ఆధారాలుంటే బయటపెట్టండి 

KTR Fires On TPCC Chief Uttam Kumar Reddy And Congress - Sakshi

ఉత్తమ్‌! నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు 

నువ్వు నోట్ల కట్టలతోదొరక లేదా?: మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ అంటేనే కమీషన్లకు,కక్కుర్తికి మారుపేరు..

లాలూచీ కోసమే బాబుతో కలసి ‘అవిశ్వాసం’ డ్రామా అన్న మంత్రి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ :  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని ఉత్తమ్‌కు సూచించారు. ఆయన గతంలో నోట్ల కట్టలతో దొరికింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని తాము అనొచ్చా అని నిలదీశారు. పాతాళంలో బొగ్గు మొదలుకుని ఆకాశంలో తిరిగే విమానాల దాకా కాంగ్రెస్‌ నేతలు దేన్నీ వదలకుండా అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అసలు కాంగ్రెస్‌ అంటేనే కమీషన్లు, కక్కుర్తి అంటూ నిప్పులు చెరిగారు. తన సొంత నియోజకవర్గమైన అమేథీలో మున్సిపాలిటీని కూడా గెలిపించుకోలేని రాహుల్‌ తెలంగాణకు వచ్చి చేసేదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. బుధవారం నిజామాబాద్‌లో ఐటీ æహబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో కేటీఆర్‌ ప్రత్యేకంగా ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎడ్లబండి వంటిదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతోనే ఇలాంటి అర్థం లేని విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో లాలూచీ కోసమే ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల పార్లమెంటులో అవిశ్వాసం డ్రామా ఆడారంటూ నిప్పులు చెరిగారు. బాబు వంటి చిల్లర రాజకీయాలు తాము చేయలేమన్నారు. అమరావతికి, ఢిల్లీకి దాసులుగానే కొనసాగుతారా అన్నది రాష్ట్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు తేల్చుకోవాలన్నారు.  
 

మూణ్నెల్లు అటూ ఇటూగా ఎన్నికలు 
ఎన్నికలు మూడు నెలలు అటూ ఇటుగా రావచ్చని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌కు బదులుగా ఏ జనవరిలోనో, ఫిబ్రవరిలోనో వచ్చినా అది ముందస్తు కాదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఇంకా ఉనికిలోనే ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్‌ నేతల కుర్చీల కిందకు నీళుŠల్‌ వస్తాయని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై 186 కేసులు వేసి కూడా కోర్టుల్లో ఏమీ నిరూపించలేకపోయారన్నారు. ‘‘ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ కనీసం 20 ఎంపీ సీట్లు గెలవలేకపోయింది. ఉత్తమ్, కోదండరాం ఏమైనా శిక్షలు విధించేవాళ్లా? కావేరీ జలాల విషయమై కర్ణాటక, తమిళనాడుల్లో పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే తెలంగాణలో మాత్రం విపక్షాలు కలిసి రావడం లేదు’’అని అన్నారు. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఉత్తమ్, జానారెడ్డి మినహా మిగతా కాంగ్రెస్‌ నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్‌ చెప్పారు. 

‘బిల్ట్‌’పై శుభవార్త 
వరంగల్‌ జిల్లాలోని బిల్ట్‌ ఫ్యాక్టరీ విషయంలో త్వరలోనే శుభవార్త వినిపిస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. నిజాం చక్కెర కర్మాగారం పునఃప్రారంభంపై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. రైతులంతా కార్పొరేషన్‌గా ఏర్పాటై వస్తే దాన్ని ప్రారంభించేందుకు సిద్ధమని సీఎం ప్రకటించారని పేర్కొన్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లునూ త్వరలో తిరిగి ప్రారంభించబోతున్నామన్నారు. 

సెటిలర్లు అందరూ తెలంగాణ వాసులే.. 
తెలంగాణలో స్థిరపడ్డ వారందరూ తెలంగాణవాసులేనని కేటీఆర్‌ అన్నారు. ఇక్కడి ప్రజలకు జవాబుదారీగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ‘‘ఏ పని చేయాలన్నా ఢిల్లీలోని అధిష్టానం వైపు చూసే కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్‌ నేతలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ హక్కుల విషయంలో జాతీయ స్థాయిలో పోరాడాలని సూచించారు. రాష్ట్ర శ్రేయస్సు, హక్కుల సాధనలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top