రిమినల్‌ అన్నాడు’’.. అని బాధపడ్డాడు లోకేశ్‌బాబు.  
అయోమయంగా చూశాడు మంగళగిరిబాబు.  
‘‘నాన్గారిలా మనం కూడా కొంచెం నాలెడ్జ్‌ పెంచుకోవాలేమో లోకేశ్‌బాబూ’’ అన్నాడు.  
‘ఎందుకు?’ అన్నట్లు చూశాడు లోకేశ్‌బాబు.  
‘‘రౌడీ అనీ, రాక్షసుడు అనీ, గద్ద అని, క్రిమినల్‌ అనీ.. జగన్‌.. నాన్నగారిని అన్లేదు లోకేశ్‌బాబూ. నాన్నగారు జగన్‌ని అన్నారు. ‘ఈ’ పేపర్‌లో, ‘ఆ’ పేపర్‌లో వచ్చాయంటేనే.. నాన్నగారు జగన్‌ని అన్నట్లు’’ అన్నాడు మంగళగిరిబాబు. 
‘‘అవునా’’ అని సర్‌ప్రైజ్‌ అవుతూ, ప్రచారానికి పైకి లేచాడు లోకేశ్‌బాబు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top