చౌకీదార్‌.. టేకేదార్‌ వద్దు.. దేశానికి కావాలి జిమ్మేదార్‌

KTR Exclusive Interview In Sakshi Over Lok Sabha Elections

కేసీఆర్‌ ఆలోచన.. దేశానికి ఆచరణ: కేటీఆర్‌

బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు

16 సీట్లు గెలిస్తే కేంద్రంలో టీఆర్‌ఎస్‌దే కీలకపాత్ర

మన శక్తిని ఇతరుల చేతుల్లో పెట్టి బతిమాలుకుందామా?

బీజేపీ, కాంగ్రెస్‌లు పెద్ద ప్రాంతీయ పార్టీలు మాత్రమే

జై కిసాన్‌ ఆ రెండు పార్టీల నినాదం.. కానీ అది మా విధానం

కేంద్రంలో కేసీఆర్‌ లాంటి నాయకుడుంటే తప్పేంటి?

భావసారూప్య పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ బలం సుమారు 140

కేంద్రాన్ని యాచించే పని ఉండదు.. శాసించే స్థితిలో ఉంటాం

పార్టీ ఫిరాయింపులను దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్సే

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌   

ఒకాయన నేను దేశానికి చౌకీదార్‌ను అంటరు. ఇంకొకాయన టేకేదార్‌ను అంటరు. మా ఫ్యామిలీ, మా పార్టీ, మా దేశం అనే స్థాయిలో టేకేదార్‌ను అంటరు. మేమేం అంటున్నమంటే.. ఒక దిల్‌దార్, దమ్‌దార్, అసర్‌దార్, జిమ్మేదార్‌ ప్రధానిగా ఉండాలి. ఈరోజు కేసీఆర్‌ వంటివారు ప్రధాని కావడంలో తప్పేంలేదు. నాయకత్వం వహించే సత్తా కేసీఆర్‌కు ఉంది. ఐఏఎన్‌ఎస్‌–సీఓటర్‌ సర్వేలో 80% మంది ప్రజలు దేశంలోనే ఉత్తమ సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే సీఎంకు 14వ స్థానం. మొదటిసారి సీఎం అయిన కేసీఆర్‌కు తొలిస్థానం దక్కింది. మాటలకు చేతలకు తేడా అది. ప్రజల జీవితాల్లో మార్పు తేగలిగే నాయకుడు రావాలి. ప్రజలు ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఒక నాయకుడు నేను చౌకీదార్‌ను అంటున్నడు. ఇంకో నాయకుడు టేకేదార్‌ను అంటున్నడు. చౌకీదార్, టోకేదార్‌లు కాదు.. ఈ దేశానికి కావాల్సింది దిల్‌దార్, దమ్‌దార్, అసర్‌దార్, జిమ్మేదార్‌ నాయకుడు కావాలి. ఇలాంటి లక్షణాలున్న కేసీఆర్‌ లాంటి ప్రాంతీయ పార్టీ నేతలు ప్రధానమంత్రి అయితే తప్పేంటి? యాచించి తెచ్చుకోవడం కాదు.. శాసించి తెచ్చుకునే స్థాయికి రాష్ట్రాలు రావాలి. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 16 సీట్లిస్తే వాటికి మరో 130, 140 సీట్లు తోడవుతయ్‌. అప్పుడు బలమైన కూటమి ఏర్పడుతది. ఎర్రకోటపై జెండా ఎవరు ఎగరేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తది’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. మన శక్తినంతా ఇతరుల చేతుల్లో పెట్టి వారిని బతిమిలాడుకునే కన్నా మన చేతుల్లోనే అధికారంలో ఉండేలా ముందుకెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు దేశంలో జాతీయ పార్టీలు లేనే లేవని, కాంగ్రెస్, బీజేపీలు పెద్దసైజు ప్రాంతీయ పార్టీలయితే, తమవి చిన్నసైజు ప్రాంతీయ పార్టీలని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 44 సీట్లున్న రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటే తప్పు లేదు గానీ, 16 సీట్లు వస్తే తాము కోరుకోవడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అసలు జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల్లోనే జాతీయ భావాలుంటాయని పేర్కొన్నారు.

పుల్వామా దాడి అమర జవాన్లకు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ ప్రకటించిన పరిహారమే నిదర్శనమని చెప్పారు. నరేంద్రమోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానిగా వ్యవహరించారని, రాష్ట్రం పట్ల వివక్ష చూపారని కేటీఆర్‌ ఆరోపించారు. జై కిసాన్‌ అనేది బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నినాదమైతే.. అది తమ పార్టీ విధానం అని తెలిపారు. ఆ విధానం నుంచే రైతుబంధు, రైతుబీమాలు అమల్లోకి వచ్చి దేశానికే స్ఫూర్తిదాయం అయ్యాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తమను ఇటుకతో కొట్టాలని చూస్తే.. రాయితో కొట్టే శక్తి తమకుందని, అసలు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఎందుకు వెళ్లిపోతున్నారో ఆత్మవిమర్శ చేసుకోకుండా తమ మీద ఏడుపు ఎందుకని ఎద్దేవా చేశారు. తమది కాంగ్రెస్‌ బీ–టీం అని బీజేపీ, బీజేపీ బీ–టీం అని కాంగ్రెస్‌ ఆరోపిస్తాయని, కానీ తమది తెలంగాణ ప్రజల ఏ–టీం అనేది వారు గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

 సందర్భం మారింది 
‘‘2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్పుడు బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. మా అంచనా ప్రకారం ఈసారి బీజేపీకి 150 సీట్లు మించవు. గత ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ 100 సీట్లు దాటదు. మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్, మాయావతి, నవీన్‌పట్నాయక్,  కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి.. వీళ్లందరి మధ్యనే 150 నుంచి 170 సీట్లు వచ్చే అవకాశముంది. ఇలాంటప్పుడు మనశక్తిని ఇంకొకరి చేతులో పెట్టి వారిని ఎందుకు పెద్దోళ్లను చేయాలి. వారి చేతిలో దేశ పగ్గాలు పెట్టి ఎందుకు పగ్గాలు ఇవ్వాలి. మనమే శాసించే పరిస్థితిలో ఉంటే తప్పేంటి. మన రాష్ట్రంలో మనం 16 సీట్లు గెలిస్తే కాంగ్రెస్, బీజేపీయేతర సమాఖ్య కూటమి ఏర్పడుతుంది. అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. ఆ లెక్కన ఆలోచించుకున్నప్పుడు గతంలో ఒక ఎంపీకి ఉండే ప్రాధాన్యత కంటే ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. అప్పుడు మన 16 ఎంపీ సీట్లతో ఢిల్లీలో కచ్చితంగా కీలకపాత్ర పోషించవచ్చు. మన హక్కులు సాధించవచ్చు.

రెండు జాతీయ పార్టీల కుట్రలను ప్రజలను ఆర్థం చేసుకోవాలి. మేం తప్ప ఎవరూ లేరనే ధోరణిలో ప్రత్యామ్నాయం లేదని వితండ వాదాలు, విన్యాసాలు చేస్తారు. ఇలాంటి వారు మనకువద్దు. ప్రాంతీయ పార్టీలో కేసీఆర్‌ వంటి బలమైన నాయకులు చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరో ఒకరిని ఎంచుకుని ముందుకుపోయే పరిస్థితి ఉంది.వీరంతా కలిస్తే.. బలమైన సమాఖ్య కూటమి తయారవుతుంది. ఈ దేశాన్ని శాసించే పరిస్థితి ఉంటుంది. ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగురవేయాలో ఆ కూటమి నిర్ణయించే పరిస్థితి వస్తుంది. టీఆర్‌ఎస్‌కు గతంలో 14 మంది ఉన్నారని.. ఇప్పుడు 16 వచ్చినా ఏంచేయగలరని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నరు. అప్పుడున్న 14 మందికి దేశాన్ని శాసించే పరిస్థితి లేదు. ఇప్పుడు 16 మందితోపాటు కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న విశ్వాసం లాగే.. ఇతర ప్రాంతీయ పార్టీలకూ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ 16 సీట్ల విలువ పెరుగుతుంది. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎందుకు అర్థమైతలేదో, అర్థమైనా కానట్లు ఉంటున్నారో తెలియడంలేదు. కీలెరిగి వాత పెట్టడం, అదను చూసి దెబ్బకొట్టడం, మోకా చూపి చైతన్యవంతమైన తీర్పు ఇవ్వడం తెలంగాణ ప్రజలకు తెలుసు. వారికి రాజకీయ చైతన్యం ఉంది. ఈసారి ప్రదర్శిస్తారు. 
 
కేంద్రం ఏమీ చేయలేదు 
యూపీఏ ప్రభుత్వం దిగిపోయేముందు హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను ప్రకటించింది. మనతోపాటు బెంగళూరుకు కూడా ఐటీఐఆర్‌ ప్రకటించారు. బెంగళూరులో అప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. అయినా అక్కడా, ఇక్కడ ఒక్క అడుగు ముందుకు పడలేదు. కేంద్రప్రభుత్వం నుంచి భారీగా నిధులు వస్తే అయ్యేది. ఇది కాకున్నా తెలంగాణలో ఐటీ వృద్ధి ఆగలేదు. దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. కేంద్రం ఐటీఐఆర్‌ చేస్తే ఇంకా బాగుండేది. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం తరహాలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులలో ఏ ఒక్కదానికి జాతీయ హోదా ఇచ్చినా 90% నిధులు అక్కడి నుంచి వచ్చేవి. ప్రాజెక్టులకు జాతీయహోదాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన పాల్గొన్న బహిరంగసభలో అడిగాం. జలవనరుల మంత్రిగా నితిన్‌గడ్కరీ ఉన్నప్పుడు కోరాం. ఉలుకులేదు, పలుకులేదు. గనుల మంత్రిగా బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్ర మంత్రులను కోరాను. సీఎం కేసీఆర్‌ అయితే మీరు కడతారా? లేక మేమే చేసుకోవాలా? అని అడిగారు. అయినా ఫలితంలేదు. మిషన్‌ భరీరథకు, మిషన్‌ కాకతీయకు కలిపి 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతిఅయోగ్‌ సిఫారసు చేస్తే 24 పైసలు ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినవే రాలేదు. నరేంద్రమోదీ ప్రభుత్వం, ఆయన వివక్ష, నిర్వాకం, వ్యవహారం.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రధాని అన్నట్లుగా వ్యవహరించారు. 
 
జాతీయ పార్టీలు లేవు 
జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్‌ వారు అంటున్నారు. నేడు దేశంలో జాతీయ పార్టీలు లేవు. పెద్దసైజు ప్రాంతీయ పార్టీలు, చిన్నసైజు ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఎవరినీ కించపరచడానికో, చులకన చేయడానికో ఈ మాటలు అనడంలేదు. దేశంలోని 29 రాష్ట్రాల్లో.. 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ దాదాపు కనుమరుగైన పరిస్థితి ఉంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రాలైన యూపీ, బిహార్‌లో కాంగ్రెస్‌ ఉనికిలేదు. బీజేపీ పరిస్థితి చూస్తే ఒక్క కర్ణాటకలో తప్పితే దక్షిణాదిలో సోదిలో లేదు. అలాంటప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలు ఎలా అవుతాయి. 
 

జాతీయ భావాలు టీఆర్‌ఎస్‌కు ఎక్కువ 
దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడితే తప్పేంలేదు. జాతీయ పార్టీలు అంటే.. జాతీయ భావాలు ఉండాలి, జాతి కోణంలో ఆలోచించాలి. జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలకే జాతీయ భావాలు ఎక్కువగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ను తీసుకుంటే పుల్వామా ఘటన జరిగింది. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పాకిస్తాన్‌లో చిక్కుకున్నారు. ఆ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ ఒక బాధ్యతగల రాజకీయ పార్టీగా అసెంబ్లీ వేదికగా పుల్వామా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ప్రకటించింది. దేశంలో ఇలా ప్రకటించిన ముఖ్యమంత్రి.. కేసీఆర్‌ ఒక్కరే. చనిపోయిన వారిలో ఒక్కరు తెలంగాణ వ్యక్తి లేరు. అయినా టీఆర్‌ఎస్‌ ముందుకు వచ్చింది. నిజంగా జాతీయభావాలుంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఇలాగే స్పందించాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్‌ వచ్చినప్పుడు స్పందించాం. తిత్లీ వచ్చినప్పుడు ఎన్నికల కోడ్‌ ఉంది. కేరళ తుఫాను అప్పుడు ఇలాగే స్పందించాం. జమ్మూకాశ్మీర్‌లో ఇబ్బంది వచ్చినప్పుడు ఇలాగే చేశాం. ప్రాంతీయ పార్టీలకు జాతీయ భావాలు ఉండవనుకోవడం అమాయకత్వం, తప్పు కూడా. కేసీఆర్‌ వంటి నాయకులు దేశంలో ఏ రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినా స్పందిస్తారు. పుల్వామా ఘటన తర్వాత రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలు నిలిపివేయలేదు. నరేంద్రమోదీ మరుసటి రోజు బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఖేలో ఇండియా యాప్‌ విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ మాత్రం వారం రోజులు కార్యక్రమాలను రద్దు చేసుకుంది. దేశంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజకీయ కార్యక్రమాలు సరికాదని అలా చేశాం. రాహుల్‌గాంధీ వెంటనే కేంద్ర ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టారు. అలాంటి సందర్భాల్లో దేశం యావత్తు కేంద్రంలోని ఏ ప్రభుత్వం ఉన్నా వారికి అండగా నిలబడాలి. ప్రపంచం ముందు ఐకమత్యం కనబడాలి. కానీ అలా జరగలేదు. 
 
జైకిసాన్‌ వారి నినాదం.. మా విధానం! 
జైకిసాన్‌ అనేది ఈ రోజు ఆ రెండు జాతీయ పార్టీల నినాదం. రెండు పార్టీల నేతలు ఆకుపచ్చ తలపాగా, కండువాలు కప్పుకున్న వారే. అయితే జైకిసాన్‌ అనేది మా పార్టీ విధానం. దీంట్లో నుంచే రైతుబంధు, రైతుబీమా వచ్చాయి. రైతుబంధు ఈరోజు దేశానికి ఆదర్శమైంది. దీంట్లో నుంచే నరేంద్రమోదీ.. పీఎం కిసాన్‌ అని పెట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అన్నదాత సుఖీభవ అని నకలు కొట్టారు. కేసీఆర్‌ ఆలోచన దేశానికి ఆచరణగా మారింది. సీఎంగా కేసీఆర్‌ పనితీరు దేశానికి ఆదర్శవంతమైన పథకాలను తెచ్చింది. ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య కూటమి తెచ్చుకోవడంలో తప్పేముంది. దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉంటే ఈ డెబ్బై ఏళ్లలో వాటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన ఏ జాతీయపార్టీ చేయలేదు. 70 ఏళ్లు దేశాన్ని నడిపింది జాతీయ పార్టీలే కదా? అన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయని ప్రధానమంత్రిగానీ, జాతీయపార్టీ నాయకుడుగానీ ఎవరైనా చెప్పారా? ఎలా వినియోగించుకోవాలో ఎవరైనా చర్చ జరిపారా? తాగునీరు, సాగునీరు అవసరాలను పట్టించుకున్నారా? దేశంలోని జలవనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించారా? కరువు, కాటకాలను ఎలా దూరం చేయవచ్చో ఆలోచించారా? రైతుల గురించి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేసేవారు కాదా? ఇంచు భూమిని కొత్తగా సేకరించకుండా రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నింపే ప్రయత్నం గతంలో ఎవరు చేయలేదు. 
 
రాఫెల్‌ వద్దు, బోఫోర్స్‌ వద్దు 
గత లోక్‌సభలో కాంగ్రెస్‌కు 44 స్థానాలు, టీఆర్‌ఎస్‌కు 14 సీట్లు ఉన్నాయి. 44 స్థానాలతో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉవ్విళ్లూరొచ్చు. ఇంకొకరికి ఆ అర్హత లేదా? పోటీ మోదీ వర్సెస్‌ రాహులేనా? అయితే బోఫోర్సు లేకుంటే రాఫెల్‌.. ఇంతేనా? అంటే ఈ దేశాన్ని తమ చుట్టే తిప్పుకోవాలనే నీతితో వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. జాతీయ పార్టీలుగా చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రాంతీయ శక్తులను దెబ్బతీయాలని చూస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాయి. కొన్ని రోజుల క్రితం వరకు మమతాబెనర్జీని పొగిడిన రాహుల్‌గాంధీ ఈరోజు మోదీ, దీదీ ఒక్కటే అన్నారు. మమతాబెనర్జీని నియంత అన్నారు. కాంగ్రెస్‌తో కలిసి రాకపోతే ఒక ముద్ర వేస్తారు. తెలంగాణకు వచ్చి టీఆర్‌ఎస్‌ను బీజేపీకి బీ–టీం అంటారు. అయితే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండాలే. లేకుంటే బీజేపీకి అనుకూలంగా ఉండాలే. ఇలా లేకుంటే దెబ్బతీయాలని చూస్తుంటాయి. దేశం వాళ్లిద్దరి మధ్యనే ఉండాలె. మేం మాత్రం రాఫెల్, బోఫోర్స్‌ కాకుండా అంతకుమించిన గుణాత్మకమార్పు తెచ్చే కూటమి రావాలని అంటున్నాం. ప్రత్యామ్నాయ కూటమి నిర్మాణం చేస్తాం. కూటమి అజెండా ఏం ఉండాలి. ఆర్థిక, సామాజిక, వ్యవసాయ విధానం ఎలా ఉండాలో ఆలోచన చేస్తున్నాం. 
 
ఐదేళ్లుగా ఎవరికీ ఇబ్బందిలేదు 
అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిలిన భారత నగరాల్లో హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు అగ్రస్థానంలో ఉంది. ప్రపంచస్థాయిలో పోల్చితే పోటీలో లేదనేది వాస్తమే అయినా దేశంలో మాత్రం ముంబై, ఢిల్లీ వంటి కంటే మనమే ముందున్నాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉండడం యాదృశ్చికమే అయినా.. వాస్తవం. ఇక్కడ ఉండే శాంతిభద్రతలు, వసతుల కల్పన వల్లే ఇది జరిగింది. అమెరికా కంపెనీలు బెంగళూరుకు బదులు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ అమెరికా కేథరిన్‌హడ్డా చెప్పారు. ఇలాంటి మాటలు ఊరికేరావు. దౌత్యఅధికారులు ఇలాంటి మాటలు చెప్పడం వెనుక చాలా నేపథ్యం ఉంటుంది. హైదరాబాద్‌లో ఐదేళ్లలో వచ్చిన మార్పు ఇది. ఒకప్పుడు తెలంగాణలో ఉమ్మడి పోలీసింగ్‌ ఉండాలన్న వారు.. ఆంధ్ర పోలీసుల వ్యవస్థపై నమ్మకంలేదు. ఇక్కడ విచారణ చేయాలని అంటున్నారు. చిగురుపాటి జయరామ్‌ హత్య జరిగితే ఎన్నారై అయిన ఆయన భార్య ఇక్కడ విచారణ చేయాలని అన్నారు. ఆంధ్రలో ఒక రాజకీయ నాయకుడు తెలంగాణలో ఆంధ్రవారిపై దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ఆంధ్రలో ఉండే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాలు, ఆస్తులు, ఫామ్‌హౌజ్‌లు ఇక్కడే ఉన్నాయి. చంద్రబాబు హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కట్టుకున్నారు. పవన్‌కళ్యాణ్‌ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఐదేళ్లలో ఏ ఒక్క ఇబ్బంది లేదు. అందరు ఇక్కడే ఉన్నారు. స్థిరమైన నిర్ణయాలు, నిర్ణయాత్మక ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన దక్షతతోనే ఇలా జరుగుతోంది. 
 
కేంద్రం నిధులతో రీజినల్‌ రింగ్‌ రోడ్డు 
హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎంత ఊపు ఇచ్చిందో రీజినల్‌ రింగ్‌ రోడ్డు అంతకంటే ఊపు తీసుకొస్తుంది. 16ఎంపీ సీట్లను మనం గెలచుకుంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రీజినల్‌ రింగ్‌ రోడ్డును నిర్మించుకోవచ్చు. కేంద్రంలో మనకు బలం ఉంటే మొత్తం 330 కిలోమీటర్లను జాతీయ రహదారిలో చేర్చితే మొత్తం నిధులను కేంద్రం నుంచే తెచ్చుకుని రోడ్డును పూర్తి చేసుకోవచ్చు. భూసేకరణతోపాటు అన్ని కేంద్రమే చేస్తుంది. 
 
బడితె ఉన్నోడితే బర్రె 
మమతాబెనర్జీ రైల్వే మంత్రిగా ఉంటే బెంగాల్‌కు అన్ని రైళ్లు వెళ్తాయి. లాలూప్రసాద్‌యాదవ్‌ ఈ శాఖ చేపడితే ఆయన అత్తగారి ఇంటి వరకు రైలు వెళ్తుంది. ఈరోజు బుల్లెట్‌ రైలు ఢిల్లీ నుంచి గుజరాత్‌ మీదుగా ముంబై వెళ్తుంది. మన హైదరాబాద్‌కు, దక్షిణాదివైపు ఎందుకురాదు? మోదీకి ఆసక్తి లేదు. హైస్పీడ్‌ రైల్వే నెట్‌వర్క్‌ అని వ్యవస్థ పెట్టారు. మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రతిపాదన పెడితే అందులో హైదరాబాద్‌కు, అమరావతికి స్థానం లేదు. దేశంలో మనం లేనట్లు మన ఉనికి గుర్తించకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యవహరం నడుపుతున్నాయి. మన చైతన్యాన్ని ప్రదర్శించకపోవడమే దీనికి కారణం. మన శక్తిని ఇంకొకరికి ధారపోసి తర్వాత యాచించడం ఎందుకు? జయశంకర్‌సార్‌ చెప్పినట్లు.. యాచించి కాదు.. శాసించి తెచ్చుకోవాలి. తెలంగాణ శక్తిని ఏకం చేసేందుకు చెప్పిన ఈ నినాదాన్నే ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లోనూ అమలు చేసేలా అమలు చేయాలి. 
 
కాంగ్రెస్‌ ఆత్మ విమర్శ చేసుకోవాలి 
కాంగ్రెస్‌ నేతల వ్యహారం ముఖం బాలేక అద్దం పగలగొట్టినట్లుంది. వాళ్ల పార్టీ నాయకత్వం సరిగా లేక, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు విశ్వాసం లేక కాంగ్రెస్‌ను వదిలిపెడుతున్నారు. దీనికి మమ్మల్ని నిందిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి కేవలం ఎమ్మెల్యేలు పోవడంలేదు. మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, ప్రతాప్‌రెడ్డి, భీష్య కిష్టయ్య ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరారు. మరో మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు కాకుండా మొత్తానికి మొత్తంగా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. దీనిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా మమ్మల్ని అనడం హాస్యాస్పదం. కాంగ్రెస్‌ నాయకత్వంలో చేవలేదని మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు. మా క్యాడర్‌లో జోష్‌లేదు, మా నాయకత్వానికి చేవలేదు, ఈ పార్టీకి భవిష్యత్‌లేదని అంటున్నారు. ఆత్మవిమర్శ చేసుకోకుండా మాపై ఏడవడం ఎంతవరకు సమంజసం. రాజకీయ పార్టీల్లో చేరికలు, మార్పులు ఎన్నికల సమయంలో దేశంలో తెలంగాణలోనే జరుగుతున్నాయా? ఢిల్లీలో రాహుల్‌గాంధీ ప్రతిరోజూ ఏదో ఒక బీజేపీ ఎంపీకి కండువా కప్పుతున్నారు. ఇతర పార్టీల నేతలకు అమిత్‌షా ఇలాగే చేస్తున్నారు. రాజకీయ మార్పులు, చేర్పులు ఇంత సర్వసాధారణంగా జరుగుతున్నప్పుడు మమ్మల్ని టార్గెట్‌ చేయడం ఏమిటి? వీటన్నింటికిమించి మొన్న శాసనసభ ఎన్నికలకు ముందు మా చేవేళ్ల ఎంపీ, మా పార్టీ బీ–ఫామ్‌పైన గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరలేదా? మేం ఆరోజు గొంతెత్తి అరిచామా? ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్‌డే అని అన్నామా? ఎదుర్కొన్నాం.

ప్రజల్లోకి వెళ్లి తీర్పు కోరాం. రాజకీయాలంటేనే గౌరవం పోయే విధంగా, పార్టీ మార్పులు తప్పన్నట్లుగా కాంగ్రెస్‌ వాళ్లు మాట్లాడుతున్నారు. గవర్నర్‌ను కలిసి లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని మాట్లాడారు. ఇలా అనేటప్పుడు కాంగ్రెస్‌ పక్కన టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఉన్నారు. రమణకు చెందిన టీడీపీ ఏపీలో 26 మంది వైఎస్సాఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. కాంగ్రెస్‌ వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆపార్టీతో పొత్తుపెట్టుకుని చంద్రబాబుతో కలిసి గల్లీగల్లీలో ప్రచారం చేశారు. మీరు చేస్తే సంసారం. ఇంకొకరు చేస్తే వ్యభిచారామా? ఇదేం నీతి. మాకు నీతులు చెప్పడమే మీ సిద్ధాంతమైతే.. మా ఎంపీలను, ఎమ్మెల్సీలను ఎందుకు తీసుకున్నారు. ఇది మొదటిసారా? లోక్‌పాల్‌కు వెళ్లాలంటే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు. అసరమైతే పదవికి రాజీనామా చేస్తామని టీఆర్‌ఎస్‌లోకి చేరుతామని ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నారు కదా? దీంట్లో ఇబ్బంది ఏముంది? ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌లో చేరతామని చెప్పిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజలు తీర్పు ఇస్తారు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. కాంగ్రెస్‌ మమ్మల్ని ఇటుకతో కొట్టాలని చూస్తే రాయితో కొట్టే సత్తా మాకుంది. వారు చేయని ఏ పనీ మేం చేయలేదు.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు.. మాకే కాదు దేశం మొత్తానికి ఇలా చేయడం నేర్పింది కాంగ్రెస్‌ పార్టీయే. ఆ పార్టీ వారే ఫిరాయింపులను, మార్పులను మొదలుపెట్టారు, ప్రోత్సహించారు. ఇప్పుడు వారి విషయానికి వచ్చే సరికి ‘సేవ్‌ డెమోక్రసీ’అంటున్నారు. సేవ్‌ కాంగ్రెస్‌ అని పెట్టుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. కాంగ్రెస్‌ పునాదులు కదులుతుంటే ఆ పార్టీకి ఇబ్బంది ఉందేమోగానీ ఆ పార్టీని భరించే స్థితిలో ప్రజలు లేరు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కనుమరుగైంది. చాలా రాష్ట్రాల్లో ఉనికి లేకుండా పోయింది. తెలంగాణలోనూ ఆ పరిస్థితి వచ్చేలా ఉంది. ఎందుకిలా జరుగుతోందని ఇప్పటికైనా వారు ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచింది. ఎంతసేపు వేరే అజెండా పెట్టుకుని, వేరే ప్రయత్నాలు చేయకుండా ప్రజల పక్షాన ఉండి, ప్రజల పక్షాన మాట్లాడితే మంచింది. అభివృద్ధి నిరోధకంగా ఉంటే వారికి మంచిది కాదు. 
 
బీజేపీ ఆలోచించుకోవాలి 
దేశ రాజకీయాల్లో వాళ్లిద్దరే ఉండాలిగానీ.. మూడోవాడు ఉండొద్దనే దురుద్దేశంతో ఆ పార్టీలు ఇలా చేస్తుంటాయి. మేం ఎవరి బీ–టీం కాదు. తెలంగాణ ప్రజల ఏ–టీం. ఇలాగే కొనసాగుతాం. తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు. మొన్న బీజేపీ వాళ్లు అంత మాట్లాడితే ఏం జరిగింది? నరేంద్ర మోదీ, అమిత్‌ షా, 6 రాష్ట్రాల సీఎంలు, 11 మంది కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేస్తే 103 స్థానాల్లో బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. మోదీ, షా స్వయంగా వచ్చి ప్రచారం చేసిన మహబూబ్‌నగర్‌లో బీజేపీకి 3వేల ఓట్లు రాలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో బీజేపీ వాళ్లు ఆలోచించుకోవాలి. 
 
మన్మోహన్, మోదీ ప్రధాని అవుతారని అనుకున్నారా? 
కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని ముంచిన పార్టీలని దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు బలంగా భావిస్తున్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలని కోరుకుంటున్నారు. దేశంలో బలైన ప్రాంతీయపార్టీల నేతలున్నారు. మన్మోహన్‌సింగ్‌ దేశానికి ప్రధాని అవుతారని, పదేళ్లు పరిపాలలిస్తారని 2003లో ఎవరైనా అనుకున్నారా? నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారని 2012లో ఎవరైనా నమ్మారా? ఈ విషయాలు అతిశయోక్తిగా అనిపించవచ్చుగానీ నిజం. ఫెడరల్‌ ఫ్రంట్‌కు నాయకుడు ఎవరని కొందరు అడుగుతున్నారు. వాళ్లకు ఈరోజు అర్థం కాకపోవచ్చు. రేపు ఎవరవుతారో చూద్దాం. ప్రజల ఆశీర్వాదం ఉంటే దేశంలో మోదీకి, రాహుల్‌కు దీటైన సమర్థులు, బలమైన నాయకులు వస్తారు. ఎస్పీ, బీఎస్పీలు అభ్యర్థులను పెడితే రాయ్‌బరేలి, అమేథీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గెలవరు. ఎస్పీ, బీఎస్పీల దయతోనే అక్కడ కాంగ్రెస్‌కు 2,3 సీట్లు వస్తయి. సొంత లోక్‌సభ స్థానం అమేథీలో మున్సిపల్‌ చైర్మన్‌ను గెలిపించుకోలేని రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నప్పుడు.. తెలంగాణలో రెండోసారి 75% సీట్లు, 50% ఓట్లతో సీఎం అయిన కేసీఆర్‌ నాయకత్వం ఉంటే బాగుంటందని టీఆర్‌ఎస్‌ వాళ్లు అనుకుంటే తప్పేముంది! 
 
టిక్కెట్లు రాని వారికి ఇతర అవకాశాలు 
బాధాకరం అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో.. లోక్‌సభ అభ్యర్థిత్వాల్లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. అవకాశంరానికి వారికి బాధ ఉంటుంది. సీఎం కేసీఆర్‌ వారిని గుర్తించి సముచితమైన అవకాశాలు ఇస్తారు. 3 చోట్ల తప్పనిసరిగా మార్చాల్సిన పరిస్థితి. మల్లారెడ్డి, సుమన్‌ ఎమ్మెల్యేలుగా గెలిచారు. సుఖేందర్‌రెడ్డి పోటీ చేయనని చెప్పారు. మహబూబ్‌నగర్, పెద్దపల్లి, ఖమ్మంలో స్థానిక పరిస్థితులు, ఎమ్మెల్యేలు చెప్పిన విషయాల ప్రకారం మార్పులు చేయాల్సి వచ్చింది. టిక్కెట్లు రానప్పుడు కడుపుమంట సహజం. టిక్కెట్‌ రాకపోతే పార్టీ చెడ్డది, వస్తే మంచిది అనేది సరికాదు. కారణాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సమీకరణలు, స్థానిక పరిస్థితులు, ఎమ్మెల్యే చెప్పే అంశాలను బట్టి టిక్కెట్ల కేటాయింపులు ఉంటాయి. పుల్ల విరుపు మాటలు రాజకీయాల్లో మంచిది కాదు. టిక్కెట్‌ రాకున్నా పార్టీలో కొనసాగే వారికి కచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. 
 
మా నాయకుడు కేసీఆర్‌ 
మా పార్టీలో, మా అభ్యర్థులకు ఒకటే స్పష్టత ఉంది. సీఎం కేసీఆర్‌ మా నాయకుడు. అన్నీ ఆయనే. ప్రజలకు కేసీఆర్‌పై విశ్వాసం ఉంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. ‘సారు, కారు, పదహారు, ఢిల్లీలో సర్కారు’నినాదంతో ఎన్నికల్లో పనిచేస్తున్నాం. తెలంగాణ ప్రజలను రాజకీయ శక్తిగా మార్చి, సమాఖ్యను మనం ముందుండి నడిపించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. సమాఖ్య కూటమిని తయారు చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడాలి. ఇతరులకు మన శక్తిని ధారపోయడం కాకుండా శాసించే పరిస్థితిని తేవాలి. కాంగ్రెస్‌ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీకి, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం. టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రజలకు లాభం’’  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top