జాతీయ పార్టీల ‘ఉనికి’పాట్లు

Lok Sabha Elections 2019 BJP Congress Have Tough Competition In Telangana - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఎదురీత

ఆరు సెగ్మెంట్లపైనే కాంగ్రెస్‌ పార్టీ దృష్టి

మూడింటిపైనే కమలనాథుల ఆశలు

ప్రజల్లోకి పెద్దగా వెళ్లని రాహుల్‌ ఎజెండా

బీజేపీ ప్రయత్నాలకు కానరాని ఊతం

ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో విఫలం  

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో మాత్రం ఎదురీదుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాలైనా గెలుచుకొని ఉనికి చాటుకునేందుకు పాట్లు పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి ఆ పార్టీలు ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదని, లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాల అమల్లో ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్‌ ఆరు చోట్ల, బీజేపీ మూడింటిలో ప్రభావం చాటుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న తీరు రెండు జాతీయ పార్టీల పరిస్థితికి అద్దం పడుతోంది. 

ఓట్లు రాల్చే వ్యూహమేదీ? 
కారు.. సారు.. సర్కారు, పదహారు అంటూ అధికార పక్షం ఎన్నికల క్షేత్రంలో దూసుకెళ్తుంటే కాంగ్రెస్, బీజేపీలు మాత్రం నామమాత్రంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఓట్లు రాల్చే బలమైన నినాదం కానీ విధానం కానీ తీసుకురాకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల్లో జోష్‌ కనిపించట్లేదు. ఓవైపు కేసీఆర్, కేటీఆర్, ఇంకోవైపు మంత్రులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను వెంటేసుకొని జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుంటే రెండు జాతీయ పార్టీల నేతలు మాత్రం తాము కూడా బరిలో ఉన్నామనే సంకేతాలిచ్చే దశలోనే ఇంకా నిలిచిపోవడం చర్చనీయాంశమవుతోంది. పోలింగ్‌కు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజల్లో ఆయా పార్టీలపై విశ్వా సం కల్పించే ప్రయత్నాలకు, ప్రచారాలకు పూనుకోలేదు. పార్టీ కేడర్‌లోనూ, ప్రజల్లోనూ భరోసా కల్పించడంలో ప్రతిపక్షాలు విఫలం కావడంతో ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశముందనే సంకేతాలతో సీఎం కేసీఆర్‌ కూడా పోలింగ్‌ శాతం తగ్గకుండా చూడాలని, అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో పోలింగ్‌ జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడటం గమనార్హం. 

‘ఆరొస్తే’ చాల్లే... 
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ  17 లోక్‌సభ స్థానాల్లో కేవలం ఆరు సెగ్మెంట్లపైనే గురిపెట్టి నట్లు కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  పోటీ చేస్తున్న నల్లగొండతోపాటు భువనగిరి, మల్కాజిగిరి, చేవెళ్ల, ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాలపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకొని పనిచేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కేవలం ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాల్లోనే కాంగ్రెస్‌కు మెజారిటీ రాగా భువనగిరిలో టీఆర్‌ఎస్‌కు కొంచెం దగ్గరగా ఓట్లు పోలయ్యాయి. ఈ మూడు చోట్లా ఫలితం పునరావృతమవుతుందనే అంచనాల్లో కాంగ్రెస్‌ పెద్దలున్నా అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలు కొంత ప్రతికూల పరిస్థితులను కల్పించాయి. నల్లగొండలో ఉత్తమ్‌ చరిష్మాపైనే కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకోగా మల్కాజిగిరి బరిలో ఉన్న రేవంత్‌ వ్యక్తిగతంగా ప్రభావం చూపుతారని, నియోజకవర్గంలోని సెటిలర్లు, సామాజిక సమీకరణాలు అనుకూలిస్తాయని అంచనా వేస్తోంది.

చేవెళ్లలో మాత్రం తాజా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో ఉండటంతో అక్కడ కూడా అనుకూల ఫలితం వస్తుందని భావిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత 9 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోగా 10 మందికిపైగా ముఖ్య నేతలు కూడా గుడ్‌బై చెప్పారు. సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో పూర్తిగా ఆ పార్టీ కేడర్‌ నైరాశ్యంలో ఉండిపోయింది. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెబుతున్న రుణమాఫీ, కనీస ఆదాయ పథకాలపై కాంగ్రెస్‌ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ రూ. 2 లక్షల రుణమాఫీ అంశం ఈ ఎన్నికల్లో ఎక్కడా కాంగ్రెస్‌ ప్రధాన ప్రచారాస్త్రంగా కనిపించట్లేదు. కనీస ఆదాయ పథకాన్ని రాహుల్‌ ప్రకటించినా అది కూడా ప్రజల్లోకి పెద్దగా వెళ్లినట్లు కనిపించట్లేదు. నెలకు రూ. 12 వేలకన్నా ఎంత తక్కువ ఆదాయం ఉంటే మిగిలిన మొత్తాన్ని పేద కుటుంబాలకు ఇస్తానని రాహుల్‌ చెప్పిన పథకంలో లబ్ధిదారుల ఎంపిక, అమలు కొంత గందరగోళంగానే కనిపిస్తున్నాయి. 

ఊపు కోసం ప్రయత్నించినా...! 
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెలంగాణలో తామే చక్రం తిప్పుతామంటూ కమలనాథులు ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో తమకు ఎంతో కొంత బలముందని భావించే హైదరాబాద్‌ జంట నగరాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డారు. ఉన్న సీట్లను కూడా పోగొట్టుకొని లోక్‌సభ ఎన్నికల ముందు బోర్లాపడ్డ బీజేపీలో ఇప్పటికీ జోష్‌ రావట్లేదు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.. ఇలా ఎంత పెద్ద నేతల పేర్లు చెప్పినా కేడర్‌లో కిక్‌ రావట్లేదు. పార్టీని బలోపేతం చేసుకునేందుకు రెండు, మూడు సార్లు ప్రయత్నించినా అవి సఫలం కాలేదు.

ఎన్నికల ముందు కొంత ఊపు కోసం చాలా మంది కాంగ్రెస్‌ నేతలను సంప్రదించినా మాజీ మంత్రి డి. కె. అరుణ మాత్రమే పార్టీలో చేరారు. దీంతో ఆమెను మహబూబ్‌నగర్‌ నుంచి బరిలో దింపారు. అక్కడ బీజేపీకి ఉన్న కొంత స్థానిక బలానికి తోడు అరుణ చరిష్మా, ఆమె కేడర్‌ కలసి గెలుపుతీరాలకు చేరుస్తాయని అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీ దత్తాత్రేయను కాదని కిషన్‌రెడ్డిని పార్టీ రంగంలోకి దింపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నేతగా కిషన్‌ వేసిన ముద్ర ఆయనకు ఓట్లు తెచ్చిపెడుతుందని, దీనికితోడు సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా తోడవుతుందని అంచనా వేస్తోంది. మల్కాజిగిరిలో ఉనికి చాటుకునేందుకు ఎమ్మెల్సీ రాంచందర్‌రావును బరిలోకి దింపింది. మొత్తంమీద కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలుస్తాయా లేక అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే చతికిలబడతాయా అనేది వేచిచూడాల్సి ఉంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top