టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే

Lakshman comments on trs

     బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ 

     ముగిసిన రెండు రోజుల బీజేపీ కార్యవర్గ సమావేశాలు 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రామకృష్ణాపూర్‌లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆదివారం లక్ష్మణ్‌ అధ్యక్షోపన్యాం చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు కావస్తున్నా ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుకూలంగా పాలన సాగటం లేదన్నారు. జలయజ్ఞంతో కాంగ్రెస్‌ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోతే.. నేడు కేసీఆర్‌ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పేరిట అవినీతికి తలుపులు తెరిచిందని విరుచుకుపడ్డారు. రైతులు, ప్రజలు, నిరుద్యోగులు అన్నివర్గాల ప్రజలు సంక్షోభంలో కూరుకుపోతుంటే టీఆర్‌ఎస్‌కు చెందిన అమాత్యులు, నేతలు కుబేరులు అవుతున్నారని లక్ష్మణ్‌ దెప్పిపొడిచారు. రాష్ట్రంలో 3 లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయని, వీటిలో లక్ష పోస్టుల్ని తక్షణం భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌ ఆచరణలో విఫలం అయ్యారని లక్ష్మణ్‌ మండిపడ్డారు.   

ఐటీ చెల్లించే వారి సంఖ్య పెరిగింది...
దేశంలో అవినీతిని అంతం చేయడం, నల్లధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా పెద్దనోట్ల రద్దు చేయడం జరిగిందని బీజేపీ నేత, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఐటీ చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. జీఎస్‌టీ వల్ల భవిష్యత్తులో మేలు జరుగుతుందని చెప్పారు. 

అన్ని రాష్ట్రాల్లో మోడీకి బ్రహ్మరథం  
దేశంలో బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా నిలుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ అన్నా రు. అందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే ఆయువుపట్టు లాంటివన్నారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా కాంగ్రెస్‌ పార్టీ మారిందని ఎద్దేవా చేశారు.   

ఉత్సాహభరితంగా సమావేశాలు 
రెండు రోజులపాటు ఉత్సాహభరితంగా సాగి న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. పార్టీ సంస్థాగత అంశాలపై  సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు బండారు దత్తాత్రేయ, జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచం ద్రారెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రారావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top