పట్టు కోసం.. ఉడుం పట్టు!

KTR Special Programs In Nalgonda - Sakshi

టీఆర్‌ఎస్‌ ముందస్తు వ్యూహం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరుస కార్యక్రమాలు

ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి తారకరామారావు

అన్నీ తానై వ్యవహరిస్తూ..అంతటా అభివృద్ధి మంత్రం

ఇప్పటికే రెండుచోట్ల ప్రగతి సభల నిర్వహణ

ఈ నెలలో మునుగోడు, నల్లగొండలో సభలకు ప్లాన్‌

ప్రతిపక్ష కాంగ్రెస్‌ను మట్టికరిపించేందుకు ప్రణాళికలు

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని పన్నెండు అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయం తమదేనన్న భరోసా వ్యక్తం చేస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ దాని కి తగినట్లే ముందస్తు వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. గత ఎన్నికల్లో ఆరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ ఈసారి మాత్రం మొత్తం స్థానాలపై కన్నేసిందని, ఆ మేర కు వ్యూహరచన జరిగిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే ఐటీ, మున్సి పల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్‌) జిల్లాపై దృష్టి సారించారని అంటున్నారు. ప్రగతి సభల పేరిట ఇటీవల కేటీఆర్‌ తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొని ప్రసగించా రు. సూర్యాపేటలో రెండు పర్యాయాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ నెలలో మరో రెండు కార్యక్రమాల్లో కేటీఆర్‌ పాల్గొం టారని పార్టీ నాయకులు వివరించారు. గతంలో కార్యక్రమం రద్దయిన ము నుగోడుతోపాటు, నల్లగొండలో సైతం ప్రగతి సభలు జరుగుతాయని సమాచారం. సోమవారంనుం చి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాను న్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఆలస్యం కాకుం డా తేదీలు కూడా ఖరారు చేశారని అంటున్నారు.

కాంగ్రెస్‌ను మట్టిగరిపించాలని!
గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలుచుకున్న రెండు జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకటి. అదీకాకుండా ఈ జిల్లానుంచే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ శాసన సభాపక్షం (సీఎల్పీ) నేత జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి  వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే జిల్లానుంచి ముగ్గురు కీలక నేతలు ఉన్న నేపథ్యంలో ముందుగా కాంగ్రెస్‌ను దెబ్బతీసే కార్యక్రమాన్ని ఇక్కడినుంచే మొదలుపెట్టాలని గులాబీ నాయకత్వం భావిస్తోందని పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు దక్కకుండా పోయిన నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడలపై పూర్తిగా దృష్టి సారించింది. ఏడాదిన్నర కిందట స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి స్థానానికి జరిగిన ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ గెలవలేకపోయింది.

ఆ ఎన్నికల్లో భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. రాష్ట్రం మొత్తంలో ఒక విధంగా ఫలితాలు వస్తే, నల్లగొండ జిల్లాలో మాత్రం టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా ఫలితం వచ్చింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అష్టదిగ్బంధం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ఎత్తులు వేస్తోంది. గత ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ స్థానంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల భూపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించింది. నాలుగు పర్యాయాలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండనుంచి వరసగా విజయం సాధించగా, ఈసారి ఆనవాయితీని మార్చేందుకు టీఆర్‌ఎస్‌  పదునైన వ్యూహమే రచిస్తోందంటున్నారు. నల్లగొండ లోక్‌సభా స్థానం నుంచి సీఎం కేసీఆర్‌ను పోటీ చేయాలని పార్టీ జిల్లా నాయకత్వం ఆహ్వానించడం దానిలో భాగమంటున్నారు.

అభివృద్ధి మంత్రం
వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రగతి సభల్లో అభివృద్ధి మంత్రమూ జపిస్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ కేంద్రాల్లో జరిగిన సభల్లో మున్సిపాలిటీలకు మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇందులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, మిషన్‌ భగీరథ పథకాలతోపాటు ఇంకా అవసరమైన పనుల కోసం నిధులు కుమ్మరిస్తున్నారు. ఎట్టి పరిస్థితిల్లో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించాలన్న దృఢ నిశ్చయంతో పార్టీ అధినాయకత్వం ఉందని పేర్కొంటున్నారు. ప్రగతి సభలన్నీ పూర్తిగా ఎన్నికల ప్రచార సభలను తలపించడం, అక్కడి ఎమ్మెల్యేలను, ఇన్‌చార్జులనే ఈ సారి గెలిపించాలని పిలుపు ఇవ్వడం వంటి వాటితో ఒక విధంగా ప్రచారం మొదలు పెట్టారని అంటున్నారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలను ఆత్మరక్షణలోకి నెట్టేసేలా విమర్శలనూ గుప్పిస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారమే ఉమ్మడి నల్లగొండపై పట్టు పెంచుకునేందుకు టీఆర్‌ఎస్‌ వేగంగానే ఎత్తులు వేస్తోందని విధితమవుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top