ఎన్నికల తర్వాత ఎన్డీఏ గూటికే

Leak to the selected media for this report - Sakshi

బీజేపీ అధిష్టానానికి ప్రత్యేక ‘మిత్రుల’ ద్వారా చంద్రబాబు సమాచారం

 కాంగ్రెస్‌తో అవగాహన ఎన్నికల ముందు వరకేనని స్పష్టం

కాంగ్రెస్‌–ఇతర పక్షాల తోడ్పాటు లేకుండా వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనే పరిస్థితి లేదని వివరణ

ఇటీవల ఫిలింసిటీలో అమిత్‌షా – రామోజీ 45 నిమిషాల ఏకాంత భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ఆ తర్వాత కొద్దిరోజులకే టీడీపీకి వెన్నుదన్నుగా నిలబడే సామాజికవర్గ వనభోజనాలకు వేదికైన ఫిలింసిటీ

ఇందులోనూ కొందరు ‘పెద్దల’ ప్రత్యేక రాజకీయ చర్చలు.. 

ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈడీ బృందం కోర్టుకు సమర్పించినట్టు చెబుతున్న రిపోర్టు కలకలం

జగన్‌ సతీమణి భారతీరెడ్డిని కూడా నిందితురాలిగా చేర్చారంటూ ఎల్లోమీడియాకు లీకులు

ఈడీ అధికారులు గాంధీ, ఉమాశంకర్‌గౌడ్‌ల వ్యవహారశైలిపై ఏడాదిన్నర క్రితమే ప్రధానికి జగన్‌ లేఖ 

స్పందించని కేంద్రం.. పదవీకాలం పూర్తయినా కొనసాగిన గాంధీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కక్ష సాధింపు ధోరణి ఊతంగా పనిచేసిన సీబీఐ సైతం ప్రస్తావించని వైఎస్‌ భారతి పేరును ఏడేళ్ల తర్వాత దురుద్దేశంతో ఇరికించే కుట్ర

ఈ రిపోర్టు వివరాలు ఎంపిక చేసిన మీడియాకు లీక్‌

సాక్షి, హైదరాబాద్‌: 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్డీయే గూటికే చేరనుందా..? ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రత్యేక ‘మిత్రుల’ ద్వారా సమాచారం చేరవేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల తర్వాత బీజేపీ కూటమిలో చేరతామని, అయితే ఎన్నికలకు ముందు మాత్రం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌తోపాటు, ఇతర పక్షాల సహకారం అవసరమని కూడా ఆయన బీజేపీ పెద్దలకు తెలియజేసినట్టు సమాచారం. టీడీపీ హితులు, అనుకూల మీడియా పెద్దల సూచనల మేరకు అటు కాంగ్రెస్‌తో ఎన్నికల ముందు అవగాహన, తర్వాత ఎన్డీయే కూటమిలో చేరే వ్యూహం ఖరారైందని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఫిలింసిటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా 45 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ కావడం చర్చనీయాంశం అయింది. 

మళ్లీ మీ గూటికే వస్తాం... 
ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను తన అవసరానికి వాడుకున్నా ఎన్నికల తర్వాత మాత్రం తాను ఎన్డీయే కూటమిలోకే వస్తానని ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి తన దూతల ద్వారా చంద్రబాబు సమాచారం చేరవేశారు. కాంగ్రెస్‌తో ఆంధ్రప్రదేశ్‌లో అవగాహన ఉంటుందని, కానీ జగన్‌ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌తో పాటు ఇతర పక్షాల పరోక్ష సహకారం తీసుకోవాల్సి ఉంటుందని బీజేపీకి నివేదించారు. ఇటువంటి సహకారం ద్వారానే ఎంతోకొంత నష్టనివారణ చేసుకోగలుగుతామని అందులో వివరించారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫిల్మ్‌సిటీలో రామోజీతో భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ భేటీలో కొద్దిసేపు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నా 45 నిమిషాలకు పైగా అమిత్‌షా, రామోజీలు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాతి కొద్దిరోజులకే టీడీపీకి అండగా ఉండే సామాజిక వర్గం వనభోజనాలు జరగడం, ఈ సందర్భంగా కొందరు ‘పెద్దలు’ ప్రత్యేకంగా రాజకీయ చర్చలు జరిపినట్టు సమాచారం. ముఖాముఖీ పోటీచేస్తే టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకి 10 శాతం కన్నా అధిక మద్దతు లభిస్తుందని సర్వేల్లో తేలుతోందని ఈ పెద్దల గోష్టిలో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. 

ప్రతిష్ట దెబ్బతీసే వ్యూహం
ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బృందం కోర్టుకు సమర్పించారని చెబుతోన్న ఓ రిపోర్టు కలకలం సృష్టిస్తోంది. జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీరెడ్డిని కూడా రఘురాం సిమెంట్స్‌ కేసులో నిందితులుగా చేర్చారని ఎల్లోమీడియాతో పాటు ఎంపిక చేసుకున్న కొన్ని మీడియా సంస్థలకు ఈడీ లీకులిచ్చింది. ఈ కేసుల విచారణలో ఈడీ అధికారులుగా పనిచేస్తోన్న గాంధీ, ఉమాశంకర్‌గౌడ్‌లు తమను వేధిస్తున్నారని, చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ఏడాదిన్నర క్రితమే వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయినా కేంద్రం స్పందించకపోగా, పదవీకాలం పూర్తయినప్పటికీ గాంధీ పలుమార్లు తన పదవీకాలాన్ని పొడగించుకున్నారు. తాను బదిలీ అయిన తర్వాత కూడా రిపోర్టు తయారు చేసి కోర్టుకు సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దన్నుతో, కక్షసాధింపు వైఖరితో పనిచేసిన సీబీఐ సైతం ప్రస్తావించని వైఎస్‌ భారతి పేరును ఏడేళ్ల తర్వాత కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేయడం, దాన్ని కోర్టుకు సమర్పించామంటూ ఎల్లోమీడియాకు లీకులివ్వడం జగన్‌ ప్రతిష్టను దెబ్బతీసే చర్యల్లో భాగమేనని తెలుస్తోంది. తెలుగుదేశం నేతల ప్రమేయంతోనే ఇంతకుముందే తయారైన రిపోర్టును తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈడీ కోర్టుకు సమర్పించిందని మీడియా లీకుల ద్వారా అర్థమవుతోంది. ఈ పరిణామాలు బీజేపీ, టీడీపీల మధ్య ఉన్న రాజకీయ అవగాహనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

ఓటమి భయంతో ‘అడ్డ’దారులు
రెండు నెలలక్రితం తూర్పుగోదావరి జిల్లాలోకి జగన్‌ పాదయాత్ర ప్రవేశించినప్పుడు రాజమహేంద్రవరం బ్రిడ్జిపై అఖండ గోదావరిలా కనిపించిన జనకెరటం, ఆ తర్వాత జిల్లా ఆసాంతం వెల్లువెత్తిన జనవాహిని ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీకి 10శాతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని టీడీపీ మేధావులే విశ్లేషణల్లోనే బయటపడింది. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఒక మీడియా సంస్థ పలుమార్లు సర్వేలు నిర్వహించిన అనంతరం వైఎస్సార్‌సీపీ 132 సీట్లు సాధిస్తుందని తేల్చింది. అదే క్రమంలో టీడీపీ మాత్రం కచ్చితంగా 28 సీట్లను మాత్రమే గెలవగలుగుతుందని, మిగిలిన స్థానాల్లో హోరాహోరీ పోరు తప్పదని బాబుకు నివేదికలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచీ టీడీపీకి వెన్నుదన్నుగా ఉండే కొందరు మీడియా పెద్దలు, కొందరు మేధావులు కలిసి వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top