టీఆర్‌ఎస్‌ విముక్త తెలంగాణ లక్ష్యం

laxman on trs - Sakshi

ఇక పార్టీలో చేరికలపై దృష్టి: కె.లక్ష్మణ్‌

నెలాఖరులో అమిత్‌ షా.. జనవరిలో మోదీ పర్యటన

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సూర్యాపేట అర్బన్‌: టీఆర్‌ఎస్‌ విముక్త తెలంగాణ లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. గురువారం ఖమ్మం, సూర్యాపేటలో వేర్వేరుగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుం దన్నారు. అందుకే పార్టీ బలోపేతంపై దృష్టి సారించామని చెప్పారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించడంతోపాటు సభలు, సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేస్తామన్నారు.

ప్రధాని మోదీ సమర్థ పాలన, ప్రజలకు అందుతున్న ఫలాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలపై ప్రచారం చేస్తామన్నారు. ఇందులో భాగంగా బీసీ సంగ్రామం, నిరుద్యోగ సమరభేరి పేరుతో సభలు నిర్వహిస్తా మన్నారు. ఈ నెలాఖరున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌లో పర్యటిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.

పార్టీ మారిన ఫిరాయింపు దారులకు ఉద్యోగాలు వచ్చాయి కానీ.. తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదన్నారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాల తర్యాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టనుందని, ఇందులో భాగంగా జనవరిలో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని లక్ష్మణ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

Tags: 
Back to Top