రాష్ట్రంలో నాలుగు విప్లవాలు : కేటీఆర్‌

KTR Speech IN Assembly Over Electricity - Sakshi

అసెంబ్లీలో పరిశ్రమలు,ఐటీ మంత్రి కేటీఆర్‌

6దశాబ్దాల విద్యుత్‌ సమస్య..6 నెలల్లో అధిగమించాం..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో నాలుగు విప్లవాలొచ్చాయని, కోటి ఎకరాలకు నీరివ్వడం ద్వారా హరితవిప్లవం, మత్స్య, గొర్రెల పరిశ్రమల ద్వారా నీలి విప్లవం, మీట్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ ద్వారా గులాబీ విప్లవం, డైరీని పెంపొందించడం ద్వారా శ్వేత విప్లవం సాధిస్తున్నామని మున్సిపల్‌. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆరు దశాబ్దాల్లో సాధించని విద్యుత్‌ సమస్యను కేసీఆర్‌ నాయకత్వంలో ఆరు నెలల్లోనే అధిగమించామని చెప్పారు. విద్యుత్‌ సమస్య తీరడంతో ఇన్వర్టర్లు, జెనరేటర్ల తయారీదారులతో పాటు కాంగ్రెస్‌ కూడా దివాలా తీసిందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ అక్కసు వెళ్లబుచ్చుతూ, హేళనగా మాట్లాడుతూ, సొంత రాష్ట్రాన్ని ఎందుకు శాపాలు పెడుతున్నారని మండిపడ్డారు.శుక్రవారం అసెంబ్లీలో పరిశ్రమలు, ఐటీ పద్దులపై చర్చకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చే ర్యాంకుల్లో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా రెండుసార్లు తెలంగాణకు ఉత్తమ ర్యాంకు వచ్చిందా లేదా.. ప్రపంచబ్యాంకు ర్యాంకులో కూడా ముందుందా లేదా అని కాంగ్రెస్‌ను నిలదీశారు. కాళేశ్వరం నీళ్ల గురించి మాట్లాడితే కాంగ్రెస్‌కు కడుపు మండుతోందని మంత్రి కేటీఆర్‌ దుయ్యబట్టారు.మైనింగ్, ఇసుక నుంచి గతం కంటే ఆదాయం పెంచామన్నారు.

10 వేల పరిశ్రమలకు అనుమతి.. 
టీఎస్‌ఐపాస్‌ ద్వారా 10,993 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు కేటీఆర్‌ తెలిపారు. మొత్తం రూ.1,69,859 కోట్ల మేర పెట్టుబడులొచ్చాయని, 12,71,789 మందికి ప్రత్యక్షంగా.. దీనికి రెండున్నర రెట్ల మందికి పరోక్షంగా ఉపాధి కలిగింద న్నారు. టీ–ఐడియా, టీ–ప్రైడ్‌ ద్వారా ఎస్సీలకు 15.44, ఎస్టీలకు 9.43 శాతం పారిశ్రా మిక పార్కుల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు.

మీరు ఇటుకలతో కొడితే..
‘బిల్ట్‌ మూతపడితే రూ.322 కోట్లు ఇచ్చి తెరిపించే ప్రయత్నం మా ప్రభుత్వం చేసింది. కాగజ్‌నగర్‌లో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు, రామగుండం ఫర్టిలైజర్‌ ప్రాజెక్టును పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నాం. మీరు ఇటుకలతో కొడితే మేం రాళ్లతో కొట్టగలం’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  ప్రపంచంలోనే టాప్‌ కంపెనీలైన అమెజాన్, గూగుల్, ఫేస్‌ బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని వివరించారు. కాగా, కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో అడ్డిమారి గుడ్డి దెబ్బ తరహాలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారని, తెలంగాణలో బీజేపీకి అంతగా ప్రాధాన్యం లేదని కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ‘రాజగోపాల్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో అయోమయంలో ఉన్నట్లున్నారు. ప్రస్తుతం ఆయన ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు’ అని  కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top