గ్లాసుపై గలాటా

Liquor ban impossible, says Siddaramaiah - Sakshi

మద్య నిషేధానికి బీజేపీ డిమాండ్‌  

నరేంద్రమోదీని అడగాలన్న సీఎం సిద్ధు

మాటల యుద్ధంతో అట్టుడికిన విధానసభ

బెళగావి సువర్ణసౌధలో మద్యం అంశం ప్రకంపనలు రేపింది. మద్య నిషేధంపై మీ వైఖరేమిటి?, మద్యాన్ని ఎందుకు నిషేధించరు అని ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో అధికార కాంగ్రెస్‌ ఎదురుదాడి చేసింది. ఇరుపక్షాలు వాగ్బాణాలు సంధించుకోగా సభ వేడెక్కిపోయింది.

సాక్షి, బెంగళూరు: మద్యపాన నిషేధానికి సంబంధించి బీజేపీ అగ్రనేతలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన విమర్శలతో మంగళవారం బెళగావి విధానసభ అట్టుడికింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే చోటు చేసుకోవడంతో మధ్యాహ్నం వరకు సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ నేత సి.టి.రవి మాట్లాడుతూ....‘రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఉంటే ఎప్పటినుంచి నిషేధం  విధిస్తారు? మద్యపానం ద్వారా పేద కుటుంబాలు వీధిపాలవుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? అలాంటివారికి ప్రభుత్వం ఏదైనా పరిహారం ఇస్తుందా?’ అని ప్రశ్నించారు. ఇందుకు ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఆర్‌.బి.తిమ్మాపుర సమాధానమిస్తూ అలాంటి ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని ఒక్కమాటలో స్పష్టంచేశారు.

నిషేధానికి వీలు కాదు: సీఎం  
ఈ విషయమై చర్చ నిదానంగానే ప్రారంభమైనా క్రమంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధానికి దారితీసింది. ఈ సందర్భంలో  సీఎం సిద్ధరామయ్యే స్వయంగా సమాధానమిస్తూ....రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించేందుకు వీలుకాదని అన్నారు. సి.టి.రవి

కలగజేసుకుంటూ...‘ఇప్పటికే బీహార్, మధ్యప్రదేశ్‌లలో మద్యపాన నిషేధాన్ని విధించారు. అలాంటపుడు కర్ణాటకలో ఎందుకు నిషేధం విధించకూడదు?’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య....‘గతంలో మీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్‌.యడ్యూరప్ప కూడా మధ్యపాన నిషేధాన్ని వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధాన్ని విధించమని మీ ప్రధాని నరేంద్రమోదీని కోరండి’ అని వ్యాఖ్యానించారు.

సిద్ధుది బాధ్యతారాహిత్యం: శెట్టర్‌
సీఎం మాటలతో బీజేపీ నేతలు కోపంతో ఊగిపోయారు. బీజేపీపక్ష నేత జగదీష్‌ శెట్టర్‌ మాట్లాడుతూ....‘సిద్ధరామయ్య చాలా భాద్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పినదంతా అబద్ధం. సభకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం ఎంత వరకు సబబు. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలి’ అని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా సభలోని ఇతర బీజేపీ సభ్యులతో కలిసి స్పీకర్‌ పోడియంలోకి దూసుకెళ్లి తమ నిరసనను తెలియజేశారు. సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేయడంతో కాంగ్రెస్‌ సభ్యులు కూడా వాగ్వాదానికి దిగారు.

సిగ్గు శరం లేదు మీకు: సీఎం
ఈ సందర్భంలో తనదైన శైలిలో వాగ్భాణాలను సంధించిన సీఎం సిద్ధరామయ్య...‘బీజేపీ నేతలకు సిగ్గు, మానం, మర్యాదా ఏమీ లేవు. సంస్కృతి తెలీదు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డేకు కాస్తంతైనా సంస్కృతి తెలుసా? నటి దీపికా పదుకొణె తల నరికితే బహుమానం ఇస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. అలాంటి వారి నుండి మేం పాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం లేదు.’ అని ధ్వజమెత్తారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పీకర్‌ కోళివాడ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top