సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా..?

KTR Fires On Mahakutami - Sakshi

సింహం లాంటి సీఎం కావాలా తేల్చుకోండి

మహాకూటమి అధికారంలోకి వస్తే.. నెలన్నరకో సీఎం

60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేసింది శూన్యం

కేసీఆర్‌ దెబ్బకు చంద్రబాబు అమరావతి కరకట్టకు పారిపోయాడు

ఎక్సైజ్‌ నుంచి గీతన్నలను మినహాయించే విషయాన్ని పరిశీలిస్తాం: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి సీఎం కావాలో తేల్చుకోవాల్సిన సమయమొచ్చిందని, సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలో.. సింహం లాంటి సీఎం కావాలో తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో జగిత్యాల అసెంబ్లీ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో చంద్రశేఖర్‌గౌడ్, ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాకూటమిపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. డిసెంబర్‌ 11న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి రిటైర్‌మెంట్‌ ఇచ్చి పంపేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు 130 ఏళ్ల ముసలి నక్క కాంగ్రెస్, 40 ఏళ్ల గుంట నక్క టీడీపీ చేతులు కలిపాయని ధ్వజమెత్తారు. 67 ఏళ్లలో ఈ రెండు పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని ఆరోపించారు. కేసీఆర్‌ దెబ్బకు అమరావతికి పారిపోయిన చంద్రబాబు.. అక్కడ నుంచి కుట్రలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు.  

ఫిడేల్‌ వాయించుకోవాల్సిందే..
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని అదే పార్టీతో కలిసి ఎన్టీఆర్‌ను చంద్రబాబు రెండోసారి వెన్నుపోటు పొడిచాడని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఒక్కటైన రాహుల్, చంద్రబాబులు ఎన్నికల తర్వాత ఫిడేల్‌ వాయించుకోవాలని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి సామాన్యుడే స్టార్‌ క్యాంపెయినర్లని చెప్పాడు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దేనని కితాబిచ్చారు. సమైక్య పాలనలో నాశనమైన కుల వృత్తులకు కేసీఆర్‌ జీవం పోశారని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన గత పాలకులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో చావు ఇంట్లో ఉన్నా, పెళ్లి పందిట్లో ఉన్నా.. కరెంటు వస్తే లేచి పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లేవారని గుర్తు చేశారు. నేడు 24 గంటల కరెంటుతో ఆ బాధలు తీరాయని చెప్పారు. 120 టీఎంసీల ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయినా, ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులు అడ్డుకోలేని చేతగాని పార్టీలు టీడీపీ, కాంగ్రెస్‌లని విమర్శించారు.

రూ.2 వేల కోట్లతో మేడిగడ్డ నుంచి ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోసే బృహత్తర కార్యక్రమాన్ని తాము చేపట్టామన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి జగిత్యాలకు చేసిందేమీ లేదన్నారు. కనీసం మున్సిపాలిటీకి నిధులు కూడా తీసుకురాలేదని విమర్శించారు. బోర్నపల్లి బ్రిడ్జి కూడా తాము అధికారంలోకి వచ్చేదాకా పూర్తికాలేదన్నారు. ప్రతీ ఎన్నికల సమయంలో ఇదే ఆఖరు ఎన్నిక అంటూ ఓట్లడుగుతున్న జీవన్‌రెడ్డిని ఈ సారి చిత్తుగా ఒడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. గౌడ కులస్తులు కోరినట్లుగా అందరికీ పింఛన్‌ను రూ.2,016 వచ్చేలా చేస్తామన్నారు. గౌడలను ఎక్సైజ్‌ నుంచి మినహాయించాలన్న డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. పొరపాటునో, గ్రహపాటునో మహాకూటమి అధికారంలోకి వస్తే..కాంగ్రెస్‌లో నెలన్నరకు ఒకరు సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తారని, ఎందుకంటే.. ఆ పార్టీలో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని విమర్శించారు.

అబద్ధాలాడటం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది: కవిత
అబద్ధాలు చెప్పి ఓట్లు అడగడం కాంగ్రెస్‌కు అలవాటేనని, ఆ నైజం వారి డీఎన్‌ఏలోనే ఉందని ఎంపీ కవిత అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఇదే నా చివరి ఎన్నిక అంటూ ఓట్లేయించుకునే జీవన్‌రెడ్డిని ఈసారి ఇంటికి పంపాలన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి రాగానే 40 ఏళ్ల కలను సాకారం చేశారని గుర్తుచేశారు. బోర్నపల్లి బ్రిడ్జిని కడతామంటూ మూడు సార్లు గెలిచారని గుర్తుచేశారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top