ఫార్మా సిటీకి కల్వకుర్తి ఎమ్మెల్యే అడ్డు 

KTR fires on congress leaders - Sakshi

కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద పెద్ద నాయకులు కల్వకుర్తి నుంచి ఢిల్లీకి వెళ్లినా సొంత ఊరుకు చేసిందేమీ లేదని, పాలమూరు పచ్చబడే దాకా టీఆర్‌ఎస్‌ వెనకడుగు వేయదని ఐటీ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఫార్మా సిటీకి కల్వకుర్తి ఎమ్మెల్యే అడ్డం పడుతున్నాడని, ఎమ్మెల్యే వంశీచంద్‌ ప్రగతి నిరోధకుడిగా మారాడని విమర్శించారు. ఏమి చేయనోళ్లు మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ ముందుకొస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కల్వకుర్తి నగర పంచాయతీ చైర్మన్‌ శ్రీశైలం తన అనుచరులతో మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి కేటీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కల్వకుర్తి ప్రజలు రాజకీయ చైతన్యానికి ప్రతీక అని, ఎన్టీ రామారావు వంటి నేతను ఓడించి రాజకీయ చైతన్యాన్ని రగిలించిందని గుర్తుచేశారు. పాలమూరు అంటేనే వలస జిల్లా అంటారని, అలా కాకుండా సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా మొత్తం సగటున లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. రెండేళ్లలో కల్వకుర్తి మొత్తం సాగునీరు ఇస్తామని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు దక్కుతాయో లేదో చూసుకోవాలని మంత్రి జూపల్లి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్, టీడీపీకి చెందిన ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాఘవేంద్రశర్మ, పాండుయాదవ్, శ్యామ్, రాఘవరావు, చంద్ర మోహన్, కల్యాణి భాయ్, అశోక్‌ చారి, శ్రీనివాస్‌ చారి, బాల్‌ సాయిలు ఉన్నారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top