ముంచే పేటెంట్‌ చంద్రబాబుదే 

Kurasala Kannababu Fires On Chandrababu - Sakshi

ఏపీలో వైఎస్‌ జగన్‌ జనరంజక పాలన

కడుపుమంటతో టీడీపీ నేతలు  

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో జనరంజక పాలన సాగుతోందని  వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పిల్లనిచ్చిన మామతో సహా ఎవరినైనా ముంచే పేటెంట్‌ చంద్రబాబుకే ఉందని ధ్వజమెత్తారు. ఆరు నెలల్లోనే ఇటు ప్రజల్లోనూ, అటు దేశ వ్యాప్తంగా సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు రావడంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, వారి మందిమార్బలానికి కడుపు మంట ఎక్కువై రగిలిపోతున్నారని మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆరు నెలల పాలనపై టీడీపీ విడుదల చేసిన పుస్తకాన్ని, బయటకు విడుదల చేస్తే ప్రజలు చంద్రబాబును ఛీ కొడతారని తెలిపారు. ఆరు నెలల్లోనే ఇంత దుష్ప్రచారం చేస్తారా అని బుద్ధి చెబుతారన్నారు. బాబు నేతృత్వంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని, వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిందన్నారు. ఈ దశలో పాలన పగ్గాలు చేపట్టిన జగన్‌ అన్ని వర్గాల్లో ఒక సంతృప్తి కలిగేలా పాలన సాగిస్తున్నారన్నారు. దేశంలో బాగా పనిచేసే సీఎంల పేరు తీస్తే మొదటి వరుసలో వైఎస్‌ జగన్‌ పేరు ఉంటుందన్నారు.  

బాబు అబద్ధాల ఫ్యాక్టరీలో రోజుకో అబద్ధం
చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీలో రోజుకో అబద్ధం ఉత్పత్తి చేసి, ప్రజల్లో విష బీజాలు నింపేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్‌ వారి అనుయాయులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఏదో విధంగా టీడీపీని నిలబెట్టుకోవాలనే తపన చంద్రబాబులో కనిపిస్తోందని తెలిపారు. 23 సీట్లు ఎందుకు వచ్చాయో విశ్లేషించుకోకుండా సీఎం వైఎస్‌ జగన్‌పై తప్పుడు ఆరోపణ చేస్తే మీ పార్టీ నిలబడుతుందా అని ప్రశ్నించారు. 50 శాతం ఓట్లు, 80 శాతం సీట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ను ముంచే సీఎం అని మాట్లాడటం తగదన్నారు.

టీడీపీ వేసిన మొత్తం పుస్తకాన్ని చూస్తే మే 23న వైఎస్‌ జగన్‌ పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన వెంటనే అబద్ధాలతో పుస్తకాన్ని రాసినట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. బాబు హయాంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానమని జాతీయ సంస్థలు నివేదికలు ఇచ్చిన విషయం మరచిపోయి చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top