ఎమ్మార్పీఎస్‌ పై ఎందుకీ కక్ష సాధింపు?

Krishna Madiga question to CM KCR - Sakshi

సీఎం కేసీఆర్‌కు మంద కృష్ణమాదిగ ప్రశ్న

హైదరాబాద్‌: ‘ఎమ్మార్పీఎస్‌ సభలకు మాదిగ ఎమ్మెల్యేలను, ఎంపీలను హాజరు కానివ్వరు. అరెస్టులు చేస్తారు. బెయిల్‌ కూడా లభించని కేసులు పెట్టి జైలుకు తరలిస్తారు. కానీ, ఇతర కులాల సభలకు సహకరించడంతోపాటు ప్రజాప్రతినిధులను, టీఆర్‌ఎస్‌ శ్రేణులను పంపిస్తారు. ఎమ్మార్పీఎస్, మాదిగల పట్ల సీఎం కేసీఆర్‌ ఎందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు?’ అని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు.

ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌పై తమకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమసమయంలో మిలియన్‌ మార్చ్, ఇతర ఆందోళన కార్యక్రమాల్లో విధ్వంసాలు జరిగాయి. కేసీఆర్, ప్రొ.కోదండరాంపై అనేక కేసులు నమోదయ్యాయి. అయినా, అప్పటి ముఖ్యమంత్రులెవరూ వారిని అరెస్ట్‌ చేసి జైలులో పెట్టలేదు కదా’అని గుర్తుచేశారు. కేవలం ఎమ్మార్పీఎస్‌ ఉద్యమాన్ని నీరుకార్చేందుకే కేసీఆర్‌ కుట్రలు పన్ని మంత్రి కడియం శ్రీహరితో ప్రకటనలు ఇప్పిస్తున్నారని మందకృష్ణ విమర్శించారు.

 ‘ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు టీఆర్‌ఎస్, సీఎం మద్దతు తెలిపితే ఢిల్లీలోనే దీక్షలు చేస్తాం. అందుకు మరో 24 గంటల సమయం ఇస్తున్నామని మంత్రి కడియం శ్రీహరికి తెలిపాం.’అని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగే దీక్షకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వకుంటే హైదరాబాద్‌లోనే దీక్షలు చేపడతామని తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు రాగటి సత్యం, డాక్టర్‌ కాశీం, ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్, రాష్ట్ర కోఆర్డినేటర్‌ పురుషోత్తం, ఓయూ ఇన్‌చార్జి పల్లెర్ల సుధాకర్, కొమ్ము శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top