ఆ పార్టీలకు ప్రజలే చార్జిషీట్‌ వేస్తారు

KTR Fires On BJP And Congress - Sakshi

మీడియాతో చిట్‌చాట్‌లో బీజేపీ, కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

ఎంఐఎంతో పొత్తు లేదు.. కావాలనే దుష్ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల్లో మత, జాతీయ రాజకీయాలు పనిచేయవు

ప్రచారం కోసం ప్రకటనలు చేస్తున్న పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉండటం లేదు

రాష్ట్రానికి కేంద్రం చేసింది గుండు సున్నా: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌    

సాక్షి, హైదరాబాద్‌ : దశాబ్దాలుగా అధికారంలో ఉండి పట్టణాల అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయనందుకు ప్రజలు కాంగ్రెస్, బీజేపీపై చార్జిషీట్‌ వేస్తారని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత ఐదేళ్లలో అభివృద్ధి చేసిన తమపై చార్జిషీట్‌ అంటూ బీజేపీ చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు. కేవలం ప్రచారం కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం కాకుండా.. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులు నిలుపలేని తమ పార్టీ బలహీనతపై దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు సూచించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మిగతా ఎన్నికల తరహాలోనే ఎంఐఎంతో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ తమకు పొత్తు లేదని, ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట టీఆర్‌ఎస్‌ కూడా పోటీ చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తమకు ప్రత్యర్థే అన్నారు.

ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ పొత్తుపెట్టుకుందని కావాలనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. భైంసా మున్సిపాలిటీలోని 3 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవం కావడం స్థానిక కారణాలతో జరిగిందన్నారు. ఐదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనపై చార్జీషీట్‌ వేస్తే.. 60 ఏళ్లుగా అధికారంలో ఉండి పట్టణాల అభివృద్ధికి ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్, బీజేపీపై ఎన్ని చార్జిషీట్లు వేయాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయిన బీజేపీపైనే చార్జిషీట్‌ వేయాలన్నారు. ఏ నగరాన్ని స్మార్ట్‌సిటీగా మార్చారు? ఏ ‘అమృత్‌’పట్టణంలో అమృతం పారుతుందో చెప్పాలని లక్ష్మణ్‌ను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు అపార నమ్మకం ఉందని, ఈ నమ్మకం ప్రతి ఎన్నికల్లోనూ తేలుతూ వస్తోందన్నారు. 

ఆ పార్టీలకు అభ్యర్థులు కరువు...
కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారని, టీఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్థులకు ప్రచారం చేసే దుస్థితిలో ఉన్నా యన్నారు. బీ–ఫారంతో పాటు ఎన్నికల ఖర్చు సైతం ఇస్తామని ఈ పార్టీలు చేసిన ఆఫర్లను పలువురు తిరస్క రించార న్నారు. జాతీయ స్థాయిలో బద్ధశత్రువులుగా డ్రామాలు చేసే కాం గ్రెస్, బీజేపీ ఇక్కడ అనైతికంగా లోపాయికారీ పొత్తులు పెట్టుకున్నాయన్నారు. పట్టణాలకు నిధులిచ్చామంటూ బీజేపీ అబద్ధాలు చెబుతోందన్నారు. రాష్ట్రానికి చట్ట ప్రకా రం దక్కాల్సిన నిధులకన్నా, ఇతర రాష్ట్రాల కన్నా అదనం గా ఒక్క రూపాయి అయినా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని పట్టణాలకు కేంద్రం నుంచి తెచ్చిన ప్రత్యేక నిధుల వివరాలను ప్రజల ముందు పెట్టా లన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసింది గుండు సున్నా అన్నా రు. రాష్ట్రంలో కట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల తరహాలో, అంత ఖర్చుతో దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్క డైనా కట్టారో చెప్పాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ఒకవేళ ఆయనకు సమాచారం లేకుంటే, ప్రభుత్వం కడుతున్న ఇళ్లను చూసేందుకు కొల్లూరు వస్తే ఎర్ర తివాచీ పరిచి నిర్మాణాలు చూపిస్తామన్నారు. 

విజన్‌ డాక్యుమెంట్‌ డొల్ల..
కాంగ్రెస్‌ ప్రకటించిన విజన్‌ డాక్యుమెంట్‌ క్షేత్రస్థాయిలోని పరిస్థితులతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లో కూర్చుండి రూపొందించిన డొల్ల పత్రమని కేటీఆర్‌ విమర్శించారు. అందులో విజన్‌ ఏమాత్రం లేదన్నారు. ఇప్పటికే తాము అమలు చేస్తున్న రూ.5 భోజనం, సింగిల్‌ విండో అనుమతుల విధానాన్ని ఈ పత్రంలో పొందుప ర్చడం హాస్యాస్పదం అన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న కార్యక్రమాలను అమలు చేస్తామని హామీలుగా ఇవ్వడం విజన్‌ డాక్యుమెంట్‌ విలువను తెలియజేస్తోందన్నారు. అధికారంలోకి వస్తే హమీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్‌కి ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవన్న అవగాహన కూడా లేదన్నారు. కనీసం మరో నాలుగేళ్లపాటు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేని పార్టీ హామీల అమలు ఎలా చేస్తుందో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పాలన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు విజన్‌ డాక్యుమెంట్‌తో మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో చెత్త మున్సిపాలిటీలుంటే.. టీఆర్‌ఎస్‌ పాలనలో కొత్త మున్సిపాలిటీలు వచ్చాయన్నారు. 

త్వరలో టీఎస్‌–బీపాస్‌...
టీఎస్‌ఐపాస్‌ తరహాలో పట్టణ ప్రాంతాల్లో భవనాలు, లే అవుట్లకు సత్వర అనుమతుల కోసం టీఎస్‌–బీపాస్‌ను త్వరలో తీసుకొస్తున్నామన్నారు. పల్లె ప్రగతికి దీటుగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వచ్చే ఏడాదిలోగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామన్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం తరుముతోందని, ఆర్థిక భారం పడే అంశాలను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. తాము చేసిన అభివృద్ధి ఆధారంగానే ఓట్లు అడుగుతున్నామని, ప్రజలు తాము చేసిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం కల్పిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు దక్కనివారి నుంచి సహజంగానే అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. ఇలాంటి సమస్యలను పార్టీ పరిష్కరించుకుం టుందన్నారు. సుమారు 3,100 టికెట్లు ఇస్తే ఎన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తం అయిందో చూడాలన్నారు. టికెట్ల కేటాయింపుపై వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గెలుపు కోసమే ఐక్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని తెలిపారు.

అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
జీహెచ్‌ఎంసీని విభజించాలని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ చాలా పెద్దదిగా ఉండటంతో పాలన పరమైన సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయ పడ్డారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయ మేనని, ప్రభుత్వంతో సంబంధం లేదన్నారు. శివారు మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయ వచ్చు కదా అని విలేకరులు అడిగితే.. ఇంత పెద్ద జీహెచ్‌ఎంసీని నిర్వహించడం ఇప్పుడే కష్ట మవుతోందని, అలా చేస్తే జీహెచ్‌ఎంసీని విభజన జరపాలని తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పా నన్నారు. అయితే కొన్ని ఆంగ్ల పత్రికలు ఇది ప్రభుత్వ ఆలోచనగా రాసాయన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top