కమలం వర్సెస్‌ కమల్‌ ‘మధ్య’లో దంగల్‌

Madhya Pradesh Dangal Between Congress And BJP - Sakshi

కదనరంగం  మధ్యప్రదేశ్‌

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ప్రత్యక్ష ఎన్నికల పోరు సాగే రాష్ట్రం మధ్యప్రదేశ్‌. 29 లోక్‌సభ సీట్లున్న ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ 27, కాంగ్రెస్‌ 2 స్థానాలు దక్కించుకున్నాయి. 1991 నుంచి 2009 వరకూ జరిగిన ఆరు ఎన్నికల్లో మూడుసార్లు (1991, 96, 2009) మాత్రమే మూడో పక్షమైన బీఎస్పీకి సీట్లు దక్కాయి. అదీ 2009లో బీఎస్పీ ఒక్కచోటే విజయం సాధించింది. 1996 నుంచి వరసగా జరిగిన ఆరు ఎన్నికల్లో బీజేపీయే కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ప్రధాని మోదీ మంత్రివర్గంలో రాష్ట్రానికి మంత్రి పదవులు కూడా అధిక సంఖ్యలో దక్కాయి. 2003 నుంచి పదిహేనేళ్ల పాటు బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కానీ, కాంగ్రెస్‌ కన్నా 1 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో జాతీయాంశాలే కీలకం కావడంతో ఈసారీ ఓటర్లు బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపిస్తారని ఆ పార్టీ నమ్ముతోంది. కాంగ్రెస్‌ సీఎం కమల్‌నాథ్‌ రెండు నెలల పాలనలో ఎన్నికల హామీలను చాలా వరకు అమలు చేశారు. ఈ ఎన్నికలు కమల్‌నాథ్‌ పాలనకు, మోదీ పనితీరుకు మధ్య పోటీ అని సూచించేలా ‘60 రోజులు వర్సెస్‌ 60 నెలలు’ అని నినాదంతో కాంగ్రెస్‌ బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 29 నుంచి నాలుగు దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు మోదీ మళ్లీ ప్రధాని కావడానికి అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు.

‘కమలం’పై కమల్‌నాథ్‌ దూకుడు
కాంగ్రెస్‌ కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్‌ సీఎం అయ్యాక దూకుడుగా పాలన ప్రారంభించారు. జై కిసాన్‌ రుణమాఫీ పథకాన్ని కాం గ్రెస్‌ సర్కారు పకడ్బందీగా అమలు చేయడంతో 20 లక్షల మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందారు. బీసీ రిజర్వేషన్లను 14 నుంచి 27 శాతానికి పెంచింది. ఇవన్నీ కాంగ్రెస్‌కి కలిసొచ్చే అంశాలు. కమల్‌నాథ్‌ను అభివృద్ధి కాముకుడైన సీఎంగా చూపిస్తూ మోదీకున్న ఇమేజ్‌ను తట్టుకోవడానికి కాంగ్రెస్‌ ప్రచారం ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రైవేటు రంగంలో 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించే కంపెనీలకు రాయితీలు ఇస్తామని కమల్‌నాథ్‌ చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ప్రభావం ఈ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో అంచనా వేయడం కష్టం.

చౌహాన్‌ మ్యాజిక్‌ పనిచేస్తుందా?
కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 5 శాతం, ఎస్పీ సహా చిన్నా చితకా పార్టీలు 13 శాతం ఓట్లు సాధించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. కింద టి మూడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కన్నా బీజేపీకే ఎక్కువ సీట్ల రావడానికి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాయకత్వమే కారణమన్న వాదనలో నిజం ఉంది. ఈసారి హిందీ రాష్ట్రాల్లో ‘హిందుత్వ’కు ఇంకా తగ్గని అనుకూలత, పుల్వామా ఘటన అనంతరం సర్జికల్‌ దాడుల కారణంగా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని విశ్లేషిస్తున్నారు. ఆదివాసీ  ప్రజలకు గతంలో బీజేపీ హయాంలోని అమలైన సంక్షేమ కార్యక్రమాల వల్ల గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్టీలకు కేటాయించిన ఆరు రిజర్వుడ్‌ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో ఎస్టీల జనాభా 21 శాతం. అయితే, ఎస్టీల ప్రగతికి పనిచేస్తున్న జై ఆదివాసీ యువశక్తి (జైస్‌) నేత డా.హీరాలాల్‌ అలావా నవంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. శాసనసభ ఎన్నికల్లో కంటే ఈసారి బీజేపీ ఎక్కువ ఎస్టీ రిజర్వుడ్‌ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి.

కమల్‌నాథ్‌: ‘గాంధీ’లతో దోస్తీ
1980–2014 మధ్య 9 సార్లు చింద్వారా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్నకొడుకు సంజయ్‌కు సన్నిహిత మిత్రుడైన 72 ఏళ్ల కమల్‌ కోల్‌కతా నివాసి అయినా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కంచుకోట అయిన చింద్వారాను ఎంపిక చేసుకున్నారు. అయితే, 1996లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన తన భార్య అల్కాను 1997లో రాజీనామా చేయించి ఉప ఎన్నికలో పోటీచేసి అనూహ్యంగా ఓడిపోయారు. తర్వాత వరుసగా గెలుపొందారు. పంజాబీ వైశ్యుడైనా పుట్టింది కాన్పూర్‌లో. ఆయన కుటుంబం కోల్‌కతాలో స్థిరపడింది. కేంద్ర మంత్రిగా 15 ఏళ్ల అనుభవం, పాలనా సామర్థ్యం, నెహ్రూ–గాంధీ కుటుంబంతో ఉన్న సంబంధాల వల్ల ఆయన కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ముఖ్యమంత్రి కాగలిగారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే  గ్వాలియర్‌ మాజీ సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాను కాదని కమల్‌నాథ్‌ను సీఎం పీఠం ఎక్కించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై ఆయన పట్టు తక్కువే.

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌: పాలనాదక్షత
2005 నవంబర్‌లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అంతకుముందు నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ఉండగానే 2003 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ సీఎం దిగ్విజయపై రఘోగఢ్‌లో పోటీచేసి ఓడిపోయారు. 2003 బీజేపీ విజయం సాధించాక సీఎంలుగా పనిచేసిన ఉమాభారతి, బాబూలాల్‌ గౌర్‌ తర్వాత చౌహాన్‌ ఈ పదవి చేపట్టారు. పాలనాదక్షునిగా పేరు సంపాదించి 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చారు. బీసీ వర్గానికి (కిరార్‌ క్షత్రియ) చెందిన చౌహాన్‌ వరుసగా 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగడమే గాక, పార్టీని 2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో విజయపథంలో నడిపించారు. మొన్నటి ఎన్నికల్లో నాలుగోసారి సీఎం అయ్యే అవకాశం కోల్పోయారు.

సుష్మా స్వరాజ్‌: పోటీచేస్తారా?
గత రెండు ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని విదిశ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఈసారి ఆరోగ్య కారణాలతో పోటీ చేయకపోవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌ గతంలో రాజ్‌గఢ్‌ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన తమ్ముడు లక్ష్మణ్‌సింగ్‌ నాలుగుసార్లు గెలిచారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన దిగ్విజయ్‌ లోక్‌సభకు పోటీపై ఇంకా నిర్ణయించుకోలేదు. ఒకవేళ పోటీచేస్తే గత 30–35 ఏళ్లుగా కాంగ్రెస్‌ గెలవని మూడు నాలుగు సీట్లలో ఏదో ఒక చోట నుంచి దిగ్విజయ్‌ పోటీ చేయాలని సీఎం కమల్‌నాథ్‌ సూచించారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుత ఎంపీల్లో 12 మందికి పైగా టికెట్‌ రాకపోవచ్చని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా బీజేపీ 18 మంది సిట్టింగ్‌ సభ్యులకు టికెట్లు ఇవ్వలేదు.

దిగ్విజయ్‌సింగ్‌: సంచలనం సృష్టిస్తారా?
వివాదాస్పద ప్రకటనల ద్వారా సంచలనం సృష్టించే సీనియర్‌ కాంగ్రెస్‌ నేత దిగ్విజయసింగ్‌ (72) పదేళ్లు (1993–2003) ముఖ్యమంత్రిగా పనిచేసి పేరు సంపాదించారు. ఆయన సీఎంగా ఉండగా రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే పదేళ్లు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానన్న మాటను ఆయన నిలబెట్టుకున్నారు. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, రాహుల్‌గాంధీకి సలహాదారుగా దిగ్గీరాజా పనిచేశారు. ముస్లింలను ఆకట్టుకునే లక్ష్యంతో ఆయన కాంగ్రెస్‌ వైఖరికి విరుద్ధమైన ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దిగ్విజయకు గట్టి పట్టుంది. మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి అర్జున్‌సింగ్‌ శిష్యునిగా ఆయన కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన దిగ్గీరాజా తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top