రాహుల్‌ సెంచరీ కొడతాడా?

Lok Sabha Elections 2019 Rahul Will Beat Century - Sakshi

100 మార్కు దాటడం కాంగ్రెస్‌కు ఈజీయేం కాదు

అంతమాత్రం వస్తే అదీ అద్భుతమేనంటున్న విశ్లేషకులు

మేనిఫెస్టో ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదని అభిప్రాయం

పెద్ద రాష్ట్రాల్లో దీనస్థితిలో పార్టీ

ఎన్నికలు చివరికొస్తున్నకొద్దీ ఆత్మరక్షణలోకి.. అందుకే ప్రాంతీయ పార్టీలతో చర్చలు

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల్లోనూ ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 2014 సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్‌ (44 స్థానాలు).. రాహుల్‌ సారథ్యంలో ఈసారి వంద సీట్లయినా సాధిస్తుందా? అనేదే ఇప్పుడు ఢిల్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ సీనియర్ల ప్రైవేట్‌ సంభాషణల్లో జరుగుతున్న చర్చలను బట్టి చూస్తే.. కాంగ్రెస్‌ 100 మార్కు దాటడం అంత సులభంకాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. పార్టీ వ్యూహకర్తలు మాత్రం అన్నీ తాము అనుకున్నట్లుగా జరిగితే వంద సీట్లు సాధిస్తామంటున్నారు. అయితే, వ్యూహకర్తలు సీట్లు తెచ్చిపెడతాయని భావిస్తున్న మేనిఫెస్టోను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని, కాంగ్రెస్‌కు 100 సీట్లు రావడమంటే అద్భుతం సాధించినట్లేనని విశ్లేషకులు, ప్రజానాడిని కనిపెట్టే సర్వే నిపుణులు చెబుతున్నారు. ముంబై సట్టా బజారులోనూ కాంగ్రెస్‌కు 100 కంటే తక్కువ సీట్లు వస్తాయన్న దానిపైనే బెట్టింగ్‌లు ఎక్కువగా సాగుతున్నాయి.

చివరికొచ్చేసరికి ఆత్మరక్షణలో..కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే అంశంపైనే ప్రధానంగా రాజకీయ పండితులు,సెఫాలజిస్టులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వివిధ ప్రాంతీయ పార్టీలతో పెట్టుకున్న పొత్తులే.. కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో బలహీనపరిచాయని ప్రముఖ సెఫాలజిస్ట్‌ ఒకరు అన్నారు. ‘తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 437 సీట్లలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ 423 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా బలహీనమైపోయిందని, ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీ 15కి మించి సీట్లను గెలిచే పరిస్థితి లేదు’అని ఆయన పేర్కొన్నారు. నేటి పోలింగ్‌తో కలిపి 119 సీట్లకు సంబంధించి పోలింగ్‌ మాత్రమే మిగిలున్న తరుణంలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల అంశంపై ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలు, వాటికి అకాలీదళ్‌ ఆజ్యం పోయడంతో.. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ చివరి నిమిషంలో ఆత్మరక్షణలో పడిపోవాల్సివచ్చింది. ఢిల్లీ, హరియాణాలో 6వ విడత, పంజాబ్‌లో చివరి విడత లోక్‌సభ పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. కూటమితో కలిసి 150 సీట్లు వస్తాయని నమ్ముతున్న కాంగ్రెస్‌ సీనియర్లు లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రహస్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులతో సంప్రదింపులు నెరుపుతున్నారు.
 
తెరవెనుక ప్రయత్నాలు..
బీజేపీ 170కు మించి సీట్లు సాధించదని నమ్ముతున్న కాంగ్రెస్‌.. బీజేపీయేతర శక్తులకు ఏకం చేయడం ద్వారా నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాకుండా అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 30 ప్రాంతీయ పార్టీలు చిన్న సమూహాలుగా, ఉపకూటములుగా ఏర్పడి తాము సాధించే సీట్ల సంఖ్య ఆధారంగా బేరసారాలపై చర్చలు జరిపే అవకాశముందని కాంగ్రెస్‌ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై వాటికి మద్దతు తెలపాలని కాంగ్రెస్‌ని అడిగితే, కాంగ్రెస్‌ ఏం చేయబోతోందనే అంశంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ కూడా ఈ దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కాంగ్రెస్‌.. ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నికలకు ముందు పొత్తు సఫలం కాలేదు. ఈ పరిస్థితిలో ఎన్నికల తర్వాత అస్థిర ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్‌ను తప్పుబట్టాల్సిన పరిస్థితులు ఉండకపోవచ్చని చర్చ జరుగుతోంది.
 
కాంగ్రెస్‌ వార్‌ రూంలో నిరాశ
ఎన్నికల్లో సాధించే సీట్ల సంఖ్యపై కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూంలో జరిగే అంచనాలు తరుచుగా మారుతూ వచ్చాయి. ఏప్రిల్‌ 29న జరిగిన 4వ విడత పోలింగ్‌ తర్వాత గానీ.. సీట్ల సంఖ్యపై ఆ పార్టీ స్థిరమైన అంచనాకు రాలేకపోయిందని పార్టీ కోర్‌ కమిటీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కేరళలో 20కు గాను 17 సీట్లు సాధించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. అదే విధంగా పంజాబ్‌లో సైతం కాంగ్రెస్‌ 13 సీట్లు గెలుస్తామన్న ఆశాభావంతో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న 20 సీట్లలో సగం ఓడిపోతుందని ఆ పార్టీ వర్గాలే అంచనా వేస్తున్నాయి. బీజేపీ మాత్రం ఆ రాష్ట్రంలో తన 17 సీట్లను నిలుపుకోవడంతో పాటు అదనంగా మరికొన్ని సీట్లు సాధించే అవకాశాలున్నాయని సర్వే పండితులు అంటున్నారు.

డీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో కాంగ్రెస్‌ 9 సీట్లలో పోటీ చేస్తుండగా, కనీసం 5 సీట్లు గెలుపే లక్ష్యంగా పని చేసింది. దేశం మొత్తంమీద కాంగ్రెస్‌ కూటమికి మంచి అవకాశాలు ఉన్నరాష్ట్రం ఏదైనా ఉందంటే అది తమిళనాడు మాత్రమే. ఆ తరువాత కాంగ్రెస్‌ చెప్పుకోదగ్గ సీట్లను సాధించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటని భావిస్తోంది. అయితే ఆ రాష్ట్రంలోని 48 సీట్లలో 34కు పైగా ఎన్‌డీఏ కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతమున్న రెండు సీట్ల కంటే మరో 2 లేదా 3 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకోవచ్చని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ రెండు రాష్టాల్లోని 42 స్థానాలకు గాను కేవలం ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాదాపు ఇదే పరిస్థితిని ఒడిశాలో ఎదుర్కొంటోంది. అక్కడ ఒక్క స్థానం కూడా రాకపోవచ్చని కాంగ్రెస్‌ వర్గాలే అంటున్నాయి.
 
పెద్ద రాష్ట్రాల్లో దిక్కుమొక్కులేదు
పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ల్లో పార్టీ పరిస్థితితో కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది స్థానాల్లో గెలుస్తామని పార్టీ అంచనా వేస్తున్నా.. రాయ్‌బరేలీ, అమేథీ కాకుండా అదనంగా ఒక్కసీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వే నిపుణులు అంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాలుగు చోట్ల గెలిస్తే ఈసారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ ఒక్కడే గెలిచే అవకాశం ఉంది. బిహార్‌లో గత ఎన్నికల్లో ఒక్క స్థానమే దక్కగా ఈసారి ఆ సంఖ్యను 2–3కి పెంచుకునే అవకాశం ఉందంటున్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ 20–25 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలను బేరీజు వేసుకుని చూస్తే కాంగ్రెస్‌ పార్టీ వంద స్థానాలకు చేరుకుంటుందా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top