అమలు కాని హామీలు

Ktr fired on uttam kumar reddy - Sakshi

ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు..

కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

కర్ణాటకలో రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదెందుకు?

టీటీడీపీ నేతలు అమరావతిలో మోకరిల్లుతున్నారని ఎద్దేవా

నిజామాబాద్‌లో బహిరంగ సభ.. ఐటీ హబ్‌కు శంకుస్థాపన

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: అమలుకు వీలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్‌ పార్టీపై ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని హామీ ఇస్తున్న కాంగ్రెస్‌.. కర్ణాటకలో నాలుగు విడతల్లో ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తామనే హామీపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు.

‘‘గడ్డం పెంచుకున్న వాళ్లంతా గబ్బర్‌సింగ్‌లు కాలేరు. పెంచుకుని పెంచుకుని సన్నాసుల్లో కలిసిపోతారు తప్ప మనకు పోయేదేమీ లేదు’’అని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ నగరంలో రూ.50 కోట్లతో నిర్మించతలపెట్టిన ఐటీ హబ్‌ భవన నిర్మాణ పనులకు కేటీఆర్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పాలిటెక్నిక్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్‌గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్‌ గాంధీ.. ఇలా ఐదున్నర దశాబ్దాలపాటు అధికారంలోనే ఉన్నారని, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇన్నాళ్లూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా గుడ్డి గుర్రం పళ్లు తోమారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో అందరూ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటే.. కాంగ్రెస్‌ నేతలు మాత్రం పదవులు పట్టుకుని వేళ్లాడారని గుర్తు చేశారు. అమరావతి వెళ్లి చంద్రబాబు వద్ద మోకరిల్లుతున్నారంటూ టీటీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. తమ పార్టీకి అధిష్టానం ఢిల్లీలోనో, అమరావతిలోనో లేదని, ప్రజలే తమకు బాస్‌లని పేర్కొన్నారు.

రూ.లక్ష కోట్లకు ఐటీ ఎగుమతులు: నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం నుంచి ఐటీ సేవల ఎగుమతులు రూ.56 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెరిగాయని కేటీఆర్‌ తెలిపారు. మెట్రోపాలిటన్‌ నగరాలకే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంద న్నారు. ఐటీ కంపెనీల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.

టీఎస్‌పీఎస్సీ, సింగరేణి, పోలీసు వంటి సంస్థల ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు 1.12 లక్షల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. ప్రపంచంలో ఏ ప్రభు త్వం కూడా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వదని వ్యాఖ్యానించారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఐదు లక్షల నూతన ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు.

భవిష్యత్‌ తరాల కోసం పని చేస్తున్నాం: కవిత
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేయడం లేదని, భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని బాటలు వేస్తున్నామని ఎంపీ కవిత పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగా నిజామాబాద్‌ నగరంలో ఐటీ హబ్‌ను నిర్మిస్తోందని వివరించారు.

నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో తమ సంస్థలను ఏర్పాటు చేస్తామని పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు అంగీకార పత్రాలను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మేయర్‌ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top