మోదీ, ఒవైసీలకు భయపడం

KTR calls BJP a Bharatiya Jhoot Party - Sakshi

భయపడితే ప్రజలకు భయపడతం

బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ

అచ్చే దిన్‌ అని జనం సచ్చే దిన్‌ తెచ్చారు

చీపురివ్వడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘కేసీఆర్‌ ఒవైసీకి భయపడతాడని అమిత్‌షా అంటాడు. మేము ఒవైసీకి, మోదీకి భయపడం. భయపడితే గల్లీల్లోని ప్రజలకు భయపడతం. ఒవైసీలు, మోదీలు మాకు బాసులు కారు’ అని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఒకరు మతాలు, మరొకరు ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులను సమాన దృష్టితో చూశామని, తమది లౌకిక పార్టీ అన్నారు. ముస్లింలను ఓట్లేసే యంత్రాలుగా కాంగ్రెస్, బీజేపీలు చూసినట్లు తాము చూడమన్నారు. కులం, మతం, ప్రాంతం వివక్ష లేకుండా నాలుగేళ్లలో అందరినీ కలుపుకుపోయే యత్నం చేశా మన్నారు.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సనత్‌నగర్‌ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌ మినీ ఇండియా అని, అన్ని రకాల ప్రజలు ఇక్కడి గంగా జమున తహజీబ్‌కు అనుగుణంగా ప్రశాంతంగా కలసిమెలసి ఉంటున్నారని కొనియాడారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని షా చెప్పింది వింటే చిన్నపుడు దూరదర్శన్‌లో చూసిన ‘ముంగేరిలాల్‌ కే హసీన్‌ సప్నే’టీవీ సీరియల్‌ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ‘ఆయన అమిత్‌ షా కాదు. భ్రమల్లో బతికే భ్రమిత్‌ షా. ఉన్న 5 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటేనే ఎక్కువ’ అని అన్నారు. ఎన్నికల్లో అన్ని సీట్లు ఊడ్చేస్తాం.. పూడ్చేస్తాం అని కిషన్‌రెడ్డి అంటున్నారని, హైదరాబాద్‌లో 5 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నా ఒక్క కార్పొరేటర్‌ను గెలుచుకోలేకపోయారన్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు.  

ఏదీ ఆ డబ్బు?
అచ్చేదిన్‌ తెస్తామని చెప్పి ప్రజలు సచ్చే దిన్‌ తీసుకొచ్చారని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని కేటీఆర్‌ తూర్పారబట్టారు. సొంత పైసల కోసం బ్యాంకుల వద్ద బిచ్చగాళ్లలా అడుక్కునే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. బీజేపీ పాలనలో ఏ బ్యాంకు మూతబడుతుందో, ఎవడు డబ్బులతో ఉడాయిస్తాడో తెలియక బ్యాంకుల్లో డబ్బులు దాచుకోడానికి ప్రజలు భయపడుతున్నారన్నారు.

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికితీసి పేదలకు పంచుతామని మోదీ చెప్పారని, ఎంత నల్లధనాన్ని పేదలకు పంచారని నిలదీశారు. అందరి చేతికి చీపురిచ్చి స్వచ్ఛ భారత్‌ అనడం తప్ప 4 ఏళ్లలో బీజేపీ దేశానికి చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి రూ.2.30 లక్షల కోట్లు ఇచ్చామని షా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ మండిపడ్డారు. ‘సొంత డబ్బులిచ్చినట్లు షా చెప్పుకున్నారు. రాష్ట్రాలు లేనిది కేంద్రం ఎక్కడిది?’అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో తెలంగాణ 17.17 శాతం వృద్ధి సాధించి కేంద్రానికి భారీగా పన్నులు చెల్లించిందని, రాష్ట్రం కట్టిన పన్నులనే కేంద్రం తిరిగి ఇచ్చిందన్నారు.
 
వారంలో ‘ఎల్బీనగర్‌– అమీర్‌పేట్‌’ మెట్రో
తెలుగు రాష్ట్రాల ప్రజలను బీజేపీ మోసం చేసిందని, బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని కేటీఆర్‌ విమర్శించారు. ఐటీఐఆర్, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, హైకోర్టు విభజన.. ఇలా ఎన్నో అంశాల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిన బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేసీఆర్‌ హయాంలో తెచ్చిన 400 కొత్త పథకాల జాబితా అమిత్‌ షాకు పంపుతామని, కేంద్రంలో ఎన్డీయే పాలనలో పేదల కోసం చేసిన ఒక్క పనైనా చెప్పగలరా? అని నిలదీశారు. 9 నెలల ముందే శాసనసభను రద్దు చేసి ప్రజలపై అదనపు భారం వేశారన్న షా ఆరోపణలను కేటీఆర్‌ తిప్పికొట్టారు.

‘2002లో మోదీ గుజరాత్‌ సీఎంగా 9 నెలల ముందే ఎన్నికలకు వెళ్లలేదా? 2004లో వాజ్‌పేయి ముందస్తుకు వెళ్లలేదా?’అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలెందుకు అని అమిత్‌షా అడిగారని.. సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 186 కేసు లు వేశారని, కాంగ్రెస్‌లో అసహనం పెరిగి వికృత రూపం దాల్చడంతోనే ముందస్తుకు వెళ్లామన్నారు. తొలి 9 నెలలు అధికారులు లేక పనులు జరగలేదని, మళ్లీ 9 నెలల ముందు ఎన్నికలకు పోతున్నామని, వాస్తవంగా పాలించింది 3 ఏళ్లేనని చెప్పారు. వారంలో ఎల్బీనగర్‌–అమీర్‌పేట రైల్వే మార్గాన్ని ప్రారంభిస్తామన్నారు.  

కాంగ్రెసోళ్లు వణికి సస్తున్నరు!
రాహుల్‌ వస్తున్నారని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారని, రాహుల్‌ కాలు పెడితే గుజరాత్, కర్ణాటకలో గెలవాల్సిన కాంగ్రెస్‌ ఓడిపోయిందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గం అమేథీలో అఖిలేశ్‌ యాదవ్‌ సహకారం లేకుండా రాహుల్‌ గెలవలేరన్నారు. అమేథీ, రాయ్‌బరేలీలో ఎస్పీ పోటీ చేస్తే రాహుల్, సోనియాలు ఎగిరిపోతారన్నారు. హైదరాబాద్‌లో సొంతంగా గెలిచే దమ్ము లేక టీడీపీ, సీపీఐ, మరెవరినో కలుపుకుని మహాకూటమిగా ఏర్పడేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని, ఇది తెలంగాణ పాలిట స్వాహా కూటమి అని అన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా, అర్ధరాత్రి వచ్చినా సిద్ధం, రాష్ట్రానికి కేసీఆర్‌ పీడ విరిగిపోతుందని టీఎస్‌పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ చెప్పుకుంటే.. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం ముందు కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఎన్నికలకు తొందరెందుకు.. ఆర్నెళ్ల తర్వాత పెట్టాలని కోరారన్నారు. బయటికి డైలాగులు చెబుతున్న కాంగ్రెస్‌ నేతలు ఎన్నికలంటే లోపల భయంతో వణికి సచ్చిపోతున్నారని తెలిపారు. ఎన్నికల వాయిదా కోసం ఓటరు లిస్టు సరిగ్గా లేదని కుంటి సాకులు చెప్పుతున్నారన్నారు. కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top