కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యం 

Komatireddy comments on CM KCR - Sakshi

ఆయన మళ్లీ గెలిస్తే ప్రజలు బిచ్చగాళ్లవుతారు: కోమటిరెడ్డి 

అందరం కష్టపడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాం 

సీఎం కార్యాలయం నుంచి కోమటిరెడ్డికి శుభాకాంక్షల లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే రాష్ట్ర ప్రజలు బిచ్చగాళ్లవుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలందరం కష్టపడి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. బుధవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభిమానుల మధ్య పుట్టినరోజు కేక్‌ కట్‌ చేసిన కోమటిరెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా రైతులను పట్టించుకోని కేసీఆర్‌.. ఎన్నికలు సమీపిస్తున్నాయని ఇప్పుడు ప్రభుత్వ డబ్బుతో వారి ఓట్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికన్నా రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇస్తే వారు సంతోషిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలపైనా కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో అభ్యర్థులను అధిష్టానం నిర్ణయిస్తుందని.. అలా కాకుండా రాష్ట్రంలో ఎవరైనా ఎవరికైనా టికెట్లు ప్రకటిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. తాను 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నా ఎలాంటి పదవులూ ఆశించలేదని చెప్పారు. మొన్ననే పార్టీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి పదవులు ఆశించడం సరికాదని పేర్కొన్నారు.

సీఎం శుభాకాంక్షల్లో ‘ఎమ్మెల్యే’! 
కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా అందరు ఎమ్మెల్యేల్లాగానే ఆయనకూ ముఖ్యమంత్రి కార్యాలయం శుభాకాంక్షల లేఖను పంపింది. సీఎం కేసీఆర్‌ పేరిట ఉన్న ఈ లేఖలో కోమటిరెడ్డిని నల్లగొండ ఎమ్మెల్యేగా పేర్కొనడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  అసలు కోమటిరెడ్డి శాసన సభ్యత్వాన్ని కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. దానిపై అప్పీలు చేసిన నేపథ్యంలో ఇలా ఎమ్మెల్యే అంటూ ‘శుభాకాంక్షల లేఖ’పంపడం వెనుక ఆంతర్యమేమిటో అర్థంకావడం లేదని పలువురు నేతలు పేర్కొంటున్నారు. అయితే సీఎం కార్యాలయంలో నమోదై ఉన్న సమాచారం మేరకు సిబ్బందే లేఖలు పంపిస్తారని... అందులో అర్థాలు వెతకాల్సిన అవసరమేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఎమ్మెల్యే అని ఒప్పుకున్నట్టేగా?
తనకు సీఎంవో నుంచి అందిన శుభాకాంక్షల లేఖపై కోమటిరెడ్డి స్పందించారు. ‘ఏ రాష్ట్ర అసెంబ్లీనైనా ప్రతిపక్షాలు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాయి. మేం కూడా అదే చేశాం. కానీ నాతోపాటు సంపత్‌ను సస్పెండ్‌ చేశారు. కోర్టుకెళితే న్యాయం జరిగింది. కానీ ఎమ్మెల్యేగా నా సభ్యత్వం రద్దు చేసి.. ఏం తెలియనట్టే నాకు విషెస్‌ చెప్తారా..? శుభా కాంక్షల లేఖలో నేను ఎమ్మెల్యేనని పేర్కొన్నారు. నన్ను ఎమ్మెల్యే అని ఒప్పుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేకు ఉండాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top