అడ్డం పడిన గడ్డాలు ఒక్కటవుతున్నాయి

KTR fires on Chandrababu and Uttamkumar Reddy - Sakshi

     ఉత్తమ్, చంద్రబాబులపై మంత్రి కేటీఆర్‌ మండిపాటు  

     కాంగ్రెస్, టీడీపీ పొత్తు నీచం.. 

     టీడీపీని బాబు కాంగ్రెస్‌ తోకపార్టీగా మార్చారని ఎద్దేవా 

     తెలంగాణను తెలంగాణవాళ్లే పాలించాలి.. జయశంకర్‌సార్‌ చెప్పిందిదే 

     కె.ఆర్‌.సురేశ్‌రెడ్డికి గులాబీ కండువా కప్పిన కేసీఆర్‌ 

     కేటీఆర్‌ సమక్షంలో పలువురు ఇతర నేతలు టీఆర్‌ఎస్‌లో చేరిక

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు అంశంపై ఆపద్ధర్మ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. తెలంగాణకు అడ్డం పడిన రెండు గడ్డాలు ఒక్కటవుతున్నాయని.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తమ్, చంద్రబాబు తెలంగాణలో ఒక్కటవుతున్నారని.. ఇది అపవిత్ర కలయిక అని అన్నారు. కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు దివంగత ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన టీడీపీని చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్‌కు తోక పార్టీగా మార్చారని ధ్వజమెత్తారు.

ఈ ఘనత చంద్రబాబు, ఎల్‌.రమణకు దక్కిందని విమర్శించారు. జుగుప్సాకరమైన, అపవిత్రమైన, నీచమైన కలయికతో రాజకీయంగా వారికి ఏం ఒరుగుతుందో తెలియదుగానీ ప్రజలకు ఓ ప్రత్యామ్నాయం ఎంచుకొనేందుకు సువర్ణావకాశం వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌ నేత, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఉప్పల్‌ కాంగ్రెస్‌ నేత బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్‌ సాయిజన్‌ శాంతిశేఖర్, కరీంనగర్‌ కాంగ్రెస్‌ నేత ఆకారపు భాస్కర్‌రెడ్డి తదితరులు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరి అనుచరులు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు.

రైతుబంధు కావాలా?రాబందులు కావాలా?..  
తెలంగాణను 50 ఏళ్లు కాంగ్రెస్, 17 ఏళ్లు టీడీపీ, నాలుగేళ్లు టీఆర్‌ఎస్‌ పాలించిందని.. రైతులను రాబందుల్లా పీక్కుతిన్నవారు కావాలా? రైతుబంధువై అన్నదాతల మనసు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకునే సమయం వచ్చిందని కేటీఆర్‌ అన్నారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చంద్రబాబు, ముదిగొండలో కాల్పులు జరిపిన కాంగ్రెస్‌ ఒక్కటవుతున్నాయని మండిపడ్డారు. వారు రైతులపై కాల్పులు జరిపితే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బంధు వంటి పథకాలతో వారికి అండగా నిలిచిందని అన్నారు. దశాబ్దాల పాటు పాలించినా కరెంటు ఇవ్వకుండా కోతలతో సతాయించి రాష్ట్రాన్ని దౌర్భాగ్యంలోకి నెట్టిన వారు ఒకవైపు.. 24 గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రైతు బంధు ప్రభుత్వం మరోవైపు ఉందని చెప్పారు. అపవిత్ర కలయికతో జతకట్టిన ఆ రెండు పార్టీలను దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందని అన్నారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణను తెలంగాణ వాళ్లే పరిపాలిస్తే న్యాయం జరుగుందని జయశంకర్‌సార్‌ చెప్పారని, ఇదే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఆ రెండు పార్టీల కూటమికి ఓటు వేస్తే ప్రతి విషయానికి ఇటు ఢిల్లీ, అటు అమరావతి వైపు చూడాల్సి వస్తుందని అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకు గడ్డం తీయబోనని ఉత్తమ్‌కుమార్‌ అంటున్నారనీ.. ఆయన గడ్డం తీయకపోతే ఎవరికీ నష్టంలేదని అన్నారు. గడ్డం పెంచుకున్నవాళ్లంతా గబ్బర్‌సింగ్‌ కాలేరని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారులను ఆరు నెలల తర్వాత నిర్వహించాలని కోరిందని.. దీనితోనే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలకు అర్థమైందని కేటీఆర్‌ అన్నారు.

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టపడదని, ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలు రావాలని కోరుకుంటాయని.. కానీ తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిజామాబాద్‌ జైలులో ఉన్న దాశరథి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాశారని.. కేసీఆర్‌ ఇప్పుడు తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అనే లక్ష్యంతో పని చేస్తున్నారని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లాలోని రైతుల కలలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. నాలుగేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరో కార్పొరేటర్‌ చేరికతో వంద సీట్లు సాధించామని చెప్పారు. 

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: సురేశ్‌రెడ్డి 
కేసీఆర్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి అన్నారు. 1989 నుంచి సీఎం కేసీఆర్‌ తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ వచ్చిందని, సాగునీటి ప్రాజెక్టులతో ప్రతీ ఎకరానికి నీరు అందించేందుకు  కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌ ప్రపంచస్థాయి నగరంగా మారిందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ పనితీరుతో తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని అన్నారు. మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, షకీల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top