కాంగ్రెసోళ్ల కళ్లు ఎర్రబడుతున్నయ్‌!

Ktr fires on congress - Sakshi

రాష్ట్రం పచ్చబడుతుంటే ఓర్వలేకపోతున్నారు

తెలంగాణపై విషం చిమ్మే బాబుతో కలసి కాంగ్రెస్‌ నేతల కుట్రలు

కల్వకుర్తి సభలో మంత్రి కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కృష్ణా, గోదావరి జలాలతో రాష్ట్రం పచ్చబడుతుంటే.. ఓర్వలేక కాంగ్రెసోళ్ల కళ్లు ఎర్రబడుతున్నాయని మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. తెలంగాణపై విషం చిమ్మే చంద్రబాబుతో కలసి కాంగ్రెస్‌ పార్టీ కొత్త కుట్రలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రజల తలరా త మార్చబోయే ఈ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఆలోచన చేసి, విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రజల భవి ష్యత్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. గురువారం మంత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్న జైపాల్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఆలోచించాల్సిన తరుణమిదే..
కాంగ్రెస్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని ఆనా డు ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే.. నేడు చంద్రబాబు అదే పార్టీతో చేతులు కలుపుతున్నారు. ప్రజలు ఆలోచిం చాల్సిన తరుణం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉంటే ఆ రెండు పార్టీలు ఒక్కటైనా ఏం ఫర్వాలేదు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుం టున్న కాంగ్రెస్, చంద్రబాబు ఒక్కటై కూటమిగా వస్తున్నందున వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.

ఆత్మగౌరవం నిలబెడుతున్నాం..
సీఎం కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారే కానీ ఏ ఒక్కరికీ తాకట్టు పెట్టలేదు. పేదలకు రేషన్‌ బియ్యం, హాస్టళ్లలో సన్నబియ్యం, పింఛన్లను రూ.వెయ్యికి పెంచడం, కల్యాణలక్ష్మి.. ఇలా చెప్పుకుంటే ఎన్నో కార్యక్రమాల ద్వారా కేసీఆర్‌ పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారు.

వెల్దండ మండలానికి చెందిన గౌసియాబేగం షాదీముబారక్‌ ద్వారా తనకు కలిగిన లబ్ధిని చీటీ రూపంలో పంపించింది. మరోసారి టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తే.. ఆసరా పింఛన్లను రూ.2,016కు, వికలాంగుల పింఛన్లు రూ.3,016కు పెంచుతాం. వచ్చే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిరుద్యోగులకు రూ.3,016 భృతి కల్పిస్తాం. వచ్చే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తాం.

సభకు హాజరైన ఎమ్మెల్సీ కసిరెడ్డి
కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్‌ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉం టున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వెనక్కి తగ్గారు. ఆయనతో కేటీఆర్‌ పలు దఫాలుగా చర్చలు జరపడం, కేసీఆర్‌ కూడా ఫోన్‌లో మాట్లాడటంతో మెత్తబడినట్లు సమాచారం. కసిరెడ్డి కోసం అక్టోబర్‌ 14న నిర్వహించాల్సిన కేటీఆర్‌ సభ కూడా వాయిదా వేశారు. గురువారం ఏర్పాటుచేసిన సభకు రావాల్సిందేనంటూ కసిరెడ్డిపై పార్టీ వర్గాలు ఒత్తిడి తీసుకొ చ్చాయి. దీంతో కసిరెడ్డి సభకు హాజరై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ ప్రకటించారు.

కేటీఆర్‌కు గొంతు నొప్పి..
వరుస సభలు, సమావేశాలతో కేటీఆర్‌ గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కల్వకుర్తిలో నిర్వహించిన సభలో గొంతు నొప్పి కారణంగా సరిగా మాట్లాడలేకపోయారు. నిత్యం సభల్లో మాట్లాడుతుండటం వల్ల గొంతునొప్పి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కల్వకుర్తి సభలో ఆయన కేవలం 14 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఈ సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బండారు భాస్కర్, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, షాద్‌నగర్, అచ్చంపేట అభ్యర్థులు అంజయ్యయాదవ్, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top