ఆ ఎమ్మెల్యేలపై వేటు ఎందుకు వేయలేదు?

Madras High Court - Sakshi

తమిళనాడు స్పీకర్‌ను ప్రశ్నించిన మద్రాస్‌ హైకోర్టు

చెన్నై: దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలపై తమిళనాడు శాసనసభ స్పీకర్‌ ధనపాల్‌ అనర్హత వేటు వేయడంపై మద్రాసు హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ఓ పన్నీర్‌సెల్వం వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని స్పీకర్‌ను ప్రశ్నించింది. కేవలం దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలనే ఎందుకు అనర్హులుగా ప్రకటించారని నిలదీసింది. తమను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శశికళ వర్గం ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వంతో పాటు ఆయన వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డీఎంకే వేసిన పిటిషన్‌పై కూడా న్యాయస్థానం వాదనలు అలకించింది.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలు ప్రయత్నించారని, అందుకే 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారని స్పీకర్‌ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈ సందర్భంగా వాదించారు. అయితే స్పీకర్‌ చర్య రాజ్యాంగవిరుద్ధమని.. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి మాత్రమే మద్దతు ఉపసంహరించారని, పార్టీకి కాదని దినకరన్‌ తరపు న్యాయవాది అభిషేక్‌ మాను సింఘ్వి పేర్కొన్నారు. ఫిబ్రవరిలో సీఎం ఎడపాడి పళనిస్వామి బలపరీక్ష జరిగినప్పుడు శాసనసభలో పన్నీర్‌ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించినా చర్యలు తీసుకోలేదని, వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు. డీఎంకే పిటిషన్‌పై ఈ నెల 12లోగా సమాధానం ఇవ్వాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top