అమీతుమీ పోరు సెటిల్‌ అయ్యేదెవరు?

Malkajgiri Constituency Review on Lok Sabha Election - Sakshi

సెటిలర్ల చేతిలో ‘మల్కాజిగిరి’

అభ్యర్థుల గెలుపోటముల్లో వారే నిర్ణయాత్మకం

టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు

కాంగ్రెస్‌ ప్రయత్నాలు

‘మోదీ క్రేజ్‌’పై ఆశ పెట్టుకున్న బీజేపీ

రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన మల్కాజిగిరి.. దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం. అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు,భిన్న సంస్కృతులకు నెలవైన ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. స్థానికులతోపాటు సెటిలర్ల ఓట్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టి మూడు ప్రధాన పార్టీలు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు కూడా ఎవరికి వారే గెలుపు ధీమాతో ప్రచారం కొనసాగిస్తున్నారు. పరిశ్రమల రాజధానిగా విరాజిల్లుతున్న ఈ నియోజకవర్గంలో 31.49 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఉద్యోగులు, వ్యాపారులు, రోజువారీ కూలీలు, కుటీర పరిశ్రమలు, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులే అత్యధికం. జీవనోపాధి కోసం తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్తాన్, గుజరాత్, బిహార్‌ తదితర రాష్ట్రాలకు చెందిన లక్షల మంది ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్న నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

గతంలో సిద్దిపేట నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్‌గా ఉన్న మల్కాజిగిరి.. 2009లో లోక్‌సభ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. అదే ఏడాది జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ–కాంగ్రెస్‌ పోటీపడగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణ గెలుపొంది కేంద్రంలో మంత్రి అయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో మల్లారెడ్డి 20 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి బరిలో దిగగా, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున, ఎమ్మెల్సీ రాంచంద్రరావు బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు.

టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌.. మధ్యలో బీజేపీ
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌– కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. అయితే బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తోందని, పట్టణ ఓటర్లలో ఆ పార్టీకి కొంత పట్టుందన్న వాదనలూ ఉన్నాయి. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్లు కలిగిన ఈ నియోజకవర్గంలో ఎల్‌బీనగర్‌ ఒక్కటే కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది. ప్రస్తుతం అక్కడ గెలుపొందిన సుధీర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌వే అయ్యాయి. ఈ పరిణామాలు, గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉండగా, టీడీపీ  ఓటుబ్యాంకు, సెటిలర్ల ఓట్లు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇక మొదటి నుంచి ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా, ఆ అభ్యర్థినే బరిలో నిలపడం, పట్టణ ప్రాంత ఓటింగ్, బీజేపీ, మోదీ ఛరిష్మా తమను బయట పడేస్తుందన్న ఆశతో ముందుకు సాగుతోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికలు కావడంతో తమకు ఓట్లు వేయాలన్న ప్రచారాన్ని బీజేపీ వేగవంతం చేసింది. మూడు పార్టీలు ప్రచారం ముమ్మరం చేయడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

టీఆర్‌ఎస్‌:అన్నీ అనుకూలమే!
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఐదేళ్ల ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఛరిష్మా, ఏడు నియోజకవర్గాల్లోని పార్టీ ఎమ్మెల్యేలే టీఆర్‌ఎస్‌కు ఉన్న ప్రధాన బలం. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం ఫలితంగా కొత్త పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగులకు లభించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కేటీఆర్‌ ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులతోపాటు మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరా వంటి పథకాలు తమకు కలిసొచ్చే అంశంగా టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. మరోవైపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కావాలంటే అధికార పార్టీతో ఉండాలన్న ప్రజాప్రతినిధుల ఆలోచన స్థానిక నేతలను టీఆర్‌ఎస్‌లో చేరేలా చేసింది. దీంతో ఈ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమన్న భావనలో టీఆర్‌ఎస్‌ ఉంది.

కేసీఆర్‌ ఛరిష్మాతో గెలుస్తా
‘కారు– సారు– పదహారు’ నినాదంతో మల్కాజిగిరిలో భారీ మెజార్టీతో గెలుస్తా. సీఎం కేసీఆర్‌ ఐదేళ్లలో చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్‌ కేంద్రంలో కీలకపాత్ర పోషించనున్నారు. తద్వారా తెలంగాణలో అభివృద్ధికి మరింత చేయూత లభించనుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లో ఎండగడుతున్నాం. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలే ఉండటంతో పాటు మంత్రి మల్లారెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నా గెలుపు కోసం పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గాన్ని దేశంలో నంబర్‌వన్‌గా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. స్మార్ట్‌ సిటీగా మారుస్తా. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తా. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరిస్తా.    – మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి

కాంగ్రెస్‌: సెటిలర్ల ఓట్లపై ఆశ
నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి కేడర్‌ ఉన్నా సరైన నాయకులు లేరన్న అభిప్రాయం మొదట్లో నెలకొన్నా ప్రస్తుతం మెరుగైంది. నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి నాయకులు ఉన్నప్పటికి అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదన్న అపవాదు ఉండేది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యాక, ఆయన నియోజకవర్గానికి వచ్చాక పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పని చేస్తున్నారన్న భావన నెలకొంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సెటిలర్ల ఓట్లపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గతంలో టీడీపీలో పని చేసినందున, నియోజకవర్గంలోని సెటిలర్ల, టీడీపీ ఓట్లు తమకు వస్తాయన్న ధీమాతో పార్టీ ఉంది. సీపీఐ, టీజేఎస్‌ సహకారం కూడా తీసుకుంటోంది.

గెలిపిస్తారని నమ్ముతున్నా..
దేశంలోనే పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిలో 29 రాష్ట్రాల ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాలకు చెందిన ప్రజలు ఉంటారు. పార్టీ ఆదేశాన్ని పాటించడంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించడం బాధ్యతగా భావించి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా. హైదరాబాద్, సికింద్రాబాద్‌ అంతర్జాతీయ నగర స్థాయిలో ఉంటే పక్కనే ఉన్న మల్కాజిగిరి ఇంకా గ్రామీణ నేపథ్యంలో పేదరికంలోనే ఉంది. ఇక్కడ కేసీఆర్‌కు ఓటేయడం నిరుపయోగమే. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ మధ్యనే. పోరు జరుగుతోంది రాహుల్, మోదీ మధ్యనే. ఏమీ కానోళ్లకు ఓటేసే దాని కన్నా అన్ని విషయాలపై అవగాహన కలిగి, సమస్యల పరిష్కారం చేయాలన్న దృక్పథం ఉన్న నన్ను గెలిపించాలని కోరుతున్నా. నన్ను గెలిపిస్తే మల్కాజిగిరి సమస్యలను పార్లమెంటు సాక్షిగా లేవనెత్తుతా. ప్రజల పక్షాన గొంతుకనవుతా. ప్రశ్నించే అస్త్రంగా వారికి ఉపయోగపడతా. అందుకే విజ్ఞులైన ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నా.      – రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి

బీజేపీ: ప్రత్యేక దృష్టి
2014 లోక్‌సభ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి గెలుపొందటంతో బీజేపీ ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్‌.రామచంద్రరావు 40,451 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఆయననే ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీకి నిలిపింది. తమకున్న ఓటుబ్యాంకు, యువత, ప్రధాని నరేంద్రమోదీ ఛరిష్మా, కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన నేపథ్యంలో ప్రజలు తమ అభ్యర్థిని గెలిపిస్తారన్న భావనను బీజేపీ వ్యక్తం చేస్తోంది.

దేశం కోసం మళ్లీ మోదీ
దేశ భద్రత పక్కాగా ఉండాలంటే నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని కావాలి. అందుకోసం ప్రజలు బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలి. తద్వారా రాజకీయ సుస్థిరత సాధ్యం అవుతుంది. ఇవన్నీ మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ వల్లే సాధ్యం అవుతాయి. స్థానికంగా ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీడీపీ గెలిచినా ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీ టీఆర్‌ఎస్‌లో చేరారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. నేను ఎంపీ అయితే స్మార్ట్‌ సిటీ, రైల్వే అభివృద్ధికి కృషి చేస్తా. నియోజకవర్గ ప్రజలకు రక్షిత తాగునీటికి చర్యలు చేపడతా. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును సాధించటంతోపాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా. సికింద్రాబాద్‌–సనత్‌నగర్, సికింద్రాబాద్‌–భువనగిరి, శంకర్‌పల్లి ప్రాంతాలకు ఎంఎంటీఎస్‌ విస్తరణకు కృషి చేస్తా. – ఎన్‌.రామచంద్రరావు, బీజేపీ అభ్యర్థి

అసెంబ్లీ సెగ్మెంట్లలో..మేడ్చల్‌
ఇక్కడ టీఆర్‌ఎస్‌ రెండుసార్లు గెలుపొందింది. కాంగ్రెస్‌ కేడర్‌ అంతా పార్టీలో చేరడంతో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అధిక స్థానాలను గెలుచుకుంది. దీంతో పదేళ్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్దదిక్కు కరువైంది. టీడీపీ నుంచి చేరిన కొందరు నాయకులు, కేడర్‌ మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ తమకున్న నాయకులు, కేడర్‌తో ఎన్నికల ప్రచారం చేస్తోంది. గతంలో ఎంపీగా గెలుపొందిన మల్లారెడ్డి, ఇపుడు మేడ్చల్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండటం టీఆర్‌ఎస్‌కు లాభించేదే.

కుత్బుల్లాపూర్‌
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన వివేకానంద ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి గెలిచారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ గాలి బలంగా వీస్తోంది. మరోవైపు కాంగ్రెసు పార్టీ తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ అన్నీ తానై పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ బీజేపీ బలం అంతంత మాత్రంగానే ఉంది.

ఉప్పల్‌
ఇక్కడ తమ బలం పెంచుకునేందుకు టీఆర్‌ఎస్‌ కృషి చేస్తోంది. బీజేపీకి కొంత పట్టున్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. అయితే 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఓడిపోగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్‌చార్జి లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరటంతో పార్టీ పటిష్టమైంది. కాంగ్రెస్‌ పార్టీకి కూడా గట్టి కేడర్‌ ఉంది.

మల్కాజిగిరి
ఇక్కడ టీఆర్‌ఎస్‌ బలంగానే ఉంది. నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తమ అభ్యర్థికి భారీ మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాన్ని తెలంగాణ జన సమితికి కేటాయించడంతో కేడర్‌ కొంత చెల్లాచెదురైంది. తాజాగా వారందరిని కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఉన్న నాయకులతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బీజేపీకి ఇక్కడ కొంత మేర బలం కలిగి ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇక్కడ ఎక్కువ ఓట్లు సాధించాలని ప్రయత్నిస్తోంది.
 
కూకట్‌పల్లి
2014లో టీడీపీ నుంచి గెలుపొందిన మాధవరం కృష్ణారావు రెండోసారి 2018లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఇక్కడ టీఆర్‌ఎస్‌తో పాటు టీడీపీ, కాంగ్రెస్‌ కూడా కొంత బలంగానే ఉన్నాయి. పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. బీజేపీకి సంప్రదాయ ఓటుబ్యాంకు ఉంది. టీఆర్‌ఎస్‌.. ఈసారి ఇక్కడ ఓట్ల శాతాన్ని పెంచుకునే లక్ష్యంగా పని చేస్తోంది.

ఎల్‌బీనగర్‌
మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానమిది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నా.. ఆ పార్టీ నుంచి గెలుపొందిన సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్, పార్టీకి ఉన్న పలుకుడి, రేవంత్‌రెడ్డి అభ్యర్థిత్వంతో వచ్చిన ఊపుతో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ కూడా ప్రచారం ముమ్మరం చేసింది.

కంటోన్మెంట్‌
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన సాయన్న 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. అంతకుముందు టీడీపీకి పట్టున్న స్థానమైనా మొన్నటి ఎన్నికల సమయం వచ్చే సరికి టీఆర్‌ఎస్‌ బలం పుంజుకుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీగణేశ్‌కు ఇక్కడ 15 వేల ఓట్లు లభించాయి. ఆయన కూడా ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడంతో మరింత బలం చేకూరింది. కాంగ్రెస్, బీజేపీ.. తమకున్న కేడర్‌తో ముందుకు సాగుతున్నాయి.

ఓటర్లమనోగతం
గెలిస్తేబాగుంటుందని ఆశ..

పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఆశ. ఇప్పటికే పెన్షన్‌ పెంచారు. ఒంటరి మహిళలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అందుకే టీఆర్‌ఎస్‌ అధికారింలోకి రావాలి. చిరు వ్యాపారులకు లోన్లు ఇచ్చి ఆదుకోవాలి.– సిలివేరు సత్యరారాయణ, చిలుకానగర్‌

ఎవరొచ్చినా.. నా పని ఇదేగా!
ఎవరు అధికారంలోకి వచ్చినా చేసేదేముంది? ఏ ప్రభుత్వం వచ్చినా మాలాంటి వారికి ఎలాంటి లబ్ధి చేకూరదు. ఊళ్లో మూడు ఎకరాల బంజరు భూమి ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధుతో ఆదుకుంటోంది. ఎవరు గెలిచినా.. నేను ఇదే పని చేసుకుని బతకాల్సిందే కదా!– ఎం.బాలయ్య, సెక్యూరిటీ గార్డు, ఉప్పల్‌

మోదీ ప్రభుత్వం
వస్తే మేలు:ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో అవినీతి, కుంభకోణాలు జరగలేదు. సామాన్యులు బతికేలా చట్టాలు రూపొందించారు. తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే వారు రావాలి.               –శ్రీధర్‌రాజు,బేకరీ కార్మికుడు, జగద్గిరిగుట్ట

లోక్‌సభ ఓటర్లు
పురుషులు   16,37,505
మహిళలు     15,11,856
ఇతరులు        349
మొత్తం ఓటర్లు 31,49,710

ఆలోచించిఓటేస్తాం
ఈ మధ్య కాలంలో పార్టీలు మారే నాయకులు ఎక్కువయ్యారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి. ప్రజా సమస్యలపై అవగాహన ఉండి పరిష్కరించే నాయకుడినే ఎంచుకుంటాం. అలా ఆలోచించి ఓటు వేస్తాం. – దుర్గారావు, తాపీమేస్త్రి, మూసాపేట

ఆలోచించిఓటేస్తాం
ఈ మధ్య కాలంలో పార్టీలు మారే నాయకులు ఎక్కువయ్యారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి. ప్రజా సమస్యలపై అవగాహన ఉండి పరిష్కరించే నాయకుడినే ఎంచుకుంటాం. అలా ఆలోచించి ఓటు వేస్తాం. – దుర్గారావు, తాపీమేస్త్రి, మూసాపేట 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top