కొంగునాడు.. నాయకన్‌ ఎవరు?

Kongunadu Constituency Review on Lok Sabha Election - Sakshi

కొంగునాడులోని 8 లోక్‌సభ స్థానాల్లో తీవ్ర పోటీ

తమిళనాడు–కర్ణాటక సరిహద్దుల్లోని ప్రాంతం కొంగునాడు. బెంగళూరుకి తూర్పున ప్రారంభమై, పశ్చిమాన ఉన్న కేరళ సరిహద్దుల్లోని పాలక్కాడ్‌ వరకూ ఉండే ప్రాంతాన్ని కొంగునాడు అంటారు. చీరకొంగు ఆకారంలో 450 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాంతంలో మొత్తం 8 పార్లమెంటు సీట్లున్నాయి. పారిశ్రామిక రంగానికి ప్రసిద్ధిగాంచిన తమిళనాడులోని ఈ ప్రాంతం ఆ రాష్ట్ర రాజకీయ, సామాజిక రంగాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ద్రవిడ దిగ్గజాలైన ఈవీ రామస్వామి నాయకర్‌ లేదా పెరియార్‌లాంటి ప్రముఖ సామాజిక ఉద్యమకారులది కొంగునాడుకావడం విశేషం.

ఆదాయంలో సగం ఇక్కడి నుంచే..
ఈ ప్రాంతంలోని ప్రతి జిల్లాలోనూ ఒక్కో ప్రత్యేకమైన వస్తువుల ఉత్పత్తి జరుగుతోంది. తమిళనాడు రాష్ట్ర ఆదాయంలో దాదాపు 40 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తుంటుంది. కోయంబత్తూర్‌ టెక్స్‌టైల్స్‌కి ప్రాచుర్యం పొందితే, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు ఈరోడ్‌లోనూ, కరూర్‌లో ఆటోమొబైల్‌ బాడీ బిల్డింగ్స్‌ ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పొందాయి. పొలాచీలో కోళ్ల పరిశ్రమ, నీల్‌గిరి కొండ ప్రాంతమంతా టీ, కాఫీ ఉత్పత్తులకూ, సేలమ్‌ స్టీల్, టెక్స్‌టైల్, ఆగ్రో ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచాయి. నిత్యం వాణిజ్య లావాదేవీలతో బిజీబిజీగా ఉండే సారవంతమైన ఈ ప్రాంతం ప్రస్తుతం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. ఇక్కడ ఏఐడీఎంకే– బీజేపీ పొత్తు పెట్టుకొని.. ఎంకె స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే–కాంగ్రెస్‌తో తలపడుతోంది. రెండు వర్గాలుగా ఈ ఎన్నికల బరిలోకి దిగిన ఈ నాలుగు పార్టీలూ తమ బలాబలాలను తేల్చుకోబోతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడీ పళని స్వామి కూడా సేలం జిల్లాకి చెందిన వారు కావడంతో ఇక్కడ ఎన్‌డీఏ ఓటమి చెందితే అది ఆయనకు నష్టం కలగజేస్తుందన్న మాటే. అయితే స్థానిక కుల సమీకరణలు ఏఐడీఎంకేకి అనుకూలంగా ఉంటే, స్థానికంగా ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఎన్‌డీఏకి ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం గమనించాల్సిన విషయం.

కోయంబత్తూర్‌: బీజేపీ–సీపీఎం హోరాహోరీ
తమిళనాడులోని రెండవ అతిపెద్ద నగరమైన కోయంబత్తూర్‌ పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. యూపీఏలోని సీపీఎం అభ్యర్థి సీఆర్‌ నటరాజన్, బీజేపీ నుంచి సీపీ రాధాకృష్ణన్‌ ఈ స్థానంలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. తమిళనాట బీజేపీకి పెద్దగా అనుకూల వాతావరణం లేనప్పటికీ తొలిసారిగా కొంగునాడు ప్రాంతంలో 1998లో బీజేపీ ఖాతా తెరిచింది. ఇదే సీపీ రాధాకృష్ణన్‌ కోయంబత్తూరు నుంచి కాషాయ పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1999లో కూడా తిరిగి గెలిచారు. మళ్లీ 15 ఏళ్ల తరువాత ఈసారి కూడా బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్‌ గెలుపు ఖాయమన్న ధీమాతో పోటీకి దిగారు. రాధాకృష్ణన్‌తో తలపడుతోన్న మాజీ ఎంపీ నటరాజన్‌కు సైతం పార్లమెంటులో అడుగుపెట్టేందుకు డీఎంకే కార్యకర్తలు, శ్రామికవర్గం మద్దతు లభిస్తోంది. ‘ఉన్నత వర్గాలు, అగ్రకులాలు బీజేపీ పక్షాన ఉండొచ్చు, అయితే అట్టడుగు కులాలు, సామాజిక వర్గాలు మాత్రం సీపీఎం పక్షానే ఉన్నారు. కోయంబత్తూర్‌ వాణిజ్య కేంద్రం. దీంతో స్థానిక వ్యాపార వర్గాలు డీమానిటైజేషన్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలే ఇక్కడ అధికం. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. నిరుపేద, కార్మికవర్గం అంతా సీపీఎం పక్షాన ఉంది. దీంతో ఇక్కడ గెలుపు ఎవరి వశమవుతుందో చెప్పడం కష్టంగానే అనిపిస్తోంది. 50–50 చాన్సెస్‌ ఉండొచ్చు’ అని రాజకీయ నిపుణులు రజత్‌ కుమార్‌ అంచనా వేస్తున్నారు. హిందూ రాడికల్‌ భావజాలానికి ప్రతీకగా భావించే హిందూ మన్నాని, హిందూ మక్కల్‌ కచ్చిలాంటి సంస్థల ప్రభావం కూడా కోయంబత్తూర్‌లో కొంతవరకు ఉంది. హిందూ మున్నానికి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్నాయి. అయితే హిందూ మక్కల్‌ కచ్చి మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌కి అతీతంగా ఉన్నట్టు స్థానిక రాజకీయ నిపుణుల అభిప్రాయం.

సేలం: డీఎంకే–అన్నాడీఎంకే సవాల్‌
తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి బలమైన పునాదిగా నిలిచిన ప్రాంతం సేలం. డీఎండీకే నుంచి ఇటీవలే డీఎంకేలో చేరిన ఎస్‌ఆర్‌.పార్థిబన్‌ను ఏఐఏడీఎంకే అభ్యర్థి కెఆర్‌ఎస్‌ శరవణన్‌కి వ్యతిరేకంగా బరిలోకి దింపుతున్నారు. ఇక్కడ ఏఐఏడీఎంకే ఓటమి పాలైతే దాని ప్రభావం తమిళనాడు అంతటా ఉంటుందన్న భయంతో తానే స్వయంగా రంగంలోకి దిగి తమ అభ్యర్థి శరవణన్‌ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో డీఎంకే కూడా గెలుపు కోసం తీవ్రంగా యత్నిస్తోన్న నేపథ్యంలో ఏఐఏడీఎంకే గెలుపు అంత సులభమేమీ కాదని స్థానిక చిరు వ్యాపారస్తుడు సురేష్‌ చెబుతున్నారు. పన్నీరు సెల్వంకీ, పళని స్వామికీ సరైన ప్రత్యామ్నాయం స్టాలిన్‌ అని భావిస్తున్నాననీ, అందుకే తానీసారి డీఎంకేకి ఓటు వేయబోతున్నానని సురేష్‌ చెప్పారు. సేలం పట్టణంలో డీఎంకే బలంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఢీ అంటే ఢీ అంటూ సమాన పోటీ పరిస్థితులు ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో స్థిరత్వం కోసం ఏఐడీఎంకే–బీజేపీ పొత్తులో కనీసం సేలం, కోయంబత్తూర్‌ రెండు సీట్లను గెలుచుకోవడం ఆ పార్టీలకు తప్పనిసరి. ఒకవేళ ఈ రెండు సీట్లలో ఏఐఏడీఎంకే ఓటమి పాలైతే తమిళనాడు మొత్తం డీఎంకే, కాంగ్రెస్‌కు క్లీన్‌ స్వీప్‌ అవుతుందని స్థానిక పాత్రికేయుడు వేలాయుధన్‌ చెబుతున్నారు.

2014: కొంగునాడు లోక్‌సభ (8) ఎన్నికల ఫలితాలు
కోయంబత్తూర్‌ – నాగరాజన్‌.పి(ఏఐఏడీఎంకే), ఈరోడ్‌ – సెల్వకుమార చిన్నాయన్‌.ఎస్‌.
(ఏఐఏడీఎంకే), తిరుప్పూర్‌ – వి.సత్యభామ (ఏఐఏడీఎంకే), కరూర్‌ – తంబిదురై. ఎం (ఏఐఏడీఎంకే),
పొలాచీ – మహేంద్రన్‌.సి (ఏఐఏడీఎంకే), నీల్‌గిరీస్‌ –గోపాలకృష్ణన్‌.సి, (ఏఐఏడీఎంకే), సేలం – పన్నీర్‌ సెల్వం (ఏఐఏడీఎంకే), నమక్కళ్‌ – సుందరం పి.ఆర్‌(ఏఐఏడీఎంకే).

ఇక్కడిలా..
వస్త్ర పరి శ్రమ, ఆగ్రో ఉత్పత్తులకు ప్రసిద్ధి చెంది న ఈరోడ్‌లో ఎండీఎంకే అభ్యర్థి, మాజీ ఎంపీ గణేష్‌ మూర్తి పొత్తులో భాగంగా డీఎంకే సింబల్‌పై పోటీకి దిగుతున్నారు. ఈయనపై ఏఐఏడీఎంకే జి.మణిమారన్‌ పోటీ చేస్తున్నారు. ∙ఐఏడీఎంకే ప్రముఖ నాయకుడు, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎం తంబిదురై కరూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతిమణితో తలపడబోతున్నారు. తనకున్న సొంత పలుకుబడిపైనే ఆయన ఆధారపడ్డారు.  
యూపీఏ పొత్తుల ఒప్పందంలో భాగంగా కొంగు మున్నేట్ర కజగం (కేఎంకే)కి నమక్కల్‌ సీటు కేటాయించారు. ఏఐఏడీఎంకేకి చెందిన డీఎల్‌ఎస్‌ కలియప్పన్‌పై కేఎంకేకి నుంచి ఏకేపీ సిన్‌రాజ్‌ పోటీ చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మాదిరిగానే కొంగునాడుని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న డిమాండ్‌తో పనిచేస్తోన్న కేఎంకే అదే సెంటిమెంటుని ఉపయోగించుకొని పార్లమెంటులో అడుగిడేందుకు యత్నిస్తోంది. కేఎంకే అనుయాయులంతా గౌండర్‌ సామాజిక వర్గానికి చెందినవారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం నుంచే 6 లక్షల ఓట్లు పోలయ్యాయి.
సీపీఐకి పట్టున్న తిర్‌పూర్‌లో ఏఐఏడీఎంకే నుంచి ఎంఎస్‌ఎం ఆనందన్‌పై సీపీఐ అభ్యర్థి సుబ్బరాయన్‌ పోటీకి దిగుతున్నారు. ఇప్పటికీ ఇక్కడి వస్త్ర పరిశ్రమలో పలు కార్మిక సంఘాలు బలంగా ఉండడంతో డీఎంకే మద్దతుతో సీపీఐ ఈ స్థానంలో గెలుపుబావుటా ఎగుర వేసేందుకు ప్రయత్నిస్తోంది.
పొలాచీలో డీఎంకే అభ్యర్థి షణ్ముగసుందరన్‌ ఎన్నికల సమరంలో  ఏఐఏడీఎంకే అభ్యర్థి మహేంద్రన్‌తో తలపడుతున్నారు.
నీలగిరి కొండల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి త్యాగరాజన్‌పై పోటీ చేస్తోన్న డీఎంకే నాయకుడు, టెలికామ్‌ మాజీ మంత్రి ఎ.రాజా విజయం తథ్యమని స్థానికులు భావిస్తున్నారు. చివరకు రాజాను విమర్శించే వారు సైతం ఈ విషయాన్ని ఒప్పుకుంటుండటం విశేషం.

గౌండర్, నాయకర్లే నిర్ణేతలు
కొంగునాడు రాజకీయాలను గౌండర్‌ సామాజిక వర్గం, నాయకర్లు శాసిస్తున్నారు. ఎంజీ రామచంద్రన్‌ కాలం నుంచీ, జయలలిత పాలనలోనూ ఇక్కడి ప్రజలు ఏఐఏడీఎంకేకే పట్టం కడుతున్నారు. జయలలిత మరణానంతర పరిణామాలు ఏఐఏడీఎంకే తిరిగి పుంజుకోవడం అక్కడ కష్టతరంగా మారింది. శతాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్‌ నుంచి వలసవెళ్లిన నాయుళ్లు కొంగునాడులో అనేక పరిశ్రమలను, వివిధ వ్యాపారాలను స్థాపించారు. అలాగే గౌండర్స్‌ ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ రెండు సామాజిక వర్గాలతో పాటు ఎస్‌సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్‌ జనాభా కూడా అధికంగా గల కొంగునాడు భిన్న సామాజిక వర్గాల కలయికగా ఉంది. దీనికి తోడు జయలలిత సహచరి, ఏఐఏడీఎంకే నాయకురాలు ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళా నటరాజన్‌ అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌ ప్రభావం కూడా ఇక్కడి ఎక్కువగానే ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఈపీఎస్, ఓపీఎస్‌ శిబిరాల ఓట్లను దినకరన్‌ పార్టీ ఏఎంఎంకే చీల్చే అవకాశం ఉందని అంచనా.   

‘కమల్‌’ చీల్చే ఓట్లెవరివో?
ఇక సినిమా హీరో కమల్‌హాసన్‌ పార్టీ సైతం కొంగునాడు పరిధిలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీకి దిగుతోంది. అయితే ఈ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఇక్కడ స్థానిక అంశాలే తమిళనాడు ఎన్నికలను ప్రభావితం చేసే పరిస్థితులున్నాయి. తమిళనాడులో గత ఏడాదిగా మోదీకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి. అలాగే ఏఐఏడీఎంకేలోని చాలామంది కార్యకర్తలు ఈపీఎస్‌–ఓపీఎస్‌ బీజేపీతో చేతులు కలపడాన్ని కూ డా వ్యతిరేస్తున్నారు. దీనితో పాటు దేశవ్యాప్తంగా మెడికల్‌ విద్యార్థుల కోసం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నీ ట్‌ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారన్న గతకాలపు భావజాలం ఇం కా కొనసాగుతూనే ఉంది. వీట న్నిటికీ తోడు తమ పంటపొలాలు నాశనం అవుతున్నాయంటూ చెన్నై–హోసూరు ఎనిమిది లైన్ల గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేని ఇక్కడి ప్రజ లు, రైతులు తీవ్రం గా వ్యతిరేకిస్తున్నారు. ఇక మం చినీటి సమస్య అక్కడ ఉండనే ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top