తోడుదొంగలు ఒక్కటవుతున్నారు!

KTR Fires on Congress party and TDP alliances  - Sakshi

     బీజేపీ నేతల చేరిక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ 

     కాంగ్రెస్‌ నేతలకు ఓటమి భయం 

     కేసులేసి ప్రాజెక్టులను అడ్డుకునే యత్నం 

సాక్షి, హైదరాబాద్‌: విపక్షాలపై మంత్రి కె.తారకరామారావు విరుచుకుపడ్డారు. తోడుదొంగలు ఒక్కటయ్యారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణను దోచుకున్న కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికల కోసం ఒక్కటవుతున్నాయన్నారు. ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్‌ నేతలు వణుకుతున్నారని వ్యాఖ్యానించారు. తరుముకొస్తున్న ఎన్నికలను చూసి కాంగ్రెస్‌ భయపడుతోందన్నారు. అడుగడునా తెలంగాణ ప్రగతిని ఆపుతున్న ప్రతిపక్షాలు కావాలో... అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వం కావాలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేల్చుతారని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రైతుబంధు ముఖ్యమంత్రి ఒకవైపు, బషీర్‌బాగ్‌. ముదిగొండలలో రైతులను కాల్చి చంపిన రాబందుల లాంటి ప్రతిపక్షాలు మరోవైపు ఉన్నాయని పేర్కొన్నారు. కరెంటు కోతల కాంగ్రెస్‌ ఒకవైపు... 24 గంటలు కరెంటు ఇచ్చే టీఆర్‌ఎస్‌ మరోవైపు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు రావాలని సీఎం కేసీఆర్‌ శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తుండగా, కాళేశ్వరం ప్రాజెక్టులను ఆపేందుకు కాంగ్రెస్‌ 186 అక్రమ కేసులను వేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు కలసికట్టుగా ఉద్యమాలు చేస్తున్న రోజుల్లో అప్పటి ప్రభుత్వంలో కాంగ్రెస్‌ నేతలు పదవులు అనుభవించారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని ఆపుతున్నందుకే ప్రజల తీర్పు కోరుతున్నామని చెప్పారు. దీని కోసం ఉన్న అధికారాన్ని సైతం వదులుకొని ప్రజల ముందుకు వెళ్తున్నామని మంత్రి అన్నారు. లేనివారి పేర్లతో, చివరికి చనిపోయిన వ్యక్తుల పేరుతోనే కాంగ్రెస్‌ పార్టీ కేసులు వేసి తెలంగాణ ప్రజల జీవ ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేసిందని విమర్శించారు.

మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీళ్లు వస్తే ప్రతిపక్షాల కాళ్ల కిందకి నీళ్లు వస్తాయనే విషయం వారికి తెలుసని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న నాలుగేళ్లు ఎలాంటి వివక్ష లేకుండా ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులున్న చోట కూడా నిధులు సమానంగా ఇచ్చామని, కాంగ్రెస్‌ హయాంలో తమకు నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏఅంశాలు లేకపోవడంతో తమ కుటుంబాన్ని విమర్శించే స్థాయికి కాంగ్రెస్‌ దిగజారిందన్నారు. దొంగ పనులు చేయడంలో కాంగ్రెస్‌ నేతలను మించినవారు లేరని విమర్శించారు. గత ఎన్నికల్లో సొంత కారులోనే రూ.రెండున్నర కోట్లను తగలబెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ వారిదని, ఇప్పుడు వారు నీతులు చెప్పుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని విమర్శించారు. సంగారెడ్డిలో నీచమైన పనులు చేసి... భార్య పిల్లల పేరుతో వేరేవాళ్లను విదేశాలకు అక్రమ రవాణా చేసిన వారిని కాంగ్రెస్‌ సమర్థిస్తోందన్నారు. సంగారెడ్డిలో సభ పెట్టిన వారు తమ సభ్యుడు తప్పు చేయలేదని  ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఉందని అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్‌ మళ్లీ గెలిపించుకుంటే సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేస్తానని కేటీఆర్‌ అన్నారు. ఈ చేరికలతో కామారెడ్డిలో బీజేపీ బలహీనపడింది. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితే కామారెడ్డికి గోదావరి నీళ్లు వస్తాయన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top